Ugadi 2022: స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం.. కర్కాటక రాశి జాతకం

First Published | Mar 30, 2022, 5:05 PM IST

స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో కర్కాటక రాశి వారికి సంవత్సరమంతా గురుగోచారం 9వ ఇంటిలో ఉండటం వలన అదృష్టం కలిసివచ్చి పెట్టిన పెట్టుబడి నుంచి ఆదాయం రావటం, అలాగే వారసత్వ సంబంధించి ఆదాయం కానీ, ఆస్తిపాస్తులు కానీ, కలిసి రావడంతో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.  

Cancer

ఈ జాతకాన్ని ప్రముఖ జోతిష్య నిపుణులు  గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ తెలియజేశారు.
ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం, ధర్మపురి, జగిత్యాల జిల్లా.
https://www.onlinejyotish.com

Cancer

ఉద్యోగము
కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  సంవత్సరమంతా  గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో మరియు వ్యక్తిగత జీవితంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు.  ఉద్యోగ పరంగా ఈ సంవత్సరం మధ్యలో మరియు వత్సరాంతంలో కొంత వ్యతిరేక ఫలితాలను పొందుతారు.  ఈ సమయంలో శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఉద్యోగంలో ఎక్కువ పని ఒత్తిడి అలాగే చేసిన పనికి సరైన గుర్తింపు లేకపోవడం జరుగుతుంది.  అయితే గురు గోచారం అనుకూలంగా ఉండటం, పదవ ఇంటిలో రాహువు అనుకూలంగా ఉండటం వలన ఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు.  ఏడవ ఇంటిలో శని గోచారం  వలన  మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు,  చిరాకు కలిగించే వారు మీ వృత్తి ప్రదేశంలో  ఎక్కువ అవుతారు.  మీ పనికి  బదులు తమ పనిని పూర్తి చేసేలా లేదా మీ సహాయాన్ని ఎక్కువగా వాడుకునేలా మీ పైన  ఒత్తిడి పెంచుతారు.  మీరు వారికి సహాయం చేసినప్పటికీ వారి నుంచి ఎటువంటి కృతజ్ఞత లభించదు అంతేకాకుండా సమయం వచ్చినప్పుడు మీ గురించి చెడుగా చెప్పడం కానీ మీ వృత్తి అభివృద్ధిలో ఆటంకాలు కల్పించడం కానీ చేస్తారు. అయితే సంవత్సరమంతా గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీకు చెడు చేసే వారిని గుర్తించి వారిని పక్కన పెట్టడం వలన  వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు.  ముఖ్యంగా  గత సంవత్సర కాలంగా మీరు చేసిన పనికి గుర్తింపు లేక ఇబ్బంది పడినప్పటికీ,  ఈ సంవత్సరం  ఆ గుర్తింపు లభించడమే కాకుండా, గతంలో మీరు పైన కష్టానికి ఫలితం కూడా లభిస్తుంది. ఈ సంవత్సరం  విదేశాల్లో ఉద్యోగానికి ప్రయత్నించే వారికి అనుకూలమైన ఫలితం లభిస్తుంది.  కొత్త ప్రాజెక్టులు కానీ,  లేదా కొత్త ఉద్యోగం రావడం కానీ జరుగుతుంది.  దాని వలన మీరు ఆశించిన విజయాలను పొందుతారు.  మీ హోదా లో అభివృద్ధి జరుగుతుంది అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు పొందారు. ఇతరులు చేయని లేదా ఇతరులచే సాధ్యం కాని పనులు చేయటం వలన మీరు మీరు మీ వృత్తిలో అనూహ్యమైన అభివృద్ధిని సాధిస్తారు అంతేకాకుండా మీ పై అధికారుల ప్రశంసలు కూడా అందుకుంటారు. 

Latest Videos


Cancer

ఆర్థిక స్థితి
 ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.  సంవత్సరమంతా గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సరం గత సంవత్సరంకంటే ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది.  శని గోచారం కారణంగా కుటుంబ సభ్యుల విషయంలో డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పటికీ, ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆర్థికంగా  ఇబ్బందిగా ఉండదు. సంవత్సరమంతా గురుగోచారం 9వ ఇంటిలో ఉండటం వలన అదృష్టం కలిసివచ్చి పెట్టిన పెట్టుబడి నుంచి ఆదాయం రావటం, అలాగే వారసత్వ సంబంధించి ఆదాయం కానీ, ఆస్తిపాస్తులు కానీ, కలిసి రావడంతో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.  అయితే కోర్టు కేసులు గాని లేదా ఇతర వివాదాల కారణంగా ఆర్థికంగా కొంత నష్టపోవాల్సి కూడా ఉంటుంది.  అంతే కాక మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యల కారణంగా లేదా తండ్రిగారి ఆరోగ్యసమస్య వలన డబ్బులు ఖర్చు  చేయాల్సి వస్తుంది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వాహనం కానీ,  గృహ గృహం కానీ, ఇతర స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.  దైవ కార్యక్రమాలకు కానీ,  శుభకార్యముల విషయంలో కానీ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.

కర్కాటకరాశి

ఆరోగ్యం
 ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ప్రథమార్థం కొంత సామాన్యంగా,  ద్వితీయార్ధం వ్యతిరేకంగా ఉంటుంది.  సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఎముకలు,   వెన్నెముక సంబంధ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.  అయితే సంవత్సరమంతా గురు  గోచారం అనుకూలం గా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ సరైన సమయంలో వైద్యం అందడంతో వచ్చిన ఆరోగ్య సమస్యల నుంచి తొందరగా బయట పడగలుగుతారు.  అయితే  మానసికంగా ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఆందోళనకు గురవుతుంటారు.  ముఖ్యంగా చికిత్స విషయంలో వివిధ రకాల వైద్య పద్ధతులను పాటిస్తూ తొందరగా సమస్య తగ్గాలనే ఆత్రుత  కలిగి ఉంటారు. అలాగే వ్యసనాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మానసిక ఆందోళనల కారణంగా వ్యసనాలకు బానిసలుగా అవటం కానీ, కొత్త వ్యసనాలు ఏర్పడటం కాని జరగవచ్చు. ఈ సమయంలో మానసికంగా దృఢంగా ఉండటం అలాగే దైవారాధన చేయటం వలన ఈ సమస్యకు గురి కాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. 

Cancer

కుటుంబం
 కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది.  సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన కుటుంబ విషయాల్లో సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అవగాహనలోపం ఏర్పడటం,  మనస్పర్థలు ఏర్పడటం దాని కారణంగా  ప్రశాంతత లోపించడం జరుగుతుంది.  ప్రతి విషయంలో మీ మాటకు, మీ పనికి ఎవరో ఒకరు అడ్డుతగలడంతో చికాకుకు  లోనవుతుంటారు.  అంతేకాకుండా మీరు చెప్పిన మాటలు లెక్క చేయకుండా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం కానీ,  మీ మాటలు పట్టించుకోకుండా వారు అనుకున్న పనులు చేయడం కానీ చేస్తారు.  దాని వలన ఇంట్లో ఒంటరి అయ్యాననే భావన మీ లో ఏర్పడుతుంది. దీని కారణంగా కొంత అసంతృప్తి కి మానసిక ఆందోళన కి గురవుతారు.  సంవత్సరమంతా తొమ్మిదవ  ఇంటిలో గురువు గోచారం కారణంగా మీకు చాలా విషయాల్లో అదృష్టం కలిసి వచ్చి గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.  మీ తండ్రిగారి నుంచి కానీ,  కుటుంబ పెద్దల నుంచి కానీ సహాయ సహకారాలు అందుతాయి.  దాని వలన స్థిరాస్తి కొనుగోలు కానీ,  వాహన కొనుగోలు కానీ చేస్తారు.  అంతేకాకుండా మీ పిల్లల వలన కూడా మీ ఆనందం రెట్టింపవుతుంది.  వారి రంగాల్లో వారు సాధించిన విజయాలు మీకు గర్వ కారణం అవుతాయి.  మీ జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు తొలగిపోయి ఇంటిలో ప్రశాంతత ఏర్పడుతుంది.  ఒకవేళ మీరు వివాహం గురించి ఎదురు చూస్తున్నట్లు అయితే ఈ సమయంలో వివాహ యోగం ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో శనిగోచారం ఇంట్లో ఉన్నప్పుడు మీ తండ్రిగారికి అనారోగ్యం ఏర్పడటం కానీ ఈ కుటుంబంలో పెద్దలకు ఆరోగ్య సమస్యలు రావడం కానీ జరుగుతుంది.  అయితే గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు తొందరగానే ముగిసిపోతుంది.  నాలుగవ ఇంట్లో కేతు గోచారం కారణంగా ఇంటికి సంబంధించి మరమ్మతులు చేయడం కానీ లేదా కొత్త ఇంటికి మారటం కాని చేస్తారు.  సంవత్సరమంతా గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో సమస్యలు వచ్చినప్పటికీ అవి తొందరగానే సామరస్య పూర్వంగా పరిష్కారం అవుతాయి. వీటి గురించి ఎక్కువ ఆందోళన పడవలసిన అవసరం లేదు. 
 

Cancer

వ్యాపారం మరియు స్వయం ఉపాధి
 ఈ సంవత్సరం వ్యాపారస్థులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.   సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన వ్యాపారం కొంత  మందకొడిగా  సాగుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యాపారంలో సరైన అభివృద్ధి లేకపోవడంతో కొంత నిరాశకు లోనవుతారు.  అలాగే భాగస్వాములతో సమస్యల కారణంగా వ్యాపారంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి.  భాగస్వాములు విడిపోవడం కానీ లేదా కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు ఏర్పడటం కానీ జరుగుతుంది. ఈ సమస్యల కారణంగా వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోతారు. అయితే ఈ సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ వాటిని సామరస్య పూర్వంగా పరిష్కరించుకోగలుగుతారు.  వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది.  అంతేకాకుండా కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. భాగ్య స్థానంలో గురు సంచారం కారణంగా మీకు అదృష్టం కలిసి వచ్చి కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలు కానీ,  పెట్టుబడులు కానీ అనుకోని  లాభాలను ఇస్తాయి.  దీని వలన గతంలో ఉన్న సమస్యలు,  అప్పులు తొలగిపోతాయి.  అయితే శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కొంతమంది వినియోగదారులతో అనవసరమైన సమస్యలు ఏర్పడతాయి.  అటువంటి వారి విషయంలో జాగ్రత్త అవసరం.  కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు ఈ సంవత్సరం ప్రారంభించవచ్చు. సంవత్సరమంతా  రాహు గోచారం పదవ ఇంటిలో ఉండటం వలన వ్యాపారంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త ప్రదేశానికి మారడం కానీ  కొత్త వ్యాపారాలు చేయడం కానీ చేస్తారు.  కళాకారులు కానీ స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారు కానీ ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను పొందుతారు.  మంచి అవకాశాలు రావటం వలన మీ మీ రంగాల్లో రాణించగలుగుతారు. అయితే సంవత్సరమంతా శనిగోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన కొన్నిసార్లు ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంటుంది.  అలాగే మీకు అవకాశం ఇస్తామని మిమ్మల్ని మోసం చేసేవారు కూడా ఈ సమయంలో ఉండే అవకాశం ఉంటుంది. గురు గోచారం  అనుకూలంగా ఉంటుంది కాబట్టి అటువంటి మోసగాళ్ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు.  గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీకు మంచి అవకాశాలు వస్తాయి.  దాని ద్వారా డబ్బుతో పాటు పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఈ సంవత్సరం మీరు బద్ధకాన్ని విడిచిపెట్టి  శ్రద్ధగా పని చేయడం వలన అభివృద్ధిని సాధిస్తారు. 

పరిహారాలు
 ఈ సంవత్సరం, కర్కాటక రాశిలో జన్మించిన వారు శని మరియు కేతువులకు పరిహార క్రియలు చేయడం మంచిది. ఈ సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ప్రతిరోజూ శని స్తోత్ర పారాయణం చేయడం కానీ,  హనుమాన్ స్తోత్ర పారాయణం చేయటం కానీ లేదా వెంకటేశ్వర స్వామి స్తోత్రం పారాయణం చేయడం కానీ మంచిది.  శని ప్రభావం అధికంగా ఉన్నవారు 19,000 సార్లు శని మంత్ర జపం చేయడం కానీ శని గ్రహ శాంతి హోమం చేయడం కానీ మంచిది.  సంవత్సరమంతా  కేతు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ప్రతి రోజు కేతు గ్రహ స్తోత్రం పారాయణం చేయడం కానీ,  గణపతి స్తోత్ర పారాయణం చేయడం కానీ మంచిది.  కేతు ప్రభావం అధికంగా ఉన్నవారు 7,000 సార్లు కేతు మంత్రం జపం చేయడం కానీ కేతు గ్రహ శాంతి హోమం చేయడం కానీ మంచిది. వీటితో పాటుగా శని దోష నివారణకు శారీరక శ్రమ చేయటం, వృద్ధులకు, వికలాంగులకు సాయం చేయడం మంచిది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశలు  ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది.  పైన చెప్పిన పరిహారములు మీ శక్తి,  భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.

click me!