IMD Rain Alert : ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు… తెలంగాణను చలిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి ఈరోజు (శుక్రవారం, డిసెంబర్ 5న) తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Weather Update : తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టడంలేదు... ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ను భారీ వానలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలు, వాయుగుండాలు ఈ శీతాకాలంలో కూడా భారీ వర్షాలకు కారణం అవుతున్నాయి. ఇటీవల మొంథా, దిత్వా తుపానులు ఏస్థాయిలో బీభత్సం సృష్టించాయో చూశాం. అయితే ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
26
ఈ జిల్లాల్లో వర్షాలు
దిత్వా తుపాను పూర్తిగా బలహీనపడినా వర్షాలు మాత్రం కొనసాగుతున్నాయి. దిత్వా అవశేషంగా కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కోనసీమ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిశాయి. ఈ జిల్లాల్లో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి... జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. కొన్నిచోట్ల వరద పరిస్థితులు నెలకొన్నాయంటేనే ఏ స్థాయిలో వర్షాలు కురిశాయో అర్థం చేసుకోవచ్చు.
36
నేడు ఏపీలో వర్షాలు
అయితే ఈ వర్షాలు ఇంకో రెండ్రోజులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారం (డిసెంబర్ 5,6) దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో ఏపీలో చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి చలి పెరుగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలులు తెలుగు ప్రజలను వణికిస్తాయని హెచ్చరిస్తోంది.
56
తెలంగాణపై మరోసారి చలి పంజా
తెలంగాణ విషయానికి వస్తే డిసెంబర్ 6,7 తేదీల్లో పొడి వాతావరణం ఉంటుందని... డిసెంబర్ 9 తర్వాత చలితీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోతాయని... చలి గజగజా వణికిస్తుందని తెలిపారు. ఈ చలిగాలులతో చిన్నారులు, ముసలివారు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఇబ్బంది పడతారు... కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
66
ప్రస్తుతం తెలంగాాణ ఉష్ణోగ్రతలు
ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు లేవుకానీ చలితీవ్రత విపరీతంగా ఉంది... ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు చేరుకుంటున్నాయి. ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక నల్గొండ 16, మెదక్ 16.6, రామగుండం 16.8, నిజామాబాద్ లో 17.4, హన్మకొండ 18 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ హయత్ నగర్ లో అత్యల్పంగా 17, రాజేంద్ర నగర్ లో 18 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది.