Tirumala Temple
Tirumala : హిందువులు తిరుమల వెంకటేశ్వరస్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించి కొలుస్తుంటారు. స్వామివారిని కనులారా చూసి తరించాలని తిరుమలకు వెళుతుంటారు. కానీ అక్కడ ప్రశాంతంగా ఆ వెంకన్నను దర్శించుకునే భాగ్యం చాలామందికి దొరకదు. ప్రతిరోజూ గంటల తరబడి ప్రత్యేక రోజులు, పండగలు, హాలిడేస్ సమయాల్లో ఒకటి రెండ్రోజులు కూడా భక్తులు క్యూలైన్, కంపార్ట్ మెంట్స్ లో వేచివుండాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో ఎంతో హుషారుగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు క్యూలైన్ లో చుక్కలు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇలా చాంతాడంత క్యూలైన్లలో నిలబడి నిలబడి ఢీలా పడిపోవడంతో వారిలోని భక్తి కాస్త అసహనంగా మారుతుంది.
తిరుమల వెంకన్న దర్శనంకోసం భక్తులు పడుతున్న బాధలను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నూతన పాలకమండలి గుర్తించింది. దీంతో భక్తులకు చాలా ఈజీగా కేవలం అరగంట లేదా గంట సేపట్లోనే స్వామివారిని దర్శించుకుని ఆలయం నుండి బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఇటీవలే జరిగిన మొదటి పాలకమండలి సమావేశంలో దీనిపై చర్చించారు. అనుకున్నదే తడవుగా భక్తులకు టెక్నాలజీ సాయంతో అతి తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నారు.
Tirumala Temple
శ్రీవారి సేవలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ :
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... మరోసారి టెక్నాలజీ రంగంలో విప్లవాన్ని సృష్టిస్తోంది. ఇప్పుడు ప్రతి రంగంలోనూ ఏఐ ని ఉపయోగించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు దేవాలయాలకు కూడా చేరింది. తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించి అతి తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకునేలా ఏఐ టెక్నాలజీని ఉపయోగించేందుకు టిటిడి సిద్దమయ్యింది.
ఈ ఏఐ ద్వారా దర్శనాలను కల్పించే ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు స్వయంగా వెల్లడించారు. ఎక్స్ వేదికన అతి తక్కువ సమయంలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు చేపడుతున్న చర్యలను టిటిడి ఛైర్మన్ వివరించారు.
తిరమల శ్రీవారి దర్శనంకోసం గంటలకు గంటలు, ఒక్కోసారి రోజుల తరబడి క్యూలైన్లలో పడిగాపులు పడాల్సిన పరిస్థితికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చెక్ పెడుతున్నట్లు బిఆర్ నాయుడు తెలిపారు. కేవలం అరగంట, రద్దీ సమయాల్లో అయితే గంట రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నిపుణులైన పలు సంస్థలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కలుస్తున్నారు.
ఇలా తాజాగా AI ను ఉపయోగించి రద్దీని నియంత్రించే క్యూ మేనేజ్ మెంట్ లో అనుభవం కలిగిన Aaseya,Ctruh సంస్థలు తాజాగా టిటిడి ని సంప్రదించాయి. ఈ సంస్థలు సంయుక్తంగా ఓ సిస్టమ్ ను రూపొందించాయి... దీన్ని టిటిడి పాలకమండలికి డెమో చేసి చూపించారు. ఈ సంస్థ ప్రతినిధులు తిరుమలలో భక్తుల సౌకర్యార్థం రూపొందించిన ప్లాన్ ను బోర్డు చైర్మన్, సభ్యులకు వివరించారు.
శ్రీవారి దర్శనంకోసం తిరుమలకు వచ్చే భక్తుల ఫేస్ రిగక్నైజేషన్ చేసి కియోస్కి మిషన్ స్లిప్ జనరేట్ చేస్తుంది.ఆ స్లిప్ లో కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చిన భక్తులు ఫేస్ రీడింగ్ ద్వారా లేదా బార్ కోడ్ స్లిప్ స్కాన్ ద్వారా దర్శనానికి అనుమతించే విధానాన్ని పరిశీలించారు.
ప్రస్తుతం డెమో ఇచ్చిన రెండు కంపెనీలు 14 దేశాల్లో సేవలందిస్తున్నారు....వీళ్లతో పాటు పలు సంస్థలు ముందుకొస్తున్న నేపధ్యంలో ఆచరణ యోగ్యమైన విధానాన్ని ఫైనల్ చేసి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేయనున్నారు.
Tirumala Temple
తిరుమలలో ఏఐ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది :
తిరుమలకు వెళ్ళగానే భక్తులకు మొదట వారి ఆధార్ కార్డు నంబర్, ఫేస్ రికగ్నేషన్ రసీదు ఇస్తారు. అందులో వారు శ్రీవారిని ఏ సమయంలో దర్శించుకోవాలో టైమ్ సూచించే ఓ టోకెన్ వుంటుంది. ఈ టోకెన్ తీసుకున్న సందర్శకులు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోగానే ఫేస్ రికగ్నిషన్ ఎంట్రన్స్‌లో స్కానింగ్ చేస్తారు. అనంతరం వారిని క్యూ లైన్‌లోకి పంపుతారు. ఇలా క్యూలోకి వెళ్లాక ఎక్కడ ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శనానికి వెళ్లవచ్చు. అంటే అరగంట లేదా గంట సేపట్లో దర్శనం పూర్తవుతుంది.
భక్తులకు టోకెన్ల జారీకి దాదాపు 45 కౌంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు టిటిడి చెబుతోంది. ఇలా సిబ్బందితో పని లేకుండా ఎఐ టెక్నాలజీని తిరుమల కొండపై అమలు చేయనున్నారు. ఈ విధానం అమలుకు ఎఐ సాఫ్ట్‌వేర్‌ను అందించేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇలా వచ్చిన ఓ సంస్థ టిటిడి పాలమండలి డెమో ఇచ్చింది.
ఈ విధానం సక్సెస్ అయితే భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది. గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సిన అవసరం లేకుండా ఇష్టదైవం వెంకటేశ్వరస్వామిని ఈజీగా దర్శించుకుంటారు. ఇలా టెక్నాలజీ సాయంతో టిటిడి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని భక్తులు కోరుకుంటున్నారు.
Tirumala Temple
టిటిడి పాలకమండలి సమావేశం :
తిరుమల తిరుపతి దేశస్థానం పాలకమండలి సమావేశం ఇవాళ(మంగళవారం) అంటే డిసెంబర్ 24న జరుగుతోంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఛైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం ఉదయమే ప్రారంభమైంది. టిటిడి పాలకమండలి సభ్యులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
టిటిడి పాలకమండలి సమావేశంలో 66 అజెండా ఆంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భక్తుల దర్శనం కోసం ఏఐ ని వినియోగించే అంశం కూడా వుంది. అలాగే భక్తులతో టిటిడి ఉద్యోగులు దురుసుగా ప్రవర్తించకుండా నేమ్ బ్యాడ్జ్ పెట్టుకుని విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని టిటిడి భావిస్తోంది... దీనిపై కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇక గత గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలు జరగాయనేదానిపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు.