Andhra Pradesh Rains
Andhra Pradesh Rains : ఆంధ్ర ప్రదేశ్ ను వర్షాలు వదిలిపెట్టడంలేదు. వర్షాకాలంలో కుండపోత వానలు పడ్డాయి... దీంతో వరదలు సంభవించి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. ఇలా విజయవాడను వరదలు ముంచెత్తి ఎంత భీభత్సం సృష్టించాయో అందరం చూసాం. వర్షాకాలం ముగిసింది... ఇక వరదలు వంటి ప్రమాదాలు వుండవని ఏపీ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కానీ వర్షాలు మాత్రం ఏపీని వదల బొమ్మాళి... వదలను అంటున్నాయి.
విజయవాడ వరదలు ముంచెత్తిన ఘటన మరిచిపోకముందే ఏపీలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఇటీవల అల్పపీడనం, తుపానుల ప్రభావంతో వర్షాలు దంచి కొడుతూనే వున్నాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ముందుకు కదులుతూ మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది ఇలాగే బలపడుతూ తీరాన్ని దాటితే భారీ నుండి అతిభారీ వర్షాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తీరానికి సమీపంలో వున్న ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే గురువారం అంటే డిసెంబర్ 26 వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని ప్రకటించారు.
Andhra Pradesh Rains
ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు :
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా వుంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ ప్రాంతంలోని పలు జిల్లాల్లో ఇవాళ(మంగళవారం) మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. భారీ వర్షాలు కురిసినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది... ఇప్పటికే వర్షాలు కురిసే అవకాశం వున్న జిల్లాల అధికారులను అప్రమత్తం చేసారు.
ఇవాళ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి,కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు. అలాగే విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలకు కూడా వర్ష సూచనలు వున్నాయి. ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే అవకావాలున్నాయని ప్రకటించారు.
Andhra Pradesh Rains
బుధ, గురువారం వర్షతీవ్రత ఎక్కువగా వుండే జిల్లాలు :
రేపు, ఎల్లుండి (బుధ,గురువారం) కూడా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రెండ్రోజులు నెల్లూరు, తిరుపతి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసారు.
తీవ్ర అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా వుంది... కాబట్టి మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే తీరం దాటే సమయంలో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం వుంటుంది...కాబట్టి తీరప్రాంత ప్రజలు కూడా జాగ్రత్తగా వుండాలని సూచించారు. రైతులు కూడా ఈ రెండుమూడు రోజులు పంట కోత చేపట్టరాదని... కోసిన పంటన తడవకుండా జాగ్రత్తపడాలని సూచించారు.
Andhra Pradesh Rains
స్కూళ్లకు సెలవులు?
భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే జిల్లాల్లో పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు విద్యాసంస్థలకు సెలవులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎప్పటికప్పుడు జిల్లాలోని పరిస్థితిని సమీక్షించి కలెక్టర్లు సెలవులపై నిర్ణయం తీసుకుంటారు. వర్షాల వల్ల విద్యార్థులు ప్రమాదానికి గురయ్యే అవకాశం వుందంటే సెలవు ప్రకటిస్తారు.
అయితే తీర ప్రాంతాలు, అతిభారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో సెలవులపై స్థానిక అధికారులు నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి ఈ వర్ష ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యార్థులకు సెలవులు వచ్చే అవకాశం వుంది. ఈ సెలవుల ప్రకటన అప్పటికప్పుడే వుంటుంది.
వర్షతీవ్రత ఎక్కువగా వున్న జిల్లాల్లో విద్యార్థులు జాగ్రత్తగా వుండాలని... నీటిప్రవాహాలు దాటే ప్రయత్నం చేయరాదని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను జాగ్రత్తగా స్కూల్ చేరేలా చూడాలని విద్యాశాఖ సూచిస్తోంది.
అయితే ప్రస్తుతం క్రిస్మస్ నేపథ్యంలో డిసెంబర్ 25న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక డిసెంబర్ 24(మంగళవారం) క్రిస్మస్ ఈవ్, డిసెంబర్ 26(గురువారం) భాక్సింగ్ డే సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. ఈ మూడురోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం వుంది... కాబట్టి భారీ వర్షాలు కురిసే అవకాశం వున్న జిల్లాలోని విద్యార్థులు ఈ ఆప్షనల్ హాలిడేను ఉపయోగించుకోవచ్చు.