ఏపీ యువతకు అద్భుత అవకాశం ... ఆర్టిసిలో 11,500 జాబ్స్

First Published | Dec 24, 2024, 8:31 PM IST

ఆంధ్ర ప్రదేశ్ యువతకు అద్భుత అవకాశం. ఏపీఎస్ ఆర్టిసిలో భారీ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోంది. ఎన్ని వేళ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారో తెలుసా? 

APSRTC Jobs : ఆంధ్ర ప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేలా కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సిద్దమైన చంద్రబాబు సర్కార్ మరో భారీ నోటిఫికేషన్ కు సిద్దమవుతోంది. ప్రభుత్వరంగ సంస్థ ఏపిఎస్ ఆర్టిసిలో లో భారీ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆర్టిసి ఉన్నతాధికారులు ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక కూడా పంపించింది... ఇక కూటమి ప్రభుత్వ ఆమోదమే మిగిలింది. ప్రభుత్వం సై అంటే ఏకంగా 11,500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది.

ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచిపోయింది...  అప్పటినుండి ఆంధ్ర ప్రదేశ్ ఆర్టిసిలో పెద్దగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది లేదు. కానీ ప్రతిఏటా ఉద్యోగులు పదవీ విరమణ పొందుతూనే వున్నారు. దీంతో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాల్సి వుంది.

ఇక కూటమి ఎన్నికల హామీల్లో మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం ఒకటి. ఈ హామీని నెరవేర్చేందుకు సర్కార్ సిద్దమయ్యింది. ఈ పథకం అమలుపై అధ్యయనం కోసం రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటుచేసారు. దీని సూచనల మేరకు మహిళలకు ఉచిత ప్రయాణ  హామీని అమలుచేయనుంది చంద్రబాబు ప్రభుత్వం. 

APSRTC Jobs

ఆర్టిసి ఉద్యోగాల వివరాలు : 

ఆంధ్ర ప్రదేశ్ ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ఇప్పుడు నడుపుతున్న బస్సులు సరిపోవని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం అమలయితే రోజుకు 10 లక్షలమంది ప్రయాణికులు అదనంగా బస్సులు ఎక్కుతారు... కాబట్టి ఇప్పుడున్న బస్సులు సరిపోవని అంటున్నారు. కొత్తగా మరో 2 వేల బస్సులు ఆర్టిసిలో చేరితేగాని ఈ ఉచిత ప్రయాణం పథకం సాధ్యంకాదని స్పష్టం చేస్తున్నారు. 

ఇలా బస్సులు కొంటే సరిపోతుంది... వాటిని నడిపేందుకు డ్రైవర్లు, కండక్టర్లు కావాలి. మెయింటెయిన్ కోసం మెకానిక్, ఇతర సిబ్బంది అవసరం. ఇలా మొత్తంగా 11,500 మంది ఉద్యోగులను నియమించుకోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించారు ఏపీఎస్ ఆర్టిసి ఉన్నతోద్యోగులు. 

ఇలా కొత్తగా ఏపిఎస్ ఆర్టిసి నియమించే ఉద్యోగాల్లో అత్యధికంగా డ్రైవర్లు, కండక్టర్లు వుండనున్నాయి. ఈ ఉద్యోగాలే 10,000 వరకు వుంటాయి... మిగతా జూనియర్ అసిస్టెంట్, సూపర్వైజర్లు వంటి పోస్టులు మరో 1500 వరకు వుంటాయి. చాలా తక్కువ విద్యార్హతతో మంచి జీతంతో ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగం... కాబట్టి ఈ ఉద్యోగాలకు పోటీ చాలా ఎక్కువగా వుంటుంది. 


APSRTC Jobs

మహిళలు ఉచిత ప్రయాణంతో ప్రభుత్వంపై పడే భారమెంత? 

ప్రస్తుతం ఏపిఎస్ ఆర్టిసి బస్సుల్లో ప్రతిరోజు సగటున 44 లక్షల మంది ప్రయాణిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. వీరిలో 40శాతం మంది మహిళలు, 60 శాతం మంది పురుషులు వుంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలయితే ఇది తలకిందులు అవుతుంది... మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. 

ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూసినా ప్రతిరోజు ఆర్టిసికి రూ.16-17 కోట్ల ఆదాయం వస్తుంటే అందులో మహిళా ప్రయాణికుల ద్వారా రూ.7 కోట్ల వరకు వస్తోంది. వారికి ఉచిత ప్రయాణం కల్పిస్తూ రోజూ ఈ 7 కోట్ల రూపాయలు వదులుకోవాల్సిందే... అంతేకాదు మహిళల రద్దీ పెరిగితే పురుషులు బస్సులెక్కడానికి వెనకాడే అవకాశం వుంటుంది. అలా మరికొంత ఆదాయం కోల్పోతుంది. ఇలా నెలకు రూ.200‌-250 కోట్లను ఏపీ ఆర్టిసి కోల్పోతుంది.  

ఇలా ఆదాయాన్ని కోల్పోయే ఆర్టిసికి ప్రభుత్వం ఆర్థికసాయం తప్పనిసరి. లేదంటే ఆర్టిసి కుప్పకూలడం ఖాయం. ఆర్టిసి ఉద్యోగులు, మెయింటెనెన్స్ కోసం ప్రతినెలా రూ.300-350 కోట్లు ఖర్చవుతుంది... ఇందులో అధికమొత్తం ప్రభుత్వమే సమకూర్చాల్సి వుంటుంది. అయితేనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలు సాధ్యమవుతుంది. 
 

Latest Videos

click me!