మీ ఆధార్ కార్డు సురక్షితంగానే ఉందా? ఇలా చెక్ చేసుకోండి!

First Published | Nov 20, 2024, 2:08 PM IST

ఆధార్ ఇన్ఫర్మేషన్ దుర్వినియోగం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే మీ ఆధార్ కార్డు సమాచారం సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ అథారిటీ అందించే సదుపాయాన్ని ఉపయోగించి మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతుందా లేదా అని తెలుసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం రండి. 

ఆధార్ ఇప్పుడు అందరి జీవితాల్లో ముఖ్యమైన కార్డు. ప్రభుత్వ పథకాలు, బ్యాంక్, టెలికాం సేవలు ఇలా ప్రతి అవసరానికి ఆధార్ ప్రధాన గుర్తింపు కార్డుగా ఉంది. పుట్టిన పిల్లలకు కూడా ఆధార్ నంబర్ అలకేట్ అవుతోంది. ఇటీవలే ఆధార్ అప్‌డేషన్స్ చేసుకోవాలని ఆధార్ అథారిటీ సంస్థ (UIDAI) ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి ఉచితంగా అప్డేషన్స్ చేయడానికి అవకాశం ఉంది. ఈ లోగా చేసుకోలేని వారు తర్వాత ఫైన్ కట్టి ఆధార్ అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత ముఖ్యమైన ఆధార్ కార్డు విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఆధార్ సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. 

ఆధార్ కార్డుల్లో సమాచారాన్ని దొంగతనం చేసి అనధికార యాక్సెస్ ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతుంటారు. ఆధార్ వివరాలను మోసగాళ్ళు వారి ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు. దుర్వినియోగం వల్ల ఆర్థిక నష్టాలు, చట్టపరమైన సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా ఆధార్ కార్డు వివరాలు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడం వల్ల దుర్వినియోగం అవుతుంటాయి. అంటే కొన్ని ప్రైవేటు సంస్థలు వినియోగదారుల సమాచారం తీసుకొని ఇతరులకు అమ్ముతుంటారు. వీటిని ఆర్థిక మోసాలకు పాల్పడే వారు వినియోగించి ప్రజల బ్యాంకు అకౌంట్స్ లో ఉన్న నగదును కూడా దొంగిలిస్తుంటారు. ఇటీవల ఇలాంటి నేరాలు బాగా పెరిగిపోయాయి.  


మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ ఆధార్‌ని ఉపయోగిస్తున్నారని మీరు అనుమానం కలిగితే వెంటనే చెక్ చేసుకొనే అవకాశం ఉంది. ఆధార్ అథారిటీ (UIDAI) అందించే సదుపాయంతో మీ ఆధార్ యూసేజ్ ను చెక్ చేయవచ్చు. ప్రయాణం, బ్యాంకింగ్ లాంటి సేవలకు మీ ఆధార్ ఎక్కడ, ఎప్పుడు వాడారో తెలుస్తుంది. దీని కోసం ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. 

ఆధార్ అథారిటీ వెబ్‌సైట్ https://portal.uidai.gov.in కి వెళ్లి, లాగిన్ అవ్వండి.

“Authentication History” చూడండి.

మీరు ఆధార్ వినియోగాన్ని తనిఖీ చేయాలనుకుంటున్న తేదీని సెలెక్ట్ చేసుకోెండి.

ఆ తేదీలో జరిగిన ఆధార్ లావాదేవీల వివరాలు కనిపిస్తాయి. ఏదైనా అనుమానాస్పద లావాదేవీ ఉంటే వెంటనే ఆధార్ అథారిటీకి కంప్లయింట్ చేయండి.

ఆధార్ ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ కూడా ఉంది. మీ ఆధార్ కార్డులో అనుమానాస్పద లావాదేవీ జరిగిందని మీరు భావిస్తే ఆధార్ అథారిటీ 1947 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా help@uidai.gov.in కి మెయిల్ చేయవచ్చు.

భద్రత కోసం ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేసే వెసులుబాటు కూడా ఉంది. ఆధార్ అథారిటీ వెబ్‌సైట్‌లోని "Lock/Unlock Aadhaar" ద్వారా మీ ఆధార్ కార్డులోని వేలిముద్ర, కనుపాప లాంటి బయోమెట్రిక్ డేటాను తాత్కాలికంగా లాక్ చేయవచ్చు. అవసరమైనప్పుడు తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు.

Latest Videos

click me!