కొన్నికొన్ని సార్లు ఇంట్లో ఎలాంటి కారణం లేకుండా గొడవలు జరుగుతుంటాయి. వివాదాలు వస్తుంటాయి. ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడుతుంటారు. అప్పుల సమస్యలు పెరిగిపోతుంటాయి. ఈ ఇంటికి ఏమైంది? ఇలా అయిపోయింది పరిస్థితి అని చాలా మంది ఆలోచన చేస్తుంటారు. అయితే వీటికి కారణం ప్రతికూల శక్తులే అని జ్యోతిష్యులు అంటున్నారు.
జ్యోతిష్యం ప్రకారం.. ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే.. ఆ ఇంట్లో అన్నీ చెడు ఘటనలే వరుసగా జరుగుతూనే ఉంటాయి. ఏ పనీ ముందుకు సాగదు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
లవంగం : లవంగం వంటగదిలో ఉపయోగించే ఒక మసాలా దినుసు అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీన్ని ఒక్క వంటల్లోనే కాదు.. ఇంట్లో ప్రతికూల శక్తులను వదిలించుకోవడానికి కూడా ఉపయోగించొచ్చు.దీని కోసం లవంగాల పొడిని ఇంటి మూలల్లో చల్లండి. దీనివల్ల ప్రతికూల శక్తులు రాకుండా నిరోధించడమే కాకుండా ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
రోజ్మేరీ : రోజ్మేరీ కేవలం జుట్టుకు మాత్రమే కాదు ఇంటికి కూడా శక్తివంతమైన మూలిక అని జ్యోతిష్యులు అంటున్నారు. పురాతన కాలం నుంచి దీనిని ఆచారాలలో ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని కోసం రోజ్మేరీ ఆకులను తలుపుల దగ్గర ఉంచితే ఇంటిని చెడు శక్తుల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా రోజ్మేరీ మొక్కను ఇంటి ప్రవేశ ద్వారం వద్ద లేదా బాల్కనీలో ఉంచితే ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు.
గంట : ఇంట్లో గంటలను వేలాడదీస్తే ఇంట్లో సానుకూల శక్తి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. గంటల నుండి వచ్చే శబ్దం, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని విచ్ఛిన్నం చేసి సానుకూల శక్తిని సృష్టిస్తుంది. అందుకే దేవాలయాల్లోకి ఎలాంటి దుష్టశక్తి ప్రవేశించకుండా గంటలను ఏర్పాటు చేస్తారు.
కర్పూరం వెలిగించడం : కర్పూరం హిందూ ఆచారాలలో ఒక ముఖ్యమైన భాగం. కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే ఇళ్లు శుభ్రపడుతుంది.ఇది సురక్షితమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కర్పూరం నుంచి వచ్చే సువాసన, పొగ ఇంట్లో అన్ని ప్రదేశాలలోకి వ్యాపిస్తే ప్రతికూల శక్తి ఇంటి నుంచి పారిపోతుంది.
తెల్లని కొవ్వొత్తి : తెల్లని కొవ్వొత్తి ఆధ్యాత్మికంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంటే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి తెల్లని కొవ్వొత్తిని ఉపయోగించొచ్చు. దీని కోసం ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఒక తెల్లని కొవ్వొత్తిని ఉంచండి. దీనివల్ల చెడు ఆలోచనలు ఉన్నవారు ఇంటిలోకి వచ్చి వెళ్లిన వెంటనే వారితో పాటు చెడు శక్తి కూడా వెళ్లిపోవడానికి కొవ్వొత్తిని వెలిగించి ఉంచండి. ఇది ఇంట్లో సానుకూల శక్తిని సృష్టిస్తుంది.