
Nara Lokesh : ఎవరైనా పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబితే థ్యాంక్స్ చెబుతారు... లేదంటే కేక్ తినిపిస్తారు. స్నేహితులు విషెస్ చెప్పి పార్టీ ఇస్తుంటారు. ఇక రాజకీయ నాయకుల పుట్టినరోజులు వుంటే ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్ఫగుచ్చాలు, శాలువాలతో సత్కరిస్తుంటారు. తమ నాయకుడితో కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకుంటారు.
ఇదంతా సాధారణంగా జరిగే భర్త్ డే వేడుకలు... ఇలా చేస్తే కిక్కేం వుండదని అనుకున్నారేమో ఈ స్కూల్ టీచర్లు. అందుకే తమ విద్యాశాఖకు మంత్రిగ వ్యవహరిస్తున్న లోకేష్ పుట్టినరోజును కొత్తగా జరపాలని అనుకున్నారు. ఇలా అత్యుత్సాహంతో వీరు చేసిన పని స్వయంగా లోకేష్ కు కోపం తెప్పించింది... దీంతో సదరు టీచర్ల ఉద్యోగాలకే గండం వచ్చింది.
ఇంతకూ ఈ టీచర్లు లోకేష్ భర్త్ డే ఎలా జరిపారో తెలుసా?
జనవరి 23న అంటే నిన్న గురువారం ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు. ఈ సమయంలో లోకేష్ దావోస్ లో వున్నారు. తన భర్త్ డే వేడుకలపై దృష్టి పెట్టకుండా రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఎకనమిక్ ఫోరం సదస్సుల్లో బిజీబిజీగా గడిపారు. కానీ ఆయన అభిమానులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు మాత్రం ఏపీలో లోకేష్ భర్త్ డే వేడుకలు జరిపారు.
లోకేష్ భర్త్ డే సందర్భంగా కొందరు బ్యానర్లు, కటౌట్లు కడితే మరికొందరు కేక్స్ కట్ చేసారు. మరికొందరు రక్తదానాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి భర్త్ డే కాబట్టి టిడిపి శ్రేణులు యమ జోష్ తో ఈ భర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. టిడిపి శ్రేణులు, అభిమానులు చివరకు లోకేష్ ను ఇష్టపడే సామాన్యులు కూడా సోషల్ మీడియా వేదికనో లేక ఇతర మాధ్యమాల ద్వారా భర్త్ డే విషెస్ తెలిపారు. ఇంతవరకు బాగానే వుంది.
కానీ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం జడ్పి స్కూల్ టీచర్లు మాత్రం కొద్దిగా ఓవరాక్షన్ చేసారు. ప్రభుత్వ ఉద్యోగులుగా నిస్పక్షపాతంగా వుండకుండా లోకేష్ పై అభిమానాన్ని చాటాలని తాపత్రయపడ్డారు. ఇందుకోసం స్కూల్ విద్యార్థులను ఇబ్బంది పెట్టారు.
విద్యార్థులందరిని మైదానంలోకి తీసుకువచ్చిన టీచర్లు వారిని ఓ వరుసక్రమంలో కూర్చోబెట్టారు. పైనుండి చూస్తే 'హ్యాపీ భర్త్ డే లోకేష్ సార్' అని కనిపించేలా జాగ్రత్తపడ్డారు. ఇదంతా ఓ డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టీచర్ల భర్త్ డే విషెస్ పై లోకేష్ రియాక్షన్ ఇదే :
తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు విద్యార్థులను ఇబ్బందిపెట్టిన టీచర్లపై నారా లోకేష్ సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిన వీడియోపై లోకేష్ స్పందించారు.
జంగారెడ్డిగూడెం జడ్పి స్కూల్లో తన భర్త్ డే వేడుకల నిర్వహణకోసం విద్యార్థులను ఇబ్బందిపెట్టడం మనస్థాపానికి గురిచేసిందని లోకేష్ అన్నారు. ఇందుకు భాద్యులైనవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏలూరు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు లోకేష్. అలాగే భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు లోకేష్.
ఎక్స్ వేదికన కూడా ఈ వ్యవహారంపై స్పందించారు లోకేష్. ''ఈ వీడియోను నేను చూసాను. భర్త్ డే విషెస్ తెలిపిన ప్రతి విద్యార్థికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ పిల్లలతో ఇలా చేయించడం తగదని స్కూల్ యాజమాన్యానికి సూచిస్తున్నారు. పిల్లల సమయం చాలా విలువైనది... వారికి విజ్ఞానాన్ని అందించే, పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసే అకడమిక్ లేదాఇతర కార్యకలాపాల కోసం ఉపయోగించేలా చూడాలి. కాబట్టి ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడండి'' అంటూ లోకేష్ చురకలు అంటించేలా ట్వీట్ చేసారు.
రాష్ట్రంలోని పాఠశాలలు, విశ్వ విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లోకేష్ అన్నారు. ఈ దిశగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఇలాంటిది విద్యార్థులతో తనకు పుట్టినరోజు చెప్పించేందుకు సదరు ఉపాధ్యాయులు చేసిన పని ఆనందాన్ని ఇవ్వకపోగా మనస్థాపాన్ని కలిగించిందని అన్నారు. కాబట్టి మళ్లీ ఇలాంటివి జరక్కుండా జాగ్రత్త పడతామని లోకేష్ స్పష్టం చేసారు.
ఇక జాతీయ బాలికా దినోత్సవంపై కూడా లోకేష్ స్పందించారు.''ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. వారికి అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా రాణిస్తారు. రాష్ట్రంలో బాలికల హక్కులు, విద్య, ఉపాధి, ఆరోగ్య భద్రత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోంది. బాలికల పట్ల వివక్షను అందరూ విడనాడాలి. వారికి స్వేచ్ఛనివ్వాలి. అందరం కలిసికట్టుగా లింగ అసమానతలను పూర్తిగా రూపుమాపుదాం. కుటుంబాలు, సమాజం, దేశాన్ని నిర్మించడంలో మహిళలదే కీలకపాత్ర అని గుర్తుంచుకోవాలి. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆడబిడ్డలకు నా శుభాకాంక్షలు'' అంటూ ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ట్వీట్ చేసారు.