తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు ... శ్రీవారి సన్నిధిలో పనిచేసే లక్కీ ఛాన్స్

First Published | Dec 25, 2024, 2:45 PM IST

హిందువులు మరీముఖ్యంగా తెలుగు ప్రజలు కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే తిరుమల వెంకటేశ్వర స్వామికి సేవ చేసే అద్భుత అవకాశం కల్పిస్తోంది టిటిడి. పలు ఉద్యోగాల భర్తీకి టిటిడి సిద్దమైంది... ఈ మేరకు పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏ ఉద్యోగాలను భర్తీ చేయనున్నాారో తెలుసా? 

TTD Jobs

TTD Jobs : తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శించుకుంటే చాలు జీవితం ధన్యమని భావిస్తుంటారు. కేవలం రెండు సెకన్ల పాటు స్వామిని చూసేందుకు సుదూరం నుండి జర్నీచేసి... క్యూలైన్, కంపార్ట్ మెంట్స్ లో పడిగాపులు కాస్తుంటారు. ఇక పవిత్రమైన తిరుమలలో తాత్కాలికంగా సేవ చేసే అవకాశం వచ్చిందంటే మురిసిపోతుంటారు. ఇలా తిరుమల శ్రీవారి సేవలో తరించేందుకు చాలామంది తహతహలాడుతుంటారు. అలాంటిది ఆ శ్రీవారిని జీవితాంతం సేవ చేసుకునే అవకాశం వస్తే... అవును, మీరు వింటున్నది నిజమే. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది...ఈ మేరకు పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 

TTD Jobs

టిటిడిలో ఉద్యోగాల భర్తీ : 

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం నిన్న(మంగళవారం) అన్నమయ్య భవన్ లో జరిగింది. టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు, పాలకమండలి సభ్యులు, ఉన్నతోద్యుగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు... వీటిలో ఒకటి టిటిడిలో ఉద్యోగాల భర్తీ. 

తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని టిటిడి పాలకమండలి భావిస్తోంది. ఇందుకోసం టిటిడి వైద్య విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని పాలకమండలి నిర్ణయించింది. ఇందులో భాగంగానే వైద్య సిబ్బంది నియామకానికి టిటిడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చంది. వైద్య విభాగంలో ఎలాంటి ఖాళీలు లేకుండా ఉద్యోగాలను భర్తీ చేయాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది. 

ముఖ్యంగా స్వామివారిపై భక్తితో కాలినడకన ఏడుకొండలెక్కివచ్చే భక్తులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని టిటిడి భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా డాక్టర్, నర్సింగ్, పారా మెడికల్ ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది... అంతేకాదు అత్యాధునిక పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని టిటిడి పాలకమండని నిర్ణయించింది. 

ఇక శ్రీవారి దర్శనంకోసం తిరుమలకు వచ్చే భక్తులకు టిటిడి ఉచితంగానే అన్నదానం చేసే విషయం తెలిసిందే. అయితే రోజురోజుకు తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అన్నప్రసాద విభాగంలో సిబ్బందిని కూడా పెంచాలని టిటిడి భావిస్తోంది. ఇందులో భాగంగానే 258 మందిని కాంట్రాక్ట్ పద్దతిలో నియమించుకోవాలని టిటిడి పాలకమండలి తాజా సమావేశంలో నిర్ణయించారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పోరేషన్ ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు.  

 శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆహార‌ ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు టీటీడీలో ఫుడ్ సెఫ్టి విభాగాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా సీనియర్  ఫుడ్ సేఫ్టి ఆఫీస‌ర్‌ పోస్టును SLSMPC (Sri Lakshmi Srinivasa Manpower Corporation) కార్పొరేషన్ ద్వారా భర్తీ చేసేందుకు టిటిడి పాలకమండలి ఆమోదం తెలిపింది.
 


TTD Jobs

టిటిడి పాలకమండలిలో నిర్ణయాలివే : 

ఇప్పటికే స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు గంటలతరబడి క్యూలైన్లు, కంపార్ట్ మెంట్స్ లో వేచివుండకుండా కేవలం అరగంట,గంట సేపట్లోనే దర్శనం కల్పించి బయటకు పంపాలని టిటిడి భావిస్తోంది. ఇందుకోసం సరికొత్త ఏఐ టెక్నాలజీని పరిశీలిస్తున్నారు. పలు సంస్థలు సాంకేతిక టెక్నాలజీని అందించేందుకు ప్రతిపాదనలో ముందుకు వచ్చాయి.వీటిని పూర్తిగా అద్యయనం చేసి అంతా ఓకే అనుకున్నాక అమలు చేయాలని టిటిడి భావిస్తోంది. 

ఇక తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (SVIMS) హాస్పిటల్ కు జాతీయ హోదా కోసం ప్రయత్నాలు చేయాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రానికి లేఖ రాయాలని తీర్మానించారు. జాతీయ హోదా ద్వారా మరిన్ని సదుపాయాలు కల్పించవచ్చని...  తద్వారా మరింత మెరుగైన వైద్యం అందించవచ్చని భావిస్తున్నారు.

ఇక తిరుమలలో హోటళ్ళు, రెస్టారెంట్లలో నాణ్యతతో కూడిన ఆహారం దొరకడంలేదని టిటిడి గుర్తించింది. ఇదే సమయంలో దేశంలోని ప్రముఖ రెస్టారెంట్లు తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలతో, నాణ్యమైన ఆహారం అందిస్తూ వ్యాపారం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కాబట్టి ఇలాంటి రెస్టారెంట్స్ కు అనుమతి ఇచ్చేందుకు టిటిడి సిద్దమైంది. అంతేకాదు ఇప్పుడున్న రెస్టారెంట్లు,హోటల్లలో తనిఖీ కోసం నలుగురు నిపుణులతో అహార భద్రత విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 
 
శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు గంటలతరబడి క్యూలైన్లలో వేచివుండాల్సి వస్తుంది. అయితే ఈ సమయంలో భక్తులు వినియోగించుకునేందుకు ఇప్పుడున్న మరుగుదొడ్లు సరిపోవడంలేదు. అందువల్లే మరిన్ని మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3.36 కోట్లు కేటాయించింది టిటిడి. ఆల్వార్ ట్యాంక్ విశ్రాంతి భ‌వ‌నాల నుండి బాట గంగమ్మ సర్కిల్ మధ్యలో 6 టాయిలెట్ బ్లాక్స్ నిర్మించేందుకు టిటిడి ఆమోదం తెలిపింది.  

ఇంకా అనేక అంశాలపై టిటిడి పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు మరింత ఆద్యాత్మిక వాతావరణం కల్పించి స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా టిటిడి పాలనమండలి నిర్ణయాలు వుంటాయని తెలిపారు. 'తిరుమల విజన్-2047' లక్ష్యాల సాధన దిశగానే టిటిడి నిర్ణయాలు వుంటాయని టిడిపి ఛైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు.

ఒంటి మిట్ట కోదండ రామాలయంలో విమాన గోపురానికి రూ.43 ల‌క్ష‌ల‌తో బంగారు కలశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి స్థానిక సిడ్కో కేటాయించిన 3.60 ఎకరాల స్థలానికి నిర్ణ‌యించిన రూ.20కోట్ల‌కు పైగా ఉన్న‌ లీజు ధరను తగ్గించేందుకు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న సాంప్రదాయ పాఠశాలకు ఎస్వీ విద్యాదాన ట్రస్టు నుండి ప్రతి సంవత్సరం రూ.2 కోట్లు ఆర్థిక సాయం చేసేందుకు టిటిడి ఆమోదం తెలిపింది. 

ఏపీ యువతకు అద్భుత అవకాశం ... ఆర్టిసిలో 11,500 జాబ్స్

యువతకు గుడ్ న్యూస్ ... తెలంగాణ ఆర్టిసిలో భారీ ఉద్యోగాల భర్తీ, ఎన్నో తెలుసా?

Latest Videos

click me!