
అనంతపురం : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఈనెల 10వ తేదీన దొరికిన గుర్తు తెలియని మొండెం కేసులో మిస్టరీ వీడింది. ఏప్రిల్ 10వ తేదీన స్థానిక రైలు పట్టాల మీద తల లేని మొండం లభించిన కేసు పోలీసులకు సవాలుగా మారింది. ఇది ఆత్మహత్య అని మొదట పోలీసులు భావించారు. కానీ, ప్రస్తుతం ఇది హత్యగా నిర్ధారించారు. పామిడి సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, గుత్తి రైల్వే పోలీసులు ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని సంయుక్తంగా విచారణ చేస్తున్నారు.
అనంతపురంలోని పామిడి ఎద్దులపల్లి రోడ్డు రైల్వే గేట్ ఎల్ సీ 143 సమీపంలో ఈనెల 10వ తేదీన ఓ వ్యక్తి తలలేని మొండెం లభించింది. ఆ మొండానికి తల లభించలేదు. కాగా, మృతదేహం పడి ఉన్న తీరును గమనించిన పోలీసులు దాన్ని హత్యగా అనుమానాలు వ్యక్తం చేశారు. కాగా ఇది హత్యనా? ఆత్మహత్యనా? అనే దిశగా దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి కింద గుర్తి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
గుంతకల్లు రైల్వే సిఐ నాగేష్ బాబు, పామిడి సీఐ కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. వీరికి జీఆర్పీ సిబ్బంది సహాయపడ్డారు. వీరు కలిసి ఈ కేసులో మిస్టరీని చేదించారు. తల లేని మండే ఒకటే లభించడంతో ఈ కేసు దర్యాప్తు రైల్వే పోలీసులకు చాలెంజింగ్ గా మారింది. ఈ కేసును జిఆర్పి సిఐ నాగేష్ బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే, చనిపోయిన దగ్గర నుంచి మొండాన్ని కొద్ది దూరం వరకు లాక్కొచ్చి అక్కడ పడేసినట్లుగా అక్కడ దొరికిన ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు.
అలాగే మృతదేహం దగ్గర ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో మృతుడు కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన శంకర్ నాయక్ గా తేలింది. శంకర్ నాయక్ ను అత్యంత క్రూరంగా హతమార్చడానికి కారణాలను పోలీసులు ఛేదించారు. శంకర్ నాయక్ వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఈ క్రమంలోనే ఓ మహిళకు వడ్డీకి ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు.
ఆమెతో పలుమార్లు తన శారీరక అవసరాలు తీర్చుకున్నాడు. ఈ విషయం శంకర్ నాయక్ భార్యకు తెలిసింది. ఆమె గొడవ చేయడంతో ఆ మహిళ ఊరువిడిచి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినా కూడా శంకర్ నాయక్ ఆమెను డబ్బుల కోసం తీవ్రంగా వేధిస్తుండేవాడు. తనను శారీరకంగా వాడుకున్న తర్వాత కూడా డబ్బులతో వేధిస్తుండడంతో విసిగిపోయిన ఆమె అతడిని హత్య చేయించింది.
నిందితురాలు రాజేశ్వరి అలియాస్ రాజీగా గుర్తించారు. ఆమె పామిడి మండలం రామగిరి గ్రామానికి చెందిన మంగళ నారాయణ, నారాయణమ్మ దంపతుల రెండో కుమార్తె. జొన్నగిరికి చెందిన కేశవయ్యతో పదేళ్ల క్రితం ఆమెకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కేశవయ్య మూడేళ్ల క్రితం కరోనాతో చనిపోయాడు. కుటుంబ పోషణ భారం కావడంతో ఆ సమయంలో రాజేశ్వరి శంకర్ నాయక్ దగ్గర లక్ష రూపాయలు అప్పుగా తీసుకుంది.
ఈ అప్పు వసూలు చేసుకునే క్రమంలోనే శంకర్ నాయక్ రాజేశ్వరిని లొంగదీసుకుని శారీరక అవసరాలకు వాడుకున్నాడు. ఈ విషయం సంవత్సరం క్రితం శంకర్ నాయక్ కుటుంబ సభ్యులకు తెలియడంతో.. పెద్ద గొడవ జరిగింది. దీంతో రాజేశ్వరి ఆ గ్రామాన్ని విడిచిపెట్టి తన పుట్టింటికి చేరుకుంది. ఇంత జరిగినా శంకర్ నాయక్ ఆమెను అప్పు పేరుతో వేధించడం మానలేదు. తరచుగా రామగిరికి వచ్చి అప్పు గురించి నిలదీస్తూ.. ఆమెతో తన అవసరాలు తీర్చుకుంటు ఉండేవాడు.
శంకర్ నాయక్ వేధింపులు తారాస్థాయి చేరుకుంటుండడంతో ఎలాగైనా అతని తొలగించుకోవాలని భావించింది రాజీ. తన తల్లితో కలిసి పథకం వేసింది. బాకీ డబ్బులు ఇస్తామని శంకర్ నాయక్ నమ్మించి రామగిరికి రప్పించారు. ఆ తర్వాత తల్లి నారాయణమ్మతో కలిసి ఈల కత్తి, కత్తులతో శంకర్ నాయక్ గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని పట్టాలపైకి తీసుకొచ్చి పడేశారు. ఈ మేరకు పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు.
ఈ ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, శంకర్ నాయక్ తల మాత్రం ఇంకా దొరకలేదు. శంకర్ నాయక్ ను గొంతు కోసి చంపిన తర్వాత…తల కొంచెం అతుక్కుని ఉండగానే పట్టాలపై పడేసినట్లుగా రాజేశ్వరి పోలీసుల విచారణలో తెలిపింది. మరి అక్కడి నుంచి తల ఎలా మాయమైంది అనేది పోలీసులకి అంత చిక్కడం లేదు. దీనికోసం పోలీసులు గాలిస్తున్నారు.