పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో, భారతదేశంలో చాలా మంది ఇప్పుడు రోజువారీ ప్రయాణానికి ఎలక్ట్రిక్ స్కూటర్లకు మారుతున్నారు. ఈ పర్యావరణ అనుకూల వాహనాలు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాదు, నగర ప్రయాణాలకు కూడా సౌకర్యవంతంగా ఉంటాయి. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండియాకు చెందిన ఆంపియర్ రియో 80 బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా చెప్పొచ్చు. దీని ధర కేవలం రూ. 59,900 ఎక్స్ షోరూమ్ ధరగా ఉంది. ఆంపియర్ రియో 80లో అదిరిపోయే అత్యాధునిక ఫీచర్లను అందించారు.
కోమాకి ఎక్స్ వన్, ఓలా ఎస్1 జెడ్, జెలియో లిటిల్ క్రేజీ, బౌన్స్ ఇన్ఫినిటీ ఇ.1, ఇంకా హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ వంటి మోడళ్లతో ఇది పోటీపడుతుంది. తక్కువ ధరలో ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది బడ్జెట్ గురించి ఆలోచించే వారికి అద్భుతమైన ఎంపికగా చెప్పొచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో సాధారణంగా హై-ఎండ్ మోడళ్లలో కనిపించే ఫీచర్లను అందించారు.
ఇది కలర్‌ఫుల్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, కీలెస్ స్టార్ట్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. ఆంపియర్ రియో 80 బ్లాక్, రెడ్, బ్లూ, వైట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. దీని ఆధునిక స్టైలింగ్ యువకులకు ఎంతగానో నచ్చుతుంది. అయితే ధర తక్కువ అయినా ఈ స్కూటర్ మోడల్, పనితీరు విషయంలో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదు.
ఆంపియర్ రియో 80 ఒకసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 80 కి.మీ వరకు వెళ్తుంది. అయితే సాధారణంగా 60 కి.మీ వరకు వెళ్ళవచ్చు. కిరాణా షాపింగ్ లేదా చిన్న ఆఫీసు పనుల వంటి వాటికి ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 7 నుండి 8 గంటలు పడుతుంది. రోజువారీ పనుల కోసం ఈ స్కూటీ ఎంతగానో ఉపయోగపడుతుంది.