
Nara Chandrababu Naidu : ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది కోసం ఓ మునిలా చంద్రబాబు తపస్సు చేస్తున్నారని టిడిపి నాయకులు,కార్యకర్తలు అంటుండగా మనం వింటుంటాం. కానీ ఆయనను ఇలా చూస్తే అలా అనడంలో అతిశయోక్తి లేదని అనిపిస్తుంటుంది. లోకకల్యాణం కోసం మన మునులు, రుషులు హిమాలయాల్లో గడ్డకట్టే చలిలో తపస్సు చేస్తారు... ఇప్పుడు ఏపీ కోసం చంద్రబాబు అదే చేస్తున్నారని అనిపిస్తోంది.
ఏపీకి పెట్టుబడుల కోసం ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా స్విట్వర్లాండ్ లో పర్యటిస్తున్నారు చంద్రబాబు. అక్కడ చలికి యువకులే వణికిపోతుంటే చంద్రబాబు మాత్రం ఆ చలికే వణుకు పుట్టిస్తున్నారు. కనీసం ఓ స్వెటర్ లేదా మెడలో ఓ మప్లర్ లేకుండా తిరుగుతున్నారు. చివరకు ఎవరైనా మర్యాదకు శాలువాకప్పిన అదీ నిమిషం వుంచుకోవడంలేదు.
ఇలా ఏమీ లేకుండానే ఎప్పటిలాగే సాధాసీదా దుస్తుల్లోనే మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలోనూ పెట్టుబడుల కోసం పరుగు తీస్తున్నారు. ఇలా చంద్రబాబును చూస్తున్నవారు 'ముసలోడే కానీ మహానుభావుడు' అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.
చంద్రబాబు చాలా స్పెషల్ గురూ..!
దావోస్ లో ప్రతి ఏడాది వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు హాజరవుతుంటారు...వారిని ఆకర్షించేందుకు వివిధ దేశాలు ప్రజాప్రతినిధులు కూడా ఈ సదస్సుకు వెళుతుంటారు. ఇలా భారత్ నుండి వివిధ రాష్ట్రాలను చెందిన ముఖ్యమంత్రులు లేదా మంత్రులు కూడా ఈ సదస్సుకు హాజరవుతుంటారు. ఇలా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ దావోస్ సదస్సుకు వెళ్లారు.
స్విట్జర్లాండ్ లోని జూరిచ్ ఎయిర్ పోర్ట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసారు. ఇద్దరు సీఎంల భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలో చంద్రబాబు లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, చివరకు ఆయన తనయుడు నారా లోకేష్ కూడా వెచ్చగా వుండేందుకు స్వెట్టర్లు వేసుకుని కనిపించారు.ఒక్క చంద్రబాబు మాత్రమే ఎప్పటిలాగే పసుపు షర్ట్ తో కనిపించారు. ఆయనకంటే చిన్నవారంతా చలికి తట్టుకోలేకపోతుంటే చంద్రబాబు మాత్రం వాతావరణ పరిస్థితులకు ఏమాత్రం లెక్కచేయను అన్నట్లుగా వున్నారు.
74 ఏళ్ల వయసులో చంద్రబాబు ఇలా మైనస్ డిగ్రీ చలిని కూడా లెక్కచేయకుండా స్విట్జర్లాండ్ లో సాధారణంగా తిరుగుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీన్నిబట్టి ఆయన ఆరోగ్యం విషయంలో ఎంత శ్రద్ద తీసుకుంటారో అర్థమవుతోంది. చంద్రబాబు తన కొడుకు నారా లోకేష్ కంటే ఫిట్ గా వున్నారంటూ ఆయన అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
లక్ష్మీ మిట్టల్ తో చంద్రబాబు భేటీ :
దావోస్ సదస్సుకోసం స్విట్జర్లాండ్ లో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు బృందం బిజీబిజీగా గడుపుతోంది. ఏపీకి భారీ పెట్టుబడుల తీసుకువచ్చే లక్ష్యంతో దావోస్ వెళ్లిన బృందం వ్యాపారవేత్తలతో చర్చలు ప్రారంభించింది. మొదట దావోస్ లో ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు బృందం ఆయనను కోరింది.
అన్నివిధాల అనుకూలతలు కలిగిన భావనపాడును పెట్రోకెమికల్ హబ్‌గా మార్చడానికి కృషిచేస్తున్నామని... అక్కడ పెట్టుబడులు పెట్టాలని మిట్టల్ గ్రూప్ ను చంద్రబాబు కోరారు. ప్రణాళికాబద్ధమైన 83.3 MTPA సామర్థ్యం గల పోర్టు, వైజాగ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం & ఎనర్జీ కొలువై ఉండటం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, బలమైన ప్రభుత్వం మద్దతు పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలతలుగా లోకేష్ వివరించారు. భావనపాడు-మూలపేట ప్రాంతం తయారీ, R&D, లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పడానికి, పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అసమానమైన అవకాశాలు కలిగి ఉందని మిట్టల్ కు తెలిపారు లోకేష్.
హెచ్ పిసిఎల్ – మిట్టల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ HMEL - HPCL-మిట్టల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.3,500 కోట్లతో భారత్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2 GW సామర్థ్యం గల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను ఏపిలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ ను ఏపీలో ఏర్పాటుచేసేందుకు ఎపిఈడిబి అధికారులతో కలసి సైట్ ను సందర్శించాలని సూచించారు. 2వేలమందికి ఉపాధి అవకాశాలు లభించే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపి ప్రభుత్వం తరపున అన్నివిధాలా సహాయసహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.
ఈ సందర్భంగా లక్ష్మీ మిట్టల్ మాట్లాడుతూ... ఆర్సెలర్ మిట్టల్, జపాన్ కు చెందిన నిప్పాన్ స్టీల్ జెవి సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలిపారు. AM/NS ఇండియా పేరుతో జాయింట్ వెంచర్ అనకాపల్లి జిల్లా సమీపంలో 2 దశల్లో ₹1.4 లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తుందన్నారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ... ఇందుకు సంబంధించి ఎపి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు లక్ష్మీమిట్టల్ కు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.