ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు : సొంత చెల్లికే కాదు కన్నతల్లికీ జగన్ ఆస్తిలో వాటా ఇవ్వడట!

First Published Oct 23, 2024, 12:56 PM IST

రాజకీయ ప్రత్యర్థులైన అన్నాచెల్లి వైఎస్ జగన్, షర్మిల ఒక్కటి కానున్నారని ... వారి మధ్య రాజీ కుదిరిందనే ప్రచారం వేళ ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. అన్నాచెల్లి ఆస్తుల వివాదంలోకి తల్లి విజయమ్మ ఎంటర్ అయ్యారు. 

YS Jaga Vs YS Sharmila

YS Jaga Vs YS Sharmila : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా ఎంత బలమైన నాయకుడో అందరికీ తెలిసిందే. బ్రతికున్నంతకాలం రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఆయన మరణానంతరం కూడా తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ పై ప్రభావం చూపించారు. ఇలా బ్రతికుండగానే కాదు చనిపోయాక కూడా రచ్చ గెలిచిన రాజశేఖర్ రెడ్డి ఇంట మాత్రం గెలవలేకపోయాడని తాజా పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. ఆయన మరణానంతరం వైఎస్ కుటుంబంలో విబేధాలు భగ్గుమన్నాయి. ఆయన కన్నబిడ్డలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల అన్నాచెల్లి అనుబంధాన్ని మరిచి ఆస్తులు, రాజకీయ వారసత్వం కోసం గొడవకు దిగారు. ఇలా వైఎస్సార్ జీవితాంతం ఎంతో కష్టపడి సంపాదించుకున్న పరువు ప్రతిష్టలను వారసులు రోడ్డుకీడ్చారు.

ఇప్పటికే వైఎస్సార్ బిడ్డలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య వ్యక్తిగతంగా ఆస్తుల కోసమే కాదు రాజకీయ వైరమూ కొనసాగుతోంది. ఇంకా చెప్పాలంటే ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలే రాజకీయ వైరానికి దారితీసాయి. ఇది ఒకరి రాజకీయ జీవితాన్ని మరొకరు నాశనం చేసే స్థాయికి చేరుకుంది. అయితే ఇటీవల అన్నాచెల్లి మధ్య ఆస్తుల విషయంలో రాజీ కుదిరిందనే వార్తలు వచ్చాయి. దీంతో వీరిమధ్య వ్యక్తిగత, రాజకీయ వైరం ముగిసినట్లే అందరూ భావించారు. వైఎస్సార్ వారసులు వ్యక్తిగత, రాజకీయ వైరానికి ఎండ్ కార్డ్ పడినట్లేనని అనుకున్నారు. 

ఇలా అంతా సాఫీగా సాగిపోతుందని అనుకుంటుండగానే ఎవరూ ఊహించని వ్యవహారం ఒకటి బైటపడింది. సోదరి వైఎస్ షర్మిలకు ఆస్తి పంచివ్వడం కాదుకదా గతంలో ఇవ్వాలనుకున్న ఆస్తుల విషయంలోనూ వైఎస్ జగన్ నిర్ణయాన్ని మార్చుకున్నారు. తన  చెల్లి షర్మిల, తల్లి విజయమ్మకు కంపనీలో వాటా ఇవ్వడానికి గతంలో అంగీకరించిన జగన్ ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు న్యాయపోరాటానికి సిద్దమయ్యారు మాజీ ముఖ్యమంత్రి జగన్. దీంతో వైఎస్సార్ బిడ్డల మధ్య వైరం ముగియడం కాదు మరింత ముదిరింది. 
 

YS Jaga Vs YS Sharmila

తల్లీ, చెల్లిపై జగన్ న్యాయపోరాటం : 

వైఎస్ కుటుంబ ఆస్తుల పంచాయితీ ఇంతకాలం తెరవెనకే సాగింది. ఇటు వైఎస్ జగన్ గానీ, అటు వైఎస్ షర్మిల గానీ ఆస్తి పంపకాల వివాదాల గురించి బయట మాట్లాడింది లేదు. దీంతో అన్నాచెల్లి మధ్య ఆస్తుల వివాదం ప్రచారంగానే వుంది... క్లారిటీ లేదు. కానీ తాజాగా వీరి ఆస్తుల పంచాయితీ రచ్చకెక్కింది... వైఎస్ జగన్ ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వబోనని కోర్టుకు ఆశ్రయించారు. 

సరస్వతి పవర్ ఆండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో వైఎస్ జగన్ కు 51 శాతం వాటా వుంది. ఇందులో తల్లి విజయమ్మ, సోదరి షర్మిలకు కొంత వాటా కేటాయించేందుకు 2019, ఆగస్ట్ 21న ఒప్పందం చేసుకున్నాడు. ఈ మేరకు ఎంఓయూపై సంతకాలు చేసుకున్నారు. కానీ వివిధ కారణాలతో ఇప్పటివరకు ఆ వాటా పంపిణీ ప్రక్రియ పూర్తికాలేదు. ఇదే ఇప్పుడు వివాదానికి దారితీసింది. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న జగన్... తల్లి, చెల్లికి సరస్వతి పవర్ ఆండ్ ఇండస్ట్రీస్ వాటాను ఇచ్చేందుకు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని నేషనల్ కంపనీ లా ట్రిబ్యూనల్ ను ఆశ్రయించాడు. 

సరస్వతి పవర్ ఆండ్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ లో తాము కీలక పాత్ర పోషించామని వైఎస్ జగన్, భారతి పేర్కొంటున్నారు. కేవలం తోబుట్టువు అనే ప్రేమతోనే వైఎస్ షర్మిలకు ఈ కంపనీలో వాటాను కేటాయించాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ షర్మిల తనను వ్యక్తిగతంగానే కాదు రాజకీయంగానూ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది...కాబట్టి సరస్వతి పవర్ ఆండ్ ఇండస్ట్రీస్ వాటా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ వైఎస్ జగన్ NCLT (National Company Law Tribunal) పిటిషన్ దాఖలు చేసారు. 

ఇందులో ప్రతివాదులుగా సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ తో పాటు తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల, చాగరి జనార్దన్‌ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్‌ రెడ్డి, రీజినల్‌ డైరెక్టర్‌ సౌత్‌ ఈస్ట్‌ రీజియన్‌, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ తెలంగాణలను చేర్చారు. దీంతో వీరందరికి NCLT నోటీసులు జారీ  చేసింది. నవంబర్ 8న ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది.

Latest Videos


YS Jaga Vs YS Sharmila

జగన్, షర్మిల మధ్య రాజీ సంగతేంటి : 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపులో ఆయన సోదరి వైఎస్ షర్మిల పాత్ర మరిచిపోలేనిది. అయితే ఇదే షర్మిల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి ఓ కారణమయ్యారు. ఆస్తుల పంపకం విషయంలోనే అన్నాచెల్లి మధ్య వివాదం రాజుకుందని...  ఇది చివరకు రాజకీయ వైరంగా మారిందన ప్రచారం జోరుగా సాగుతోంది. 

అయితే తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్నాచెల్లి జగన్, షర్మిల దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరిగింది. వీరిద్దరి మధ్య రాజకీయ వైరం ఇతర పార్టీలకు లాభం చేస్తోందనేది గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఇద్దరి మధ్య ఆస్తి పంపకాల విషయంలో రాజీ కుదిర్చి రాజకీయంగా కలిసి పనిచేసేలా బెంగళూరు వేదికగా చర్చలు జరుగుతున్నారని వార్తలు వెలువడ్డాయి. వైఎస్ కుటుంబానికి సన్నిహితులు, కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు అన్నాచెల్లిని ఒక్కటిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. 

అయితే తాజాగా వైఎస్ జగన్ కేవలం చెల్లి షర్మిలపైనే కాదు ఆమెకు మద్దతుగా నిలుస్తున్న తల్లి విజయమ్మపైనా కోర్టును ఆశ్రయించడం చూస్తుంటే రాజీపై జరిగిందంతా తప్పుడు ప్రచారమేనని అర్థమవుతుంది. గతంలో సరస్వతి పవర్ ఆండ్ ఇండస్ట్రీస్ లో తల్లి,చెల్లికి ఇవ్వాలనుకున్న వాటా విషయంలోనే తాజాగా వెనక్కితగ్గారు జగన్... అలాంటి పూర్తిగా ఆస్తుల పంపిణీకి ఆయన అంగీకరించారంటే అస్సలు నమ్మలేం. కాబట్టి అన్నాచెల్లి జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదంతో పాటు రాజకీయ వైరం యధావిధిగా కొనసాగుతుందనేది స్పష్టంగా తెలుస్తోంది. 
 

click me!