
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లకు భారీగా డిమాండ్ ఉంటోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. అందుబాటులో ఉన్న కోటాతో పోలిస్తే టికెట్ల కోసం ప్రయత్నించే వారి సంఖ్య దాదాపు 9 రెట్లు అధికంగా ఉంటుందని వివరించింది. ఒక బుకింగ్ సమయంలో సుమారు 6 లక్షల మంది యూజర్లు టికెట్ల కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఒక్కో యూజర్ తనతో పాటు సగటున నలుగురు కుటుంబ సభ్యుల కోసం టికెట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తే మొత్తం డిమాండ్ సుమారు 24 లక్షల టికెట్ల వరకు ఉండొచ్చని టీటీడీ అంచనా వేసింది. అయితే ఆ సమయంలో అందుబాటులో ఉండే కోటా సుమారు 2.69 లక్షల టికెట్లు మాత్రమే. దీంతో ఒకే స్లాట్ కోసం వేలాది మంది ఒకేసారి ప్రయత్నిస్తుండటంతో టికెట్లు కొద్ది సమయంలోనే పూర్తవుతున్నాయని తెలిపింది.
బుకింగ్ సమయంలో టికెట్ లభించకపోవడాన్ని, వెబ్‌సైట్ లేదా బుకింగ్ వ్యవస్థ పనిచేయకపోవడాన్ని ఒకే అంశంగా చూడకూడదని టీటీడీ స్పష్టం చేసింది. భారీ డిమాండ్ ఉన్నప్పుడు అందరికీ టికెట్ కేటాయించడం సాధ్యం కాదని పేర్కొంది. ఉదాహరణకు ఒక నిర్దిష్ట సమయానికి పరిమిత సంఖ్యలో టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటే, వాటి కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఒకేసారి ప్రయత్నిస్తారు. కోటా పూర్తయిన వెంటనే తదుపరి ప్రయత్నాలకు టికెట్లు అందుబాటులో ఉండవు. అలాంటి సందర్భాల్లో ‘స్లాట్ అనవలేబుల్’ వంటి సందేశాలు కనిపించవచ్చని టీటీడీ వివరించింది. ఈ సందేశం కనిపించిందనే కారణంతోనే సాంకేతిక వైఫల్యం జరిగిందని నిర్ధారణకు రావడం సరికాదని తెలిపింది.
బుకింగ్ ప్రారంభమైన సమయంలో ఒకేసారి భారీ సంఖ్యలో రిక్వెస్టులు సర్వర్లను చేరుతాయి. ఈ పరిస్థితిలో బ్యాక్డ్ సిస్టమ్‌పై అనవసరమైన ఒత్తిడి పడకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు టీటీడీ వర్చువల్ క్యూ విధానాన్ని ఉపయోగిస్తోంది. ఇది భక్తులకు టికెట్లు ఇవ్వకుండా అడ్డుకునే విధానం కాదని టీటీడీ స్పష్టం చేసింది. ఒకేసారి వచ్చే భారీ సంఖ్యలో అభ్యర్థనలను నియంత్రించి మొత్తం ఆన్‌లైన్ వ్యవస్థ స్థిరంగా పనిచేసేలా చేయడమే దీని ఉద్దేశమని తెలిపింది. టికెట్లకు డిమాండ్ అత్యధికంగా ఉన్నప్పుడు ప్రతి బుకింగ్ ప్రయత్నం విజయవంతం కావడం సాధ్యం కాదని పేర్కొంది.
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో చెల్లింపు ప్రక్రియ టీటీడీ అప్లికేషన్‌తో మాత్రమే పరిమితం కాదని అధికారులు వివరించారు. పేమెంట్ గేట్‌వేస్, బ్యాంకింగ్ నెట్‌వర్క్, UPI వ్యవస్థలు వంటి పలు బాహ్య సాంకేతిక వ్యవస్థలపై కూడా లావాదేవీలు ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఏదైనా చెల్లింపు విఫలమైనప్పుడు సమస్య టీటీడీ వ్యవస్థలోనే ఏర్పడిందని వెంటనే నిర్ణయించలేమని తెలిపింది. ట్రాన్సాక్షన్ ఏ దశలో విఫలమైందో పరిశీలించిన తర్వాతే కారణాన్ని గుర్తించాల్సి ఉంటుందని వివరించింది. టికెట్ల విడుదల సమయంలో ప్రత్యేక టెక్నికల్ వార్ రూమ్‌ను ఏర్పాటు చేసి అప్లికేషన్ పర్ఫ్మామెన్స్, ఇన్‌ఫ్రాస్క్రక్చర్ హెల్త్, ట్రాన్సాక్షన్స్, సెక్యూరిటీ తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. సమస్యలు గుర్తించిన వెంటనే సాంకేతిక బృందాలు స్పందించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.
భక్తుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలో పలు మార్పులు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. అప్లికేషన్, డేటాబేట్ పర్ఫామెన్స్, హైలోడ్ హాండ్లింగ్, సెక్యూరిటీ, యాంటీ బోట్ మెకానిజన్, పేమెంట్ ప్రాసెస్ వంటి విభాగాల్లో సాంకేతిక సామర్థ్యాన్ని పెంచే చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. గత బుకింగ్‌లలో నమోదైన ట్రాఫిక్ పట్రన్స్‌ను పరిశీలించి, భవిష్యత్తులో వచ్చే డిమాండ్‌ను అంచనా వేస్తూ కెపాసిటీ ప్లానింగ్, ఇన్‌ఫ్రాస్క్రక్చర్ స్కేలింగ్‌పై కూడా దృష్టి పెడుతున్నట్లు తెలిపింది. పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వంటి ఆలయాల దర్శనాలు, సేవల కోటాలను కూడా ఇదే ఆన్‌లైన్ విధానంలో విడుదల చేస్తున్నామని వివరించింది. అక్కడ డిమాండ్ తక్కువగా ఉండటంతో బుకింగ్ ప్రక్రియ సాధారణంగా సాగుతోందని తెలిపింది.
భారీ డిమాండ్ ఉన్న సమయంలో ఒకే ప్రయత్నంలో టికెట్ దక్కకపోవడం సహజమేనని, దానిని మాత్రమే ఆధారంగా చేసుకుని ఆన్‌లైన్ వ్యవస్థలో లోపం ఉందని భావించవద్దని టీటీడీ భక్తులను కోరింది. టికెట్ల బుకింగ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమవుతోన్న నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది.