US Election Results 2024 : తమిళమ్మాయి ఓడింది ... కానీ తెలుగమ్మాయి గెలిచింది

First Published | Nov 7, 2024, 12:10 PM IST

అమెరికా రాజకీయాల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. అధ్యక్ష బరిలో నిలిచిన భారత మహిళ కమలా హారిస్ ఓడినా ఓ తెలుగింటి ఆడబిడ్డ అగ్రరాజ్యానికి సెకండ్ లేడీగా అవతరించారు. 

Usha Chilukuri Vance

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ప్రక్రియ ముగిసింది... నూతన అధ్యక్షుడి ఎంపిక పూర్తయ్యింది. అధికార డెమొక్రటిక్ పార్టీని ఓడించి రిపబ్లికన్ పార్టీ అద్భుత విజయాన్ని అందుకుంది... డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాలనా పగ్గాలు చేపట్టేందుకు అమెరికన్ల ఆమోదం లభించింది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడి వాన్స్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

అయితే ప్రస్తుత యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష పదవికి పోటీచేసి ఓటమిపాలయ్యారు. డెమొక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పోటీలో నిలిచిన హారిస్ ఓటమి భారతీయులను నిరాశకు గురిచేసింది. ఎందుకంటే ఆమె భారత సంతతి మహిళ. అగ్రరాజ్యం అమెరికాను పాలించే అవకాశం మన ఆడబిడ్డకు దక్కాలని కోరుకున్నారు. కానీ అమెరికన్లు కమలా హారిస్ కాదని ట్రంప్ ను గెలిపించుకున్నారు. 

అధ్యక్ష ఎన్నికల్లో కమళా హారిస్ ఓటమి బాధించినా మరో పరిణామం భారతీయులను మరీముఖ్యంగా తెలుగోళ్లను ఆనందించేలా చేస్తోంది. తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్ష పదవి దక్కింది... దీంతో మన తెలుగమ్మాయి అమెరికా సెకండ్ లేడీగా మారనున్నారు. అమెరికా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న జేడి వాన్స్ భార్య ఉషా చిలుకూరి మన తెలుగమ్మాయే.  
 

Usha Chilukuri Vance

తమిళమ్మాయి ఓడినా తెలుగమ్మాయి గెలిచింది :  

అమెరికాలో స్థిరపడిన ఓ భారత సంతతి మహిళ ఆ దేశ అధ్యక్ష పదవికి పోటీపడటం మామూలు విషయం కాదు. అసలు అమెరికా చరిత్రలోనే ఇప్పటివరకు ఒక్క మహిళా అధ్యక్షురాలు లేరు... కమలా హారిస్ ఆ దేశ మొదటి మహిళా అధ్యక్షురాలు అవుతారని చాలామంది భావించారు. మరీ ముఖ్యంగా మన ఆడబిడ్డను అగ్రరాజ్యం అధ్యక్షురాలిగా చూడాలని భారతీయులు కోరుకున్నారు. కమలా హారిస్ పూర్వీకుల సొంతరాష్ట్రం తమిళనాడులో పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఇలా ఆమె గెలుపు సంబరాలకు సిద్దమైన తమిళులకు నిరాశే ఎదురయ్యింది.

ఇదే సమయంలో మరో భారత సంతతి బిడ్డను కట్టుకున్నవాడి విజయం యావత్ దేశాన్ని ఆనందించేలా చేస్తోంది. తెలుగమ్మాయి ఉషా చిలుకూరి భర్త జేమ్స్ డేవిడ్ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. దీంతో మన అమ్మాయి అమెరికా సెకండ్ లేడీగా అవతరించబోతున్నారు. మన తెలుగమ్మాయికి దక్కిన ఈ అద్భుత గౌరవం తెలుగు ప్రజలను ఎంతో గర్వించేలా చేస్తోంది. ఉషా చిలుకూరి స్వరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో సంబరాలు జరుపుకుంటున్నారు.
 


Usha Chilukuri Vance

ఎవరీ ఉషా చిలుకూరి వాన్స్ : 

ఉషా చిలుకూరి ...  ఈ పేరులోనే తెలుగుదనం ప్రతిధ్వనిస్తోంది. ఆమె పూర్వీకులది ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం. అయితే అక్కడినుండి తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి పూర్వీకులు వలసవెళ్లారు.  

ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980లో అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. తండ్రి ఏరోస్పెస్ ఇంజనీర్ కాగా తల్లి మాలిక్యులార్ బయాలజీ, బయో కెమిస్ట్రి రంగ నిపుణురాలు. వీరు కాలిఫోర్నియాలోని శాండియాగోలో నివాసం వుంటుండగా 1986 జనవరి 6న ఉష జన్మించింది. 

ఉషా చిలుకూరి పాఠశాల విద్యాభ్యాసం శాండియాగోలోనే సాగింది. యేల్ యూనివర్సిటీ నుండి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుండి తత్వశాస్త్రంలో మాస్టర్స్ చేసారు. ఆ తర్వాత న్యాయ సంబంధమైన విభాగాల్లో పనిచేసారు. యేల్ విశ్వవిద్యాలయంలో లా ఆండ్ టెక్ జర్నల్ కు మేనేజింగ్ ఎడిటర్ గా, యేల్ లా జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ డెవలప్ మెంట్ ఎడిటర్ గా వ్యవహరించారు.  
 

Usha Vance

ఉషా చిలుకూరి, జెడి వాన్స్ లవ్ స్టోరీ :

యేల్ లా స్కూల్ లో పనిచేసే సమయంలోనే ఉషాకు జేమ్స్ డేవిడ్ వాన్స్ కు పరిచయం ఏర్పడింది. ఇద్దరి ఇష్టాయిష్టాలు కలవడంతో ఒకేలా వుండటంతో మనసులు దగ్గరయ్యాయి. ఇలా వారిమధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇలా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమ బంధాన్ని పెళ్లిపీటలు ఎక్కించారు. 2014లో వీరి వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. 

గత పదేళ్లుగా వీరి వైవాహిక జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతోంది. ఉషా, వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్ సంతానం. తమ పిల్లలను హిందూ,క్రిస్టియన్ రెండు మతాలను విశ్వసించేలా పెంచుతున్నారు. 

Usha Vance

ఉషా చిలుకూరి గురించి ఏపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు : 

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఎక్స్ వేదికన వీరికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసిన చంద్రబాబు తెలుగమ్మాయి ఉషా చిలుకూరి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

''యూఎస్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన జెడి వాన్స్ కు నా హృదయపూర్వక అభినందనలు.   అతడి విజయం చారిత్రక ఘట్టం. ఆంధ్ర ప్రదేశ్ మూలాలున్న ఉషా వాన్స్ అమెరికా రెండవ మహిళగా సేవలందించబోతున్న మొదటి తెలుగింటి మహిళ. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారందరికీ ఇది ఎంతో గర్వకారణం. యూఎస్ ఉపాధ్యక్ష దంపతులను ఏపీకి ఆహ్వానించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను'' అని చంద్రబాబు అన్నారు. 
  
 

Latest Videos

click me!