APSRTC Prohibited Items
APSRTC : సామాన్య ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టిసి బస్సులను ఉపయోగిస్తుంటారు. పేద,మధ్యతరగతి ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టిసి కీలక పాత్ర పోషిస్తోంది. తక్కువ ఖర్చులోనే ఎక్కువ దూరం సౌకర్యవంతంగా ప్రయాణించాలంటే ముందుగా గుర్తుకువచ్చేది ఈ బస్సులే. ఆ ఆర్టిసి బస్సులతో ప్రజలకు ప్రత్యేక అనుబంధం వుంది... వీటిని తమ సొంతంగా భావిస్తుంటారు.
అయితే కొందరు ఖర్చు తగ్గుతుందని భావించి బస్సుల్లో వివిధ రకాల వస్తువులు కూడా తరలిస్తుంటారు. సాధారణ వస్తువులు తరలిస్తే పర్వాలేదు... కానీ కొన్నింటిపై ఆర్టిసి బస్సుల్లో నిషేధం వుంటుంది. అలాంటి వస్తువులను తరలిస్తూ పట్టుబడితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలా ఆంధ్ర ప్రదేశ్ ఆర్టిసి కూడా కొన్నింటిని బస్సుల్లో తరలించడంపై నిషేధం విధించింది. ఆ వస్తువుల్లో మనిషి తల వెంట్రుకలు, ఎండు చేపలు వంటివి అనేకం వున్నాయి.
APSRTC Prohibited Items
ఏపిఎస్ ఆర్టిసి బస్సుల్లో తరలించకూడని వస్తువులివే :
1. పేలుడు పదార్థాలు : కొందరు ప్రయాణికులు వ్యక్తిగత అవసరాల కోసమో లేదంటే వ్యాపార పనులకోసమో ఆర్టిసి బస్సుల్లో పెట్రోల్, డీజిల్ వంటివారిని తరలిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం... ప్రయాణికుల రక్షణ కోసం ఇలాంటి పేలుడు స్వభావమున్న వస్తువులను బస్సుల్లో తరలించడంపై నిషేదం విధించిన ఏపిఎస్ ఆర్టిసి.
కిరోసిన్, గ్యాసోలైన్, మిథైలేటెడ్ స్పిరిట్, టర్ఫెంటైన్, యాసిడ్స్, సల్ఫర్, కాల్ తార్, గన్ పౌడర్ వంటి పదార్థాలు కూడా బస్సులో తరలించడం నిషేధం. వీటిని తరలిస్తూ పట్టుబడితే ఫైన్ విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు.
దీపావళి, న్యూ ఇయర్ వంటి పండగల వేళ టపాసులు పేలుస్తుంటారు. కొందరు వీటిని కొనుగోలుచేసి బస్సులో తీసుకెళుతుంటారు. అయితే ఇవి కూడా పేలుడు పదార్థాలే కాబట్టి ఏపీఎస్ ఆర్టిసి బస్సుల్లో వీటిపై నిషేధం వుంది...కాబట్టి ఇలా తరలిస్తూ పట్టుబడితే చిక్కుల్లో పడతారు.
బుల్లెట్స్ లోడ్ చేసిన తుపాకితో బస్సులో ప్రయాణించడం కూడా నేరమే. గ్యాస్ సిలిండర్ కూడా పేలుడు స్వభావాన్ని కలిగివుంటుంది. కాబట్టి దీనిపై కూడా బస్సుల్లో నిషేధం వుంది.
APSRTC Prohibited Items
2. అటవీ ఉత్పత్తులు :
అటవీ ప్రాంతాల్లోని ప్రజలు కొన్నిరకాల అటవీ ఉత్పత్తులను తెలియక ఆర్టిసి బస్సుల్లో తరలిస్తుంటారు. ఇక మరికొందరు రహస్యంగా విలువైన అటవీ, జంతువులకు శరీరభాగాలు, వాటికి సంబంధించిన వస్తువులు తరలిస్తుంటారు. ఇలా తెలియన అయినా, తెలిసయినా కొన్ని వస్తువులను ఏపీఎస్ ఆర్టిసి బస్సుల్లో తరలించడం నేరం.
జంతువుల తోలు, కొమ్ములు, ఎముకలు, పక్షుల ఈకలు, చేపలు (ఎండుచేపలు కూడా), చనిపోయిన జంతువులు ఆర్టిసి బస్సులో తరలించకూడదు. పెంపుడు జంతువులను కూడా బస్సుల్లో తీసుకెళ్లకూడదు. గంజాయి వంటి నిషేధిత పదార్థాలను కూడా బస్సులో తరలించకూడదు.
3. సినిమా ఫిల్మ్ :
ఒకప్పుడు సినిమా ఫిల్మ్స్ ను దూర ప్రాంతాలకు ఈజీగా చేరవేసేందుకు బస్సులను ఉపయోగించేవారు. అయితే వీటిని భద్రంగా ప్యాక్ చేసి పంపేవారు. ఇదే అదునుగా కొందరు సినిమా రీళ్లను అక్రమంగా తరలించడం చేసేవారు. దీంతో ప్యాక్ చేయకుండా తరలించే సినిమా రీల్స్ పై కూడా ఏపిఎస్ ఆర్టిసి నిషేధం విధించింది.
APSRTC Prohibited Items
4.మనిషి వెంట్రుకలు :
ఆంధ్ర ప్రదేశ్ ఆర్టిసి మనిషి వెంట్రుకలను కూడా ఆర్టిసి బస్సుల్లో తరలించడంపై నిషేధం విదించింది. వెంట్రుకలకు మంచి గిరాకీ వుండటంతో వాటిని అక్రమంగా ఆర్టిసి బస్సుల్లో తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే వీటిపై నిషేధం విధించారు.
మానవ మృతదేహాలను కూడా ఆర్టిసి బస్సులో తరలించకూడదు. మృతదేహాలను కేవలం సొంత వాహనాలు లేదంటే ప్రైవేట్ వాహనాలు, అంబులెన్స్ లో మాత్రమే తరలించుకోవాలి.
5. నిషేధిత కరపత్రాలు, పుస్తకాలు :
హింసను ప్రేరేపించేలా వుండేవి, యువతను తప్పుడుమార్గంలో తీసుకెళ్లే రచనలపై నిషేధం వుంది. ఇలాంటివి బస్సుల్లో తరలించకూడదు. ముఖ్యంగా మావోయిస్టులకు సంబంధించి కరపత్రాలతో పట్టుబడితే కఠిన శిక్షలు వుంటాయి.
6.ఇతర పదార్థాలు :
ప్యాక్ చేయని పత్తి బేళ్లు, ఉలన్, పొగాకు వస్తువులను కూడా ఏపీఎస్ ఆర్టిసి బస్సుల్లో తరలించడం నిషేధం. బైక్స్, స్కూటర్లను కూడా బస్సులో తరలించే ప్రయత్నం చేయకూడదు. అలాగే కొన్నిరకాల ప్రమాదకర పురుగులను కూడా తరలించడం నిషేధం.
ఇక మత్తు పదార్థాలపై కూడా ఏపీఎస్ ఆర్టిసి నిషేధం విధించింది. వీటిని తరలించేవారికి కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం కూడా మత్తు పదార్థాల స్మగ్లింగ్ పై చాలా సీరియస్ గా వుంది... తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది.