Janasena Party : పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్.. జనసేనలోకి వైసిపి సీనియర్లు, వంగవీటి రాధ సంగతేంటి?

Published : Sep 26, 2026, 11:22 AM IST

జనసేన పార్టీలోకి వైసిపి నుండి వలసలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో వంగవీటి రాధతో పవన్ కల్యాణ్ భేటీ కావడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. మరి రాధ వైసిపిని వీడి జనసేనలో చేరతారా?

PREV
13
జనసేనలోకి యనమల కృష్ణుడు

Janasena Party : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి... ముఖ్యంగా వైసిపిలోంచి జనసేనలోకి నాయకుల చేరికలు పెరుగుతున్నాయి. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఇటీవల ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జనసేనలో చేరిన విషయం తెలిసిందే... ఇప్పుడు మరికొందరు నాయకులు ఇదే పని చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైసిపి నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు గతంలో టిడిపిని వీడి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన వైసిపిని వీడి జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

యనమల కుటుంబానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది... ముఖ్యంగా తుని నియోజకవర్గంలో కృష్ణుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యనమల కృష్ణుడు జనసేనలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

23
జనసేనలోకి హిందూపురం వైసిపి నేత నవీన్ నిశ్చల్

హిందూపురం నియోజకవర్గ వైసిపి మాజీ అధ్యక్షుడు బుక్కపట్నం నవీన్ నిశ్చల్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే... తాజాగా ఈయన జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు.

ఇక ఏలూరు డీసీసీబీ మాజీ చైర్మన్ పీవీఎల్ఎస్ నరసింహరాజు కూడా జనసేన కండువా కప్పుకున్నారు. కందుకూరు, సర్వేపల్లి, కనిగిరి నియోజకవర్గాల వైసీపీ పరిశీలకుడిగా ఉన్న మన్నెమాల సుకుమార్ రెడ్డి కూడా జనసేనలో చేరారు. కాంగ్రెస్ నాయకురాలు అయితాబత్తులు సుభాషిని కూడా జనసేనలో చేరారు. వీరితో పాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన మరికొందరు వైసీపీ నాయకులు జనసేన బాట పట్టారు.

స్వయంగా జనసేనాని పవన్ కల్యాణ్ నాయకులందరికీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసిపి నుండి జనసేనలోకి వలసలు కొనసాగడం పొలిటికల్ హీట్ పెంచుతోంది... దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

33
పవన్ కల్యాణ్‌ తో వంగవీటి రాధాకృష్ణ భేటీ

మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను దివంగత నేత వంగవీటి మోహనరంగా కుమారుడు, వైసిపి నాయకులు వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.

పవన్ కల్యాణ్, వంగవీటి రాధాకృష్ణ మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహం నేపథ్యంలో ఈ సమావేశం జరిగినట్లు జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను ఇరువురూ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఇదే సమయంలో సమకాలీన రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై వారు సుదీర్ఘంగా మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇలా ఒకవైపు వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేనలో చేరుతుండగా.. మరోవైపు పవన్ కల్యాణ్‌తో పలువురు నేతల భేటీలు కొనసాగుతున్నాయి. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories