
హైదరాబాద్ చుట్టూ నిర్మిస్తున్న ట్రిపుల్ ఆర్ (RRR) వెంట రైల్వే లైన్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధం చేసేందుకు అవసరమైన సర్వే నిర్వహించేందుకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో రూల్ 377 కింద ఈ అంశాన్ని ప్రస్తావించగా, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి అధికారికంగా స్పందించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రైల్వే అధికారులు అలైన్‌మెంట్ ఖరారు చేసే పనిలో ఉన్నారు. డీపీఆర్ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర సంస్థలు, ఇతర భాగస్వామ్య సంస్థలతో చర్చలు జరిపి ప్రాజెక్టును అమలు చేసే దిశగా ముందడుగు వేయనున్నారు. అనంతరం నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం లభించిన తర్వాత పూర్తి స్థాయి నిర్మాణానికి అనుమతి ఇవ్వనున్నారు.
ఈ ప్రాజెక్టు దేశంలోనే అరుదైన రైల్వే వలయ ప్రాజెక్టుగా నిలవనుంది. దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదన ప్రకారం సుమారు 392 కిలోమీటర్ల పొడవుతో రింగ్ రైల్ నిర్మించనున్నారు. ఈ మార్గం మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాలను కలుపుతుంది. మొత్తం 26 కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం సుమారు రూ.12,070 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ రోడ్డుకు 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోనే ఈ రైల్వే మార్గం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా “రైల్ ఓవర్ రైల్” వంతెనలు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో రోడ్డు – రైలు మల్టీమోడల్ కనెక్టివిటీ పెరిగి నగరానికి సమీపంలోని జిల్లాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.
రింగ్ రైల్ ప్రాజెక్టులో కీలక కేంద్రంగా మారే ప్రాంతాల్లో గజ్వేల్ ముందువరుసలో ఉంది. ట్రిపుల్ ఆర్ మార్గానికి సమీపంగా ఉండటం, ఇప్పటికే రైల్వే స్టేషన్ ఉండటం వంటి అంశాలు ఈ ప్రాంతానికి భారీ ప్రాధాన్యం తీసుకొస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ స్టేషన్ రింగ్ రైల్ మార్గంలో ముఖ్యమైన జంక్షన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గజ్వేల్, జగదేవ్‌పూర్, ములుగు మండలాల గుండా రైల్వే లైన్ విస్తరించే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతం భవిష్యత్‌లో నగరానికి ప్రత్యామ్నాయ రవాణా కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. రవాణా సౌకర్యాలు పెరిగితే గజ్వేల్ చుట్టూ నివాస కాలనీలు, టౌన్‌షిప్‌లు, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పడే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
గజ్వేల్ ప్రాంతం ఇప్పటికే లాజిస్టిక్స్ పరంగా అభివృద్ధి దిశగా సాగుతోంది. మనోహరాబాద్ సమీపంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఉండటం దీనికి ప్రధాన కారణం. పటాన్ చెరు, నర్సాపూర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఉత్పత్తులను రైల్వే ద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపడం మరింత సులభం అవుతుంది. ఇప్పటికే గజ్వేల్ రైల్వే స్టేషన్ వద్ద ఎరువుల రేక్ పాయింట్ ఏర్పాటు చేశారు. తమిళనాడు కరిగెకల్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కాకినాడ పోర్టుల నుంచి నేరుగా ఎరువులు ఇక్కడికి చేరుతున్నాయి. రింగ్ రైల్ పూర్తయితే ఈ ప్రాంతం సరుకు రవాణా కేంద్రంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల గిడ్డంగులు, గోదాములు, లాజిస్టిక్ హబ్‌లు, ట్రాన్స్‌పోర్ట్ యార్డులు పెరిగే అవకాశం ఉంది.
ట్రిపుల్ ఆర్ రోడ్డు, రింగ్ రైల్ ప్రాజెక్టులు కలిసివస్తే హైదరాబాద్ చుట్టూ కొత్త అభివృద్ధి వలయం ఏర్పడుతుంది. నగర కేంద్రంలో ఉన్న ఒత్తిడి తగ్గి అభివృద్ధి సమీప జిల్లాలకు విస్తరించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా రైల్వే స్టేషన్లు వచ్చే ప్రాంతాల్లో నివాస టౌన్‌షిప్‌లు, కమర్షియల్ ప్రాజెక్టులు, గేటెడ్ కమ్యూనిటీలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. గజ్వేల్, వలిగొండ, మాసాయిపేట, గుళ్లగూడ వంటి ప్రాంతాలు రాబోయే దశాబ్దంలో రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్లుగా మారవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రవాణా సౌకర్యాలు పెరగడం, ఇండస్ట్రియల్ పెట్టుబడులు రావడం, లాజిస్టిక్ హబ్‌లు ఏర్పడటం వంటి కారణాలతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ట్రిపుల్ ఆర్ వెంట రింగ్ రైల్ ప్రాజెక్టు తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధికి మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా పెద్ద మలుపు తిప్పే ప్రాజెక్టుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. కష్టపడి సంపాదించిన మొత్తాన్ని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సూచనలు పాటించడమే ఉత్తమం.