ప్రస్తుతం తిరుపతి లడ్డూ నాణ్యత ఎలావుంది? ఏ నెయ్యిని వాడుతున్నారు? : ఇండియా టుడే రిపోర్ట్

First Published | Nov 1, 2024, 12:30 PM IST

తిరుపతి లడ్డూ వ్యవహారం గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. గత వైసిపి పాలనలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వార్త భక్తులను కలచివేసింది. మరి ప్రస్తుతం తిరుపతి లడ్డూ నాణ్యత సంగతేంటి? 

Tirupati Laddu

Tirupati Laddu : హిందువులు దేవుళ్లను బాగా నమ్ముతుంటారు... ఎవరికి నచ్చిన దైవాన్ని వారు కొలుస్తుంటారు. ఆ దైవమే తమ జీవితాన్ని నడిపిస్తున్నాడని...కోరితే కోర్కెలు తీరుస్తాడని బలంగా నమ్ముతారు. కాబట్టి ఆ దేవుళ్లు కొలువైన ఆలయాలను ఎంతో పవిత్రంగా చూస్తారు. ఇలా దైవాన్ని ఎంతలా విశ్వసిస్తారో ఆలయ సన్నిధిలో లభించే ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా భావిస్తారు భక్తులు. కానీ అలాంటి ప్రసాదమే కల్తీ అయితే... భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాదు ఆరోగ్యంతోనూ చెలగాటం ఆడితే... ఇలాంటి వ్యవహారమే గత వైసిపి పాలనలో పవిత్ర తిరుమల తిరుమల దేవస్థానంలో జరిగిందనే ప్రచారం ప్రతి హిందువును కలచివేసింది. 

తెలుగు ప్రజలే కాదు దేశంలోని మెజారిటీ హిందువులు తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతారు. తిరుమలలోని ఏడు కొండలపై కొలువైన స్వామివారిని  దర్శించుకుంటే జన్మ ధన్యమని భావిస్తారు. ఇలా స్వామివారి ఎంతలా నమ్ముతారు ఆయన లడ్డూ ప్రసాదాన్ని కూడా అంతే పవిత్రంగా భావిస్తారు... కళ్లకు అద్దుకుని ఆరగించడమే కాదు ఇంటికి తీసుకెళ్లి కుటుంబసభ్యులు, చుట్టుపక్కలవారు, బంధువులు, స్నేహితులకు పంచిపెడతారు. ఇలాంటి లడ్డూలో గత వైసిపి పాలనలో కల్తీ నెయ్యిని వినియోగించారన్న ప్రచారం హిందువులు మరీముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. 

ఇలా తిరుమల లడ్డుపై వివాదం కొనసాగుతున్న వేళ ప్రముఖ మీడియా సంస్థ 'ఇండియా టుడే' కీలక చర్యలు చేపట్టింది. తిరుమల లడ్డు కల్తీ అయ్యిందని అధికార టిడిపి కూటమి, కాలేదని ఇటీవలే అధికారాన్ని కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు వాదిస్తున్నారు. దీంతో ఎవరు చెప్పేది నిజమో తేల్చుకోలేక శ్రీవారి భక్తులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో తిరుమల లడ్డూ నాణ్యతపై క్లారిటీ ఇచ్చేందుకు ఇండియా టుడే స్వయంగా రంగంలోకి దిగింది. తిరుమల లడ్డూను ల్యాబ్ టెస్ట్ చేయించి ఆ వివరాలను బైటపెట్టారు. 
 

tirupati laddu

తిరుమల లడ్డూ నాణ్యత ఇప్పుడు ఎలా వుంది? 

పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శించుకునే భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందిస్తారు. ఈ లడ్డూ చాలా ప్రత్యేకమైనది... ఇది కేవలం తిరుమల, టిటిడి అనుబంధ ఆలయాల్లో మాత్రమే లభిస్తుంది. నిర్దిష్టమైన పదార్థాలతో స్వచ్చమైన నెయ్యిని వాడి తిరుమల లడ్డూను తయారుచేయడం ఆనవాయితీ. కానీ గత వైసిపి ప్రభుత్వంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుమల లడ్డూను అపవిత్రం చేసారని టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించిన తయారుచేసిన కల్తి నెయ్యి వాడారనే తీవ్ర ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలో ఇండియా టుడే తిరుమల లడ్డూ నాణ్యతను పరీక్షించే ప్రయత్నం చేసింది. లడ్డూను సేకరించి అందులో వాడిని నెయ్యి నాణ్యతను తెలుసుకునేందుకు ల్యాబ్ లో టెస్టులు చేయించింది. శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు తిరుమల లడ్డూ శాంపిల్ పంపించి టెస్ట్ చేయించారు. ఈ క్రమంలో ప్రస్తుతం తిరుమలలో లభిస్తున్న లడ్డూలో ఎలాంటి కల్తీ లేదని...స్వచ్చమైన నెయ్యినే వాడుతున్నట్లు తేలింది. 

గత నెల అక్టోబర్ 17 న తిరుమల లడ్డూ శాంపిల్ ను టెస్ట్ కోసం పంపించింది మీడియా సంస్థ. తిరుపతి లడ్డూతో పాటు మథుర,బృందావన్ ప్రసాదాన్ని కూడా టెస్టుల కోసం పంపించారు. ఈ మూడు ప్రసాదాల్లో జంతువుల కొవ్వు లేదని తేలినట్లు శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా.ముకుల్ దాస్ తెలిపారు. ఈ మూడు శాంపిల్స్ లో స్వచ్చమైన దేశీ నెయ్యిని గుర్తించామని ... కాబట్టి ఈ ప్రసాదాలు పూర్తిగా ఆరోగ్యకరమని స్పష్టం చేసారు. ఇలా తిరుపతి లడ్డూపై భక్తుల్లో నెలకొన్న అనుమానాలను ఇండియా టుడే తొలగించింది. 
 


tirupati laddu

మరి వైసిపి హయాంలో తిరుపతి లడ్డూ సంగతేంటో?

తిరుపతి లడ్డూ ప్రస్తుతం చాలా నాణ్యతతో వుందనేది భక్తులు ఆనందించే విషయం. కానీ అసలు వైసిపి హయాంలో కల్తీ జరిగిందా? లేదా? అనేదే అసలు విషయం. గత ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో తిరుమలలో అవినీతి, అక్రమాలు జరిగాయని... స్వామివారి దర్శనం నుండి లడ్డూ ప్రసాదం వరకు ఇదే తంతు సాగిందనేది ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఆరోపణ. నిజంగానే అలా జరిగిందా?  లేక రాజకీయాల కోసం శ్రీవారిని వాడుకుంటున్నారా? అనేది తేలాల్సి వుంది. కాబట్టి వైసిపి హయాంలో తిరుమల లడ్డూ నాణ్యతపై క్లారిటీ రావాలి. 

ఇండియా టుడే తిరుమల లడ్డూ నాణ్యతను తెలుసుకుని ప్రజలకు క్లారిటీ ఇవ్వడం బాగానే వుంది. ఇది ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇస్తుంది... ఈ ప్రభుత్వం పాలనలో లడ్డూ తయారీలో నాణ్యత పాటిస్తున్నారని తేల్చేసింది. కానీ వివాదం వైసిపి హయాంలో లడ్డూ అపవిత్రం అయ్యిందని కదా...దీన్ని ఎలా తేల్చేది? మాజీ సీఎం వైఎస్ జగన్ చెబుతున్నట్లు ఆయన హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేల్చడం ఎలా? ఇది ప్రత్యేక దర్యాప్తు ద్వారానే తేలనుంది. 

ఇప్పటికే తిరుమల లడ్డూ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దేశ అత్యున్నత న్యాయస్థానం దేవుళ్లతో ఆటలొద్దని పాలకులను హెచ్చరిస్తూనే లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ ఆరోపణలపై దర్యాప్తుకు ప్రత్యేక సిట్ ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ఈ సిట్ గతంలో తిరుపతి లడ్డూ ఎలా వుంది? తయారీలో ఎలాంటి నెయ్యిని వాడారో తేల్చనుంది. 
 

tirupati laddu

తిరుమల లడ్డూ వివాదం ఎలా మొదలయ్యింది...

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి విజయం సాధించింది. దీంతో పాలనాపగ్గాలు వైసిపి చేతిలోంచి కూటమి చేతిలోకి వచ్చాయి. ఇలా నారా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన  సీఎం అయినవెంటనే తిరుమల తిరుపతి దేవస్థానంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభం అవుతుందని ప్రకటించారు.

అన్నట్లుగానే గత పాలకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తిరుమలలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇలా విచారిస్తున్న క్రమంలోనే లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం బయటపడింది. స్వచ్చమైన ఆవునెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడి తయారుచేసిన కల్తీ నెయ్యిని పవిత్రమైన లడ్డూ తయారీలో వాడినట్లు చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీంతో ఆయన గత సెప్టెంబర్ 18న ఈ విషయాన్ని బైటపెట్టారు... అప్పటినుండి తిరుపతి లడ్డూ హాట్ టాపిక్ గా మారింది. 

గతంలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని టిడిపి, జనసేన, బిజెపి నాయకులు ఆరోపిస్తే... ఎలాంటి కల్తీ జరగలేదని వైసిపి అంటోంది. అధికార పార్టీ నెయ్యి నాణ్యతకు సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్ ను కూడా బైటపెట్టింది. ఇదంతా తప్పుడు సమాచారమమని వైసిపి నాయకులు కొట్టిపారేసారు. ఇక ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో అడుగు ముందుకేసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.

ఇలా తిరుపతి లడ్డూ కల్తీ, తిరుమల పవిత్రతపై చాలా సీరియస్ గా రాజకీయాలు సాగాయి. దీంతో తిరుమల లడ్డూపై భక్తుల్లో అనేక అనుమానాలు రేగాయి... పవిత్రంగా భావించే ఈ లడ్డూప్రసాదం తినడానికి కూడా భయపడుతున్నారు. ఈ క్రమంలో గతంలో సంగతేమిటో తెలీదుగానీ ప్రస్తుతానికి తిరుమల లడ్డూ చాలా పవిత్రంగా తయారవుతోంది... స్వచ్చమైన ఆవు నెయ్యిని వాడుతున్నారని ఇండియా టుడే రిపోర్ట్ తేల్చింది. దీంతో శ్రీవారి భక్తుల్లో లడ్డూ ప్రసాదంపై అనుమానాలు తొలగిపోయాయి. 
 

Latest Videos

click me!