కాకి తలపై తన్నితే ఏమౌతుందో తెలుసా?

First Published | Sep 8, 2024, 4:22 PM IST

కొంతమందిని కాకులు అదేపనిగా తలపై తన్నుతూనే ఉంటాయి. కాకులు తన్నిన వెంటనే చాలా మంది తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటుంటారు. అసలు కాకులు ఎందుకు తలపై తన్నుతాయి? తలపై తన్నడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కొన్ని కొన్ని సార్లు మనం కాకులను ఏమీ అనకపోయినా అవి నేరుగా వచ్చి తలపై తన్నేసి వెళ్లిపోతుంటాయి. ఇలా కాకి తన్నిన వెంటనే చాలా మంది తలస్నానం చేసేసి గుడికి వెళ్తుంటారు. అసలు ఇలా కాకులు ఎందుకు తన్నుతాయని ఎప్పుడైనా ఆలోచించారా? 

జ్యోతిష్యుల ప్రకారం.. కాకులు తలపై తన్నడానికి అసలు కారణం.. మనం మన పూర్వీకులను పూజించడం మర్చిపోయినా లేదా వారికి సరైన సమయంలో తిథి ఇవ్వడం మర్చిపోయామో.. వారు కాకి రూపంలో వచ్చి మనకు గుర్తు చేస్తారట.  

అంతేకాదు  కాకితలపై తన్నితే మీ జీవితంలో శని ప్రభావం మొదలుకాబోతోందని అర్థం వస్తుంది. ఇలా జరగడం వల్ల జీవితంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోబోతున్నారని సూచిస్తుంది. అందుకే కాకి తలపై తన్నితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పూర్వీకులే కాకి రూపంలో వచ్చి మిమ్మల్ని ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నారని అర్థం చేసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

కాకి తలపై కొడితే చేయవలసిన పరిహారం : కాకి తలపై తగిలితే మీరు ఇంటికి వెళ్లి తలపై నువ్వుల నూనె రాసుకుని కులదైవాన్ని పూజించండి. అలాగే శనిదేవున్ని శాంతపరచడానికి ఏదైనా నది, చెరువుల్లో స్నానం చేయండి.

ఆ తర్వాత నిష్టగా భక్తి, శ్రద్ధలతో శనిదేవుని గుడికి వెళ్లి దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు మీపై ఖచ్చితంగా దయ చూపుతాడు. అలాగే కాకికి అన్నం కూడా పెట్టండి. 

అలాగే రాబోయే అమావాస్య నాడు మర్చిపోకుండా మీ పూర్వీకులకు పిండం పెట్టి  వారిని మనస్ఫూర్తిగా పూజించండి. అలాగే ఇతరులకు మీకు చేతనైనంత సహాయం చేయండి. ముఖ్యంగా దివ్యాంగులకు.


కాకి గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? : మీరు కాకికి ఫుడ్ పెడితే.. ఒకవేళ అది తింటే శుభసంకేతంగా పరిగణించాలి. దీనివల్ల మీ కోరికలన్నీ త్వరలోనే నెరవేరుతాయని అర్థం. 

అలాగే మీరు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాకి నీళ్లు తాగడం చూసినట్టైతే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది మీరు బాగా డబ్బు సంపాదించబోతుండటాన్ని సూచిస్తుంది. అలాగే మీ ఇంటికి తూర్పు దిక్కున ఉదయం పూట కాకి అరవడం కూడా శుభప్రదం. 

మీరు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు కాకిని చూడటం కూడా మంచి సంకేతమేనంటున్నారు జ్యోతిష్యులు. దీంతో ఆ రోజు మీరు చేసే పనులన్నీ నెరవేరబోతున్నాయని అర్థం. 

మీ ఇంటి బాల్కనీలో కాకి తన నోట్లో ఏదైనా పెట్టుకుని వస్తే దాన్ని కూడా శుభప్రదంగా భావిస్తారు. దీని వల్ల మీ ఇంట్లో అదృష్టం, సంపదలు పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

అంతేకాకుండా మీ ఇంటి పైకప్పు చుట్టూ చాలా కాకులు కలిసి ఉండటం కూడా శుభప్రదంగానే భావించాలి. అలాగే  ఇంటి దగ్గర కాకిని చూడటం  కూడా శుభంగా భావిస్తారు. దీంతో మీ జీవితంలో డబ్బు, ఆస్తి పెరుగుతుందట. అయితే, మీ ఇంటి దక్షిణ భాగంలో కాకులు తిరగడం మాత్రం  అశుభంగా పరిగణించబడుతుంది. 

Latest Videos

click me!