Ugadi 2022: స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం.. వృషభ రాశి జాతకం

First Published | Mar 30, 2022, 2:40 PM IST

స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో వృషభ రాశివారు అనుకోని శత్రువులను కానీ సమస్యలు కానీ కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీరు సాధించిన విజయాలు మిమ్మల్ని మరింత ముందుకు పోయేలా చేయాలి తప్ప  వెనకడుగు వేసేలా చేయకూడదు. 

Taurus

Taurusఈ జాతకాన్ని ప్రముఖ జోతిష్య నిపుణులు  గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ తెలియజేశారు.
ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం, ధర్మపురి, జగిత్యాల జిల్లా.
https://www.onlinejyotish.com

taurus

ఉద్యోగం
వృషభ రాశిలో జన్మించిన వారికి, ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది.  ముఖ్యంగా గురు, శని, అలాగే కేతువు గోచారం అనుకూలంగా ఉండటం వలన, మీరు చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగస్థులకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది.  వృత్తిలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మార్పులను ఈ సంవత్సరం పొందుతారు.  మీరు అనుకున్న  ఏ విధమైన అభివృద్ధిని సాధిస్తారు.  మీరు అనుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది.  అంతేకాకుండా విదేశాల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. పదవ ఇంటిలో గురువు గోచారం కారణంగా  ఏప్రిల్ వరకు వృత్తిలో కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ఏప్రిల్లో గురువు పదకొండవ ఇంటికి రావడంతో   మీరు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.  మీరు చేసే పనికి గుర్తింపు రావడమే కాకుండా గతంలో మిమ్మల్ని విమర్శించిన వారు కూడా మెచ్చుకుంటారు.  మీరు ప్రభుత్వ లేదా ఇతర సంస్థల నుంచి అవార్డులను, రివార్డులను పొందే అవకాశం ఉంటుంది.  గతంలో మీరు కష్టపడి పని చేసినప్పటికీ గుర్తింపు రాలేదని బాధపడిన విషయాల్లో ఇప్పుడు అనుకున్న విధంగా గుర్తింపు రావడమే కాకుండా అది మీ వృత్తి అభివృద్ధిలో  తోడ్పడుతుంది.  అయితే రాహు గోచారం అనుకూలంగా లేనందువలన మీకు లభించిన విజయాలను చూసి గర్వం పెరగడం కానీ లేదా కొన్ని విషయాల్లో తల బిరుసు గా ప్రవర్తించడం కానీ చేస్తారు దాని వలన అనుకోని శత్రువులను కానీ సమస్యలు కానీ కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మీరు సాధించిన విజయాలు మిమ్మల్ని మరింత ముందుకు పోయేలా చేయాలి తప్ప  వెనకడుగు వేసేలా చేయకూడదు.  మీ  అసహనాన్ని,  కోపాన్ని లేదా మొండి స్వభావాన్ని తగ్గించుకొని వినయంతో వెళ్ళినప్పుడే మరింత మందికి చేరువవుతారు.  ఈ సంవత్సరమంతా  రాహువు 12వ ఇంటిలో సంచరిస్తాడు కాబట్టి  ఈ సమయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.  ఈ సమయంలో మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు, లేదా వారి అవసరం కొరకు మీ చుట్టూ చేరే వ్యక్తుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా జూలై, డిసెంబర్ మధ్య వక్రగతుడైన శని గోచారం  తొమ్మిదవ ఇంటిలో ఉండటం వలన విదేశీ ప్రయత్నాల విషయంలో  కొంత జాగ్రత్తగా ఉండాలి.  తప్పుడు సమాచారం కారణంగా కానీ లేదా ఇతరులు మోసం చేయడం వల్ల గాని మీరు నష్టపోవడం జరుగుతుంది. అయితే గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సమస్య నుంచి కొంత ఆలస్యంగానైనా బయటపడే అవకాశం ఉన్నది. కొత్త కోర్సులు లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం వలన ఉద్యోగంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది.   12వ ఇంటిలో రాహు గోచారం కారణంగా కొంత బద్ధకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అకారణంగా ముఖ్యమైన పనులను వాయిదా వేయడం చేస్తారు లేదా  అసమర్థులైన వారికి ఆ పనిని అప్పగించి తర్వాత బాధ పడతారు.  ఈ సంవత్సరంలో మీకు వచ్చిన విజయాలను మీరు పూర్తిగా అనుభవించాలంటే ఈ బద్ధకాన్ని అలాగే నిర్లక్ష్యాన్ని వదిలేయడం మంచిది. 

Latest Videos


Taurus

ఆరోగ్యం
 వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయానికొస్తే గురువు మరియు కేతువు గోచారం అనుకూలంగా ఉండటం వలన కొన్ని  చిన్న, చిన్న ఆరోగ్య సమస్యలకు  మినహా, ఈ సంవత్సరం అంతా బాగుంటుంది.   అయితే సంవత్సరమంతా రాహువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి  మెడ,  కడుపు మరియు  నరాలకు  సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. వీలయినంత వరకు శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం వలన చాలావరకు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. అయితే గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీకు వచ్చే అనారోగ్య సమస్యలు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉండవు.  ఆరోగ్య సమస్యలు వచ్చిన కొద్ది రోజుల్లోనే తగ్గుముఖం పడతాయి.  అంతేకాకుండా, ఈ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా  మీరు తీసుకునే  జాగ్రత్తలు భవిష్యత్తులో  మిమ్మల్ని పెద్ద అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతాయి.  మంచి ఆరోగ్యపు అలవాట్ల తో పాటుగా దైవారాధన చేయటం వలన ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడకుండా ఉంటారు.

Representative Image: Taurus

కుటుంబం
కుటుంబ పరంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురువు లాభ స్థానంలో సంచరించటం వలన కుటుంబంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.  ఇంటిలో శుభకార్యాలు జరగడం వలన,  బంధుమిత్రుల రావటంతో గతంలో ఏర్పడిన మనస్పర్థలు తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.  అంతేకాకుండా కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన  అపోహలు కూడా తొలగిపోతాయి.  ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహం అవ్వటం,  అలాగే సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి సంవత్సర ద్వితీయార్ధంలో  సంతానం కలుగుతుంది.  సంవత్సర ద్వితీయార్ధంలో మీ పిల్లలు వారి వారి రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు.  గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.  మీ మిత్రులు మరియు బంధువుల సహకారంతో చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక ముఖ్యమైన సమస్యలు తొలగించుకో కలుగుతారు.  సంవత్సర  ద్వితీయార్ధంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తారు.  మీ ఆనందం కొరకై మీ శక్తికి మించి డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.  ఈ సంవత్సరం  ద్వితీయార్ధంలో ఆధ్యాత్మికంగా మంచి ప్రగతి సాధించడం కానీ లేదా పుణ్య క్షేత్ర సందర్శన కానీ చేస్తారు. అంతేకాకుండా నూతన గృహప్రవేశం కానీ లేదా వాహనం కొనుగోలు చేయడం కానీ చేస్తారు.

ఆర్థిక స్థితి
 వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. గురువు గోచారం సంవత్సరమంతా అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు రావడంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ సంవత్సరం అంతా కూడా రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి, కొత్తగా పెట్టిన పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. తొందరపాటుతో కానీ ఇతరుల మాటలు విని కానీ పెట్టుబడులు పెట్టకండి. గురు గోచారం బాగున్నప్పటికీ రాహు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన వచ్చిన లాభాలు అనవసరమైన పెట్టుబడుల కారణంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని దృష్టి ఏడో ఇంటిపై 12వ ఇంటిపై మరియు నాలుగవ ఇంటిపై ఉంటుంది కాబట్టి స్థిరాస్తుల కొనుగోలు విషయాల్లో, కొత్త ఒప్పందాలు చేసుకోవడం విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. పన్నెండో ఇంటిపై శని దృష్టి కారణంగా, అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం కానీ, పెట్టిన పెట్టుబడి వ్యర్థం అవ్వడం కానీ జరగవచ్చు. మీ పెద్దల లేదా అనుభవజ్ఞుల సలహా మేరకు పెట్టుబడులు పెట్టడం కానీ లేదా పెట్టుబడి పెట్టే సమయంలో వారి సలహాను కూడా దృష్టిలో పెట్టుకోవడం వలన నష్టాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఈ సంవత్సరం గృహ, వాహనాదుల కొనుగోలు చేయటం చేస్తారు. పెట్టుబడులు పెట్టాలనుకుంటే జులై తర్వాత పెట్టడం మంచిది. జూలై వరకు శని మరియు రాహువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి, పెట్టుబడుల విషయంలో తప్పుడు సలహాలు పాటించి, లేదా తొందరపడి పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది

వ్యాపారం మరియు స్వయం ఉపాధి
 ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.  ఈ సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా ఉండటం వలన గతంలో ఏర్పడిన వ్యాపార  సమస్యల నుంచి బయట పడతారు.  అంతవరకు ఉన్న గొడవలు కానీ,  కోర్టు కేసులు కానీ మధ్యవర్తుల జోక్యంతో సామరస్యంగా ముగిసిపోతాయి.  మీకు రావలసిన డబ్బులు తిరిగి రావడంతో చేసిన అప్పులు కానీ, బ్యాంకు లోన్ లు కానీ  తీర్చ కలుగుతారు.  మీ వ్యాపార ప్రదేశంలో కూడా మార్పు రావడం లేదా చేసే వ్యాపారం లో మార్పు రావడంతో ఆర్థిక స్థితి ఒక్కసారిగా మెరుగుపడుతుంది.  గతంలో కంటే ఎక్కువ ఆదాయం రావటం,  వ్యాపారం అభివృద్ధి చెందడం జరుగుతుంది.  మిమ్మల్ని వదిలి వెళ్ళిన వ్యక్తులు కానీ,  భాగస్వాములు కానీ తిరిగి మీ వద్దకు వస్తారు.  అయితే వ్యాపార విషయంలో ఎవరిని నమ్మి మోసపోకండి. కొంతమంది మోసపూరిత మాటలతో తమ అవసరాలకు మిమ్మల్ని కానీ మీ వ్యాపారాన్ని కానీ వాడుకోవాలని చూస్తారు. అటువంటి వారిని గుర్తించి వారికి దూరంగా ఉండటం మంచిది.  కళాకారులు కానీ,  స్వయం ఉపాధి ద్వారా జీవనం కొనసాగిస్తున్న వారు కానీ ఈ సంవత్సరం మంచి అవకాశాలు దొరికి ఆర్థికంగా, వారి వృత్తి పరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు.  ఈ సంవత్సరం ప్రథమార్థంలో కొంతమంది  నమ్మి మోసపోవడం కానీ,  అవకాశాలు చేజారిపోవడం కానీ జరగవచ్చు.  అయితే ధైర్యాన్ని వీడకుండా ప్రయత్నించినట్లయితే చేజారిన అవకాశాలు తిరిగి రావడమే కాకుండా  మీకు మంచి పేరు కూడా వస్తుంది.  ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మీ వృత్తి కారణంగా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

పరిహారాలు
 ఈ సంవత్సరం, వృషభ రాశిలో జన్మించిన వారికి,  ప్రధానంగా రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి, రాహువుకు పరిహారాలు చేయటం మంచిది. రాహు గోచారం సంవత్సరమంతా పన్నెండవ ఇంటిలో ఉంటుంది. దీని కారణంగా మానసిక సమస్యలు,  ఆరోగ్య సమస్యలు,  ఆర్థిక సమస్యలు వస్తాయి కాబట్టి   రాహువుకు పరిహారక్రియలు ఆచరించాలి.  దీనికిగాను ప్రతిరోజు రాహు స్తోత్రం చదవడం కానీ లేదా దుర్గా స్తోత్రం చదవడం మంచిది.  ఇవే కాకుండా రాహు  మంత్ర జపం 18,000 సార్లు చేయటం లేదా రాహు గ్రహ శాంతి చేసుకోవటం వలన మంచి ఫలితాలు పొందుతారు. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ అంతర్దశలు  ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది.  పైన చెప్పిన పరిహారములు మీ శక్తి,  భక్తి మరియు శ్రద్ధ మేరకు, ఏ పరిహారం అయినా పాటించవచ్చు. అంతేకానీ పైన చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.
 

click me!