
Vijayasai Reddy : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ కోలుకోలేని స్థితిలో వుంది. ఈ సమయంలో వైసిపి లో నెంబర్ 2 గా వ్యవహరించే విజయసాయి రెడ్డి రాజీనామా తీవ్ర కలకలం రేపుతోంది. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు, వరుసగా రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సాయిరెడ్డి రాజీనామా ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే కాదు మరో మూడేళ్ల పదవీకాలం వుండగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా విజయసాయి రెడ్డి రాజీనామా చేసారు. రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరించే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ కు విజయసాయి రాజీనామా సమర్పించడం... దీన్ని ఆయన ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఏపీలో ఓ రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.
అయితే విజయసాయి రెడ్డి రాజీనామాపై రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. బిజెపిలో మోదీ తర్వాత అమిత్ షా ఎలాగో, టిడిపిలో చంద్రబాబు తర్వాత అచ్చెన్నాయుడు ఎలాగో, జనసేనలో పవన్ కల్యాణ్ తర్వాత నాదెండ్ల ఎలాగో వైసిపిలో జగన్ తర్వాత విజయసాయి రెడ్డి అలాంటివాడు... కానీ ఆయనే ఇప్పుడు రాజీనామా చేయడం ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. కాబట్టి ప్రజలు ఎవరికి తోచినట్లు వారు ఈ రాజీనామాపై కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ రాజీనామా వెనక పెద్ద రాజకీయ వ్యూహమే దాగివుందని అంటున్నారు.
బిజెపి ప్లాన్ బి లో భాగమేనా విజయసాయి రాజీనామా?
విజయసాయి రెడ్డి రాజీనామా వెనక బిజెపి వుందనే ప్రచారం సాగుతోంది. ఆయన రాజీనామా ఆమోదంపొందిన స్పీడ్ చూస్తుంటే ఇది నిజమనేమో అనిపిస్తుంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఒక్క రాజీనామాతో రెండు లాభాలు పొందాలన్నది బిజెపి ఆలోచనగా తెలుస్తోంది. బిజెపి మాస్టర్ ప్లాన్స్ ఎవరికీ అర్థం కావు... ఇది అలాంటిదే అనే అనుమానం వ్యక్తమవవుతోంది.
విజయసాయి రెడ్డి రాజీనామాతో బిజెపికి ఏం లాభం? ఇదే అందరి డౌట్. కానీ ఆయన రాజీనామాతో ఖాళీఅయ్యే స్థానాన్ని బిజెపి తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందట. తద్వారా రాజ్యసభలో బిజెపి బలం మరింత పెరుగుతోంది. ఇదే సమయంలో ఈ రాజీనామా వ్యవహారాన్ని అదునుగా చేసుకుని టిడిపికి చెక్ పెట్టాలని చూస్తోందట. ఇదే నిజమైతే ఇది బిజెపి ప్లాన్ బి గా చెప్పుకోవచ్చు.
ఏ రాష్ట్రంలో అయినా బిజెపి ప్లాన్ 'ఏ' తో పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. అంటే అక్కడి లోకల్ పార్టీలతో కలిసి మొదట ప్రజల్లోకి వెళుతుంది. ఆ రాష్ట్రంపై కొద్దిగా పట్టు రాగానే ప్లాన్ 'బి' స్టార్ట్ చేస్తుంది. అంటే అప్పటివరకు కలిసున్న లోకల్ పార్టీని పక్కనబెట్టి సొంతంగా బలపడే ప్రయత్నాలు చేస్తుంది. ఇలా మహారాష్ట్రలో శివసేనపై ఇదే ఫార్ములాను అనుసరించారు కమలనాథులు. ఇప్పుడు ఇదే వ్యూహం ఏపీలో అనుసరిస్తున్నారన్నది రాజకీయ వర్గాల టాక్.
ప్రస్తుతం ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి కొనసాగుతోంది. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి పదవి విషయంలో టిడిపి, జనసేన మధ్య కాస్త గ్యాప్ ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని పవన్ ను దగ్గరకు తీసుకుని... టిడిపికి చెక్ పెట్టాలన్నది బిజెపి ప్లాన్ గా తెలుస్తోంది. ఇందుకోసం విజయసాయి రెడ్డి రాజీనామాను పావుగా వాడుకుంటోందనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షం చాలా బలహీనంగా వుంది. దీన్ని మరింత బలహీనపర్చి బిజెపికి బలం పెంచాలని డిల్లీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒంటరిగా ఇది సాధ్యంకాదు కాబట్టి పవన్ కల్యాణ్ ను కూడా కలుపుకుపోయి టిడిపికి ప్రత్యామ్నాయంగా తయారవ్వాలని చూస్తోందట. ఇందుకోసమే ఇప్పుడే పొలిటికల్ గేమ్ స్టార్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
విజయసాయి సీటు అతడికేనా?
విజయసాయి రెడ్డికి వైసిపిలో కీలక నాయకుడు... ఆయనే ఇప్పుడు రాజీనామా చేసాడు. అయితే ప్రస్తుతం ఏపీలో కూటమికి స్పష్టమమైన మెజారిటీ వుంది కాబట్టి ఈ సీటు అధికార పక్షానికే దక్కుతుంది. అయితే కూటమిలోని మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఈ సీటు దక్కించుకుంటుదనేదే ఆసక్తికరంగా మారింది.
పొత్తుధర్మం ప్రకారం ఈ సీటు జనసేనకే దక్కాలి. ఎందుకంటే ఇటీవల వైసిపి ఎంపీల రాజీనామాలతో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టిడిపి, ఒకటి బిజెపికి దక్కాయి. ఈ సమయంలోనే ఓ సీటు మెగా బ్రదర్ నాగబాబుకు దక్కుతుందనే ప్రచారం జరిగింది...కానీ రాజకీయ సమీకరణలు కుదరక ఆయనను చివరినిమిషంలో తప్పించి మంత్రిగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇలా గతంలో అవకాశం కోల్పోయిన జనసేనకు విజయసాయి రాజీనామాతో ఖాళీ అయ్యే స్థానం కేటాయించాలి. కానీ బిజెపి ఆ అవకాశం ఇచ్చేలా కనిపించడంలేదు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు, ఇతర విషయాల్లో కాంప్రమైజ్ అయినా జాతీయ స్థాయిలో మాత్రం అస్సలు తగ్గడంలేదు. కాబట్టి ఈ రాజ్యసభ స్థానం కూడా బిజెపికే దక్కుతుందని అంటున్నారు.
ఇప్పటికే బిజెపి నాయకులు ఈ ఎంపీ స్థానంపై కన్నేసారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ సీటుపై ఇప్పటికే కన్నేసినట్లు సమాచారం. బిజెపి అదిష్టానం కూడా ఆయనకే అవకాశం ఇచ్చే యోచనలో వుందట. చివరి నిమిషంలో ఏవయినా అనుకోని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటేనే ఈ సీటు బిజెపి నుండి చేజారవచ్చు...లేదంటే ఆ పార్టీ అభ్యర్థికే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.