
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం అంటే భక్తులకు అపార విశ్వాసం. అలాంటి ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై అనుమానాలు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు రాజకీయంగా పెద్ద దుమారం లేపాయి. భక్తుల మనోభావాలకు తీవ్ర దెబ్బ తగలే అంశం కావడంతో ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. చివరికి ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది.
సిట్ దర్యాప్తులో నెయ్యి సరఫరా చేసే కొన్ని డెయిరీ సంస్థలపై అనుమానాలు బలపడ్డాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ, శ్రీవైష్ణవి డెయిరీ, మల్లంగా ఆగ్రో ఫుడ్స్, ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థలపై దృష్టి సారించారు. ఈ సంస్థలు నిజంగా ఆవు నెయ్యి తయారీకి అవసరమైన పాలు, వెన్న సేకరించకుండానే నెయ్యి సరఫరా చేశాయన్న ఆరోపణలు వచ్చాయి. టెండర్ల అర్హత లేకపోయినా తప్పుడు పత్రాలతో టీటీడీ టెండర్లలో పాల్గొన్నట్టు సిట్ గుర్తించింది. కొందరు అధికారులు, ప్లాంట్ తనిఖీ బృంద సభ్యులు కూడా ఈ వ్యవహారంలో పాత్ర పోషించినట్టు దర్యాప్తులో బయటపడింది.
నెయ్యి నమూనాలను గుజరాత్ రాష్ట్రం ఆనంద్‌లో ఉన్న నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (NDDB) ల్యాబ్‌కు పంపించారు. 2025 మార్చి 27న వచ్చిన రిపోర్ట్ లో కీలక విషయాలను బయటపెట్టింది. నెయ్యిలో ఉండాల్సిన బ్యూటోరిక్ యాసిడ్ స్థాయి చాలా తక్కువగా ఉండటం, కొలెస్ట్రాల్ పూర్తిగా కనిపించకపోవడం గమనించారు. దీని ఆధారంగా అసలైన నెయ్యి శాతం తక్కువగా ఉందని నిర్ధారించారు.
ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ పరీక్షల్లో బీటా సిటోస్టెరాల్ కనిపించింది. ఇది కొబ్బరినూనె, పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ వంటి వనస్పతి నూనెలు కలిసిన సూచనగా సిట్ పేర్కొంది. ల్యాబ్ విలువలు సరిపోవడానికి కొన్ని రసాయనాలు కలిపినట్టు కూడా గుర్తించారు. అయితే జంతు కొవ్వులు, చేప నూనె ఉన్నాయన్న ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టంగా తేల్చారు. హరియాణాలోని కర్నాల్ ఎన్డీఆర్ఐ ల్యాబ్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది.
సిట్ చార్జిషీట్ ప్రకారం ఈ వ్యవహారం పూర్తిగా పద్ధతి ప్రకారం నడిచిన కుట్ర. ప్రధాన నిందితులైన పోమిల్ జైన్ కుటుంబ సభ్యులు రిఫైన్డ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ ఆయిల్ లాంటి చౌక నూనెలు కొనుగోలు చేశారు. నెయ్యి వాసన రావడానికి బీటా కెరోటిన్, ఫుడ్ గ్రేడ్ యాసిడ్లు, నెయ్యి ఫ్లేవర్లు కలిపారు. ల్యాబ్ పరీక్షల్లో పట్టుబడకుండా ఉండేందుకు ఆర్ఎం విలువలను సరిచేశారు. కొంతమంది అధికారులు తనిఖీలు సరిగ్గా చేయకుండా రిపోర్టులు ఇచ్చారు. కొందరు ల్యాబ్ రిపోర్టులు నకిలీగా తయారైనట్టు కూడా సిట్ గుర్తించింది. కమీషన్ల కోసం టెండర్లు మంజూరు చేసినట్టు ఆధారాలు సేకరించింది.
సిట్ జనవరి 22న నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది చార్జిషీట్ దాఖలు చేసింది. 2019 నుంచి 2024 వరకు దాదాపు 59.7 లక్షల కిలోల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయినట్టు పేర్కొంది. దీని ద్వారా సుమారు రూ.234 కోట్ల మేర నష్టం జరిగిందని అంచనా వేసింది. ఈ కేసులో వ్యక్తులు, సంస్థలు కలిపి మొత్తం 36 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు. క్రిమినల్ కుట్ర, మోసం, నకిలీ పత్రాలు, లంచాలు, భక్తుల మతపరమైన మనోభావాలకు భంగం కలిగించే చర్యలు వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. అత్యంత కీలక విషయం ఏంటంటే… లడ్డు తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వులు లేవని సీబీఐ స్పష్టంగా తేల్చింది. అయితే వనస్పతి నూనెలు, రసాయనాలతో కల్తీ జరిగిందన్న విషయం మాత్రం దర్యాప్తులో నిర్ధారణ అయింది.
ఇక ఈ వ్యవహారంపై వైసీపీ స్పందించింది. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె, లార్డ్ వంటి జంతు కొవ్వులు ఏవీ లేవని ఈ రిపోర్టులు తేల్చిన కూటమి నేతలు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. యానిమల్ ఫ్యాట్ లేదన్న స్పష్టత ఉన్నా ప్రభుత్వం ఆ విషయాన్ని భక్తులకు చెప్పకుండా, కొత్త కమిటీ అంటూ ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయాన్ని మాత్రం చెప్పలేకపోతోంది.
ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాత్రూమ్‌లు శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనాల నుంచి తయారైన నెయ్యినే భక్తులకు అందించే ప్రసాదాల్లో వినియోగించారని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలు ఊహాగానాలు కాదని, జాతీయ పాడి అభివృద్ధి మండలి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే తాను మాట్లాడుతున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఐదేళ్ల కాలంలో కూడా అదే తరహా కల్తీ నెయ్యితోనే ప్రసాదాల పంపిణీ జరిగిందని తెలిపారు.
తిరుమలతో పాటు శ్రీశైలం ఆలయంలోనూ ఇదే విధానం కొనసాగినట్టు సమాచారం ఉందని ఆయన అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సీబీఐ, సిట్‌లు క్లీన్ చిట్ ఇచ్చాయనే ప్రచారం జరుగుతోందని, అది నిజం కాదని చంద్రబాబు అన్నారు. సిట్ రిపోర్ట్ లోనే కల్తీ జరిగిన విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఈ అంశాన్ని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా అంగీకరించినట్టు కూడా సీఎం గుర్తు చేశారు. ఇక పవిత్రమైన వేంకటేశ్వరస్వామి ప్రసాదాల విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం చేయడం అత్యంత బాధాకరమన్నారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే స్థాయికి గత పాలకులు వెళ్లారని ఆయన తీవ్రంగా విమర్శించారు.