
వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షాక్ ఇచ్చారు. అదే సమయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి మాత్రం పార్టీలో మరిన్ని బాధ్యతలను అప్పగించారు. అసలేం జరిగిందంటే.. మంగళవారం రోజున 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, 11 మంది ప్రాంతీయ సమన్వయకర్తలను వైసీపీ అధినేత, సీఎం జగన్ నియమించారు.
ఇందుకు సంబంధించిన వివరాలను సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించారు. అయితే ఈ నియామకాల్లో పలువురు మాజీ మంత్రలు, సీనియర్ నేతలకు అవకాశం కల్పించారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో చోటు దక్కలేదనే అసంతృప్తిలో ఉన్నవారిలో కొందరికి ఈ నియామకాలలో అవకాశం కల్పించారు. ఈ విధంగా వారిలో ఉన్న అసంతృప్తిని చలార్చే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం వైసీసీలో జగన్ తర్వాత విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డిలు కీలకంగా వ్యవహరిస్తుంటారు. అయితే వైసీపీలో నెంబర్ 2గా భావించే ఎంపీ విజయసాయిరెడ్డిపై ఈ నియామకాల్లో ఒకింత షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే.. గత కొంతకాలంగా వైసీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న విజయసాయి రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు.
అక్కడ ఓ వెలుగు వెలిగి.. విశాఖ అంటే విజయసాయి అన్నట్టుగా వ్యవహరించిన ఆయనకు ఇది ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితి అనే చర్చ సాగుతుంది. తేకాకుండా విజయసాయి రెడ్డిని పూర్తిగా ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి తప్పించారు.
కేవలం పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా విజయసాయిరెడ్డిని నియమించారు. అయితే విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తగా బాధ్యతల నుంచి తప్పించడానికి.. ఆయన తీరుపై ఆ ప్రాంతానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులకు ఉన్న అసంతృప్తి, ఫిర్యాదులే కారణమనే చర్చ సాగుతుంది.
సజ్జలకు మరిన్ని బాధ్యతలు.. ఇక, సజ్జలకు పార్టీ పరంగా మరిన్ని బాధ్యతలను అప్పజెప్పారు. గతంలో కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల స్థానంలో కర్నూలు, నంద్యాల బాధ్యతలను అప్పగించారు. ఈ బాధ్యతలను సజ్జల, బుగ్గన సంయుక్తంగా చూడనున్నారు. దానితో పాటు ప్రాంతీయ సమన్వయకర్తల, పార్టీ జిల్లా అధ్యక్షుల కో–ఆర్డినేటర్‌గా సజ్జలకు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్.
దీంతో పార్టీలో సజ్జలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని.. అదే సమయంలో విజయసాయి రెడ్డికి ప్రాధాన్యత తగ్గుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. విశాఖను కార్యనిర్వహక రాజధానిగా చేసి తీరుతామని చెబుతున్న వైసీపీ.. ఆ ప్రాంతంలో ఇన్నాళ్లూ కీలక బాధ్యతలు చూసిన విజయసాయి రెడ్డిని వాటి నుంచి తప్పించడమే అందుకు నిదర్శనమని చెబతున్నారు.
పెద్దిరెడ్డి ఫ్యామిలీకి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమించిన జగన్.. వారికి కీలక బాధ్యతలే అప్పగించారు. రామచంద్రారెడ్డికి 4 జిల్లాలు బాధ్యతలు అప్పగించగా.. వాటిలో 27 నియోజకర్గాలు ఉన్నాయి. మరోవైపు మిథున్ రెడ్డి 5 జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అయితే వాటిని మిథున్ రెడ్డి, ఎంపీ పిల్ల సుభాష్ చంద్రబోస్ సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఆ ఐదు జిల్లాల పరిధిలో 35 నియోజకవర్గాలు ఉన్నాయి. మరోవైపు ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమించిన 11 మందిలో ఆరుగురు ఒకే సామాజిక వర్గానికి (రెడ్డి) చెందిన వారు ఉన్నారు.
ఇక, నూతన ప్రాంతీయ సమన్వయకర్తల జాబితాను పరిశీలిస్తే.. మంత్రి పెద్ది రెడ్డికి.. చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాలు, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సంయుక్తంగా.. నంద్యాల, కర్నూలు జిల్లాల, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తిరుపతి, వైఎస్సార్ జిల్లాలు, మాజీ మంత్రి బాలినేని.. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు జిల్లాలకు ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమితులయ్యారు.
kodali nani
మాజీ మంత్రి కొడాలి నాని.. గుంటూరు, పల్నాడు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్.. ఎన్‌టీఆర్, కృష్ణా జిల్లాలు, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మిథున్ రెడ్డి సంయుక్తంగా.. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు, మంత్రి బొత్స సత్యనారాయణ.. పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమితులయ్యారు.
వైసీపీ జిల్లాల అధ్యక్షులు..చిత్తూరు- కేఆర్‌కే భరత్, తిరుపతి- చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అన్నమయ్య - గడికోట శ్రీకాంతరెడ్డి, వైఎస్సార్- కె. సురేశ్‌బాబు, శ్రీసత్యసాయి- ఎం శంకర్ నారాయణ, అనంతపురం- కాపు రామచంద్రారెడ్డి, నంద్యాల- కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు- వై బాలనాగిరెడ్డి, నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బాపట్ల-ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ప్రకాశం-బుర్రా మధుసూదన యాదవ్, గుంటూరు- మేకతోటి సుచరిత, పల్నాడు- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎన్‌టీఆర్- వెలంపల్లి శ్రీనివాసరావు, కృష్ణా-పేర్ని నాని, ఏలూరు- ఆళ్ల నాని, పశ్చిమగోదావరి- చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తూర్పుగోదావరి జిల్లా- జక్కంపూడి రాజా, కాకినాడ- కురసాల కన్నబాబు, కోనసీమ- పొన్నాడ సతీశ్‌కుమార్, విశాఖపట్నం- ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అనకాపల్లి- కరణం ధర్మశ్రీ, అల్లూరి సీతారామరాజు- కె భాగ్యలక్ష్మి, పార్వతీపురం మన్యం- పాముల పుష్పశ్రీవాణి, విజయనగరం-మజ్జి శ్రీనివాసరావు, శ్రీకాకుళం-ధర్మాన కృష్ణదాస్.