అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాల నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై కూడా చర్చ సాగుతోంది. మూడు రాజధానుల బిల్లు అనే పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఎ రద్దు బిల్లు ఆమోదం కోసం గవర్నర్ వద్ద ఉన్న విషయం తెలిసిందే. ఆ రెండు బిల్లులపై గవర్నర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది.
undefined
నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిక్కులో పడినట్లే కనిపిస్తున్నారు. మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా జగన్ కు కలిగే చిక్కులేమీ లేవు. రెండు బిల్లులపై కూడా గవర్నర్ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటారని తెలుస్తోంది. రాజ్యాంగ నిపుణుల సలహా కూడా తీసుకునే అవకాశం ఉంది.
undefined
మూడు రాజధానుల బిల్లును గవర్నర్ తిరస్కరించినా, పెండింగులో పెట్టినా జగన్ కు జరిగే నష్టం పెద్దగా ఏమీ లేదు. క్రమంగా కొంత కాలానికి శాసనమండలిలో కూడా వైసీపీ మెజారిటీలోకి అవకాశం లేకపోలేదు. అప్పుడు మరోసారి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప జేసుకోవడానికి వీలుంటుంది. అయితే, ఈలోగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ)పై, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించడానికి వీలవుతుంది.
undefined
ఇప్పటికే అమరావతి భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ భూముల వ్యవహారంపై సీఐడి విచారణ కూడా సాగుతోంది. కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. మూడు రాజధానుల ఏర్పాటులో గవర్నర్ నిర్ణయం ఎలా ఉన్నా అమరావతిని మాత్రం జగన్ రాజధానిగా అభివృద్ధి చేయడానికి సిద్దపడరనేది అందరికీ తెలిసిన విషయమే. అమరావతి కేంద్రంగా ప్రభుత్వం ఇప్పటిలాగే కొనసాగుతూ వస్తుంది.
undefined
మరోవైపు చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టడానికి వీలవుతుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, దానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇటీవల విమర్శించారు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయడం ద్వారా వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేది తమ ఉద్దేశ్యమని జగన్ ప్రభుత్వ వాదన.
undefined
మూడు రాజధానుల అమలు కార్యరూపం దాల్చకపోయినప్పటికీ జగన్ కు ఎదురయ్యే చిక్కులేమీ లేవు. చంద్రబాబును ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బలహీనపరచడానికి ఆయన అవకాశం చిక్కుతుంది. ఇది సెంటిమెంట్ రూపం తీసుకుంటే ఇరు ప్రాంతాలు కూడా టీడీపీకి పూర్తి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. మధ్య కోస్తాను, దక్షిణ కోస్తాను వివిధ రూపాల్లో తన గుప్పిట్లోకి తీసుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు.
undefined
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీని మరింత బలహీనపరచడానికి మూడు రాజధానుల అంశం జగన్ కు పనికి వస్తుందని భావిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ధర్మాన ప్రసాద రావుకు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వడానికి జగన్ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం బలంగానే ఉన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా టీడీపీపై ఎప్పటికప్పుడు కత్తులు నూరుతూనే ఉన్నారు. ఆ రకంగా ఉత్తరాంధ్రలో పట్టు బిగించాలని జగన్ భావిస్తున్నారు.
undefined
సహజంగానే రాయలసీమ వైసీపీకి అనుకూలగా ఉంటుంది. పైగా, రాయలసీమలోని తెలుగుదేశం బడా నేతలను బలహీనపరిచే వ్యూహం ఓ వైపు అమలవుతూనే ఉంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సుబ్బారెడ్డి నుంచి తీవ్రమైన చిక్కులు ఎదుర్కుంటున్నారు. జేసీ బ్రదర్స్ దాదాపుగా బలహీనపడినట్లే. కర్నూలు కూడా క్రమంగా తన చేతుల్లోకి వస్తుందని జగన్ భావిస్తున్నారు. మరోవైపు న్యాయరాజధాని రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారనే సెంటిమెంట్ రాజుకునే అవకాశం ఉంది. ఇది జగన్ కు కలిసి వస్తుందని భావిస్తున్నారు.
undefined