
Tirumala Laddu Adulteration Case : భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప ఆద్మాత్మిక ప్రాంతాల్లో తిరుమల ఒకటి. తెలుగువారే కాదు దేశ విదేశాల్లోని హిందువులంతా ఏడుకొండలపై కొలవైన వెంకటేశ్వరస్వామిని కలియుగ ప్రత్యక్షదైవంగా నమ్ముతారు. అందుకే నిత్యం లక్షలాదిమంది తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు... స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఎంతో భక్తితో కళ్లకు అద్దుకుని స్వీకరిస్తారు.
అయితే భక్తుల నమ్మకంతో ఆడుకుంటూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఏకంగా శ్రీవారి లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారట... ఈ విషయాన్ని స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బైటపెట్టారు. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంలో కీలక పరిణామం చోటచేసుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇంతకాలం దర్యాప్తు చేపట్టిన సిబిఐ తాజాగా అరెస్టులను ప్రారంభించింది. నెయ్యిని కల్తీ చేసి తిరుమలకు సరఫరా చేసిన నాలుగు డెయిరీ సంస్థలకు చెందిన కీలక వ్యక్తులను సిబిఐ అరెస్ట్ చేసింది.
వివిధ రాష్ట్రాలకు చెందిన డెయిరీ సంస్థలకు తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరాతో ప్రమేయం వుందని సిబిఐ తేల్చింది. ఈ క్రమంలోనే విపిన్ గుప్తా, పోమిల్ జైన్, అపూర్వ చావడ, రాజశేఖర్ లను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇవాళ(సోమవారం) కోర్టులో హాజరుపర్చారు. వీరికి న్యాయస్థానం ఫిబ్రవరి 20 వరకు రిమాండ్ విధించింది.
తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ పాపం ఈ డెయిరీలదే :
తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరాలో తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీది ప్రధానపాత్రగా సిబిఐ గుర్తించింది. ఈ సంస్థ స్వయంగా కల్తీ నెయ్యిని తయారుచేయడంతోపాటు మరికొన్ని డెయిరీల నుండి కూడా ఇలాంటి నెయ్యినే సమకూర్చుకున్నట్లు సిబిఐ నిర్దారించింది. ఇలా తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరాలో పాలుపంచుకుంటూ ఏఆర్ డెయిరీకి కల్తీ నెయ్యిని సరఫరా చేసిన సంస్థలపై కూడా సిబిఐ చర్యలు తీసుకుంది.
తిరుమల ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిని అతి తక్కువ ధరకే సరఫరా చేస్తామని తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ టిటిడితో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే సామర్థ్యానికి మించి నెయ్యిని సరఫరా చేస్తామని ఒప్పుకుంది... ఇలా అత్యాశకు పోయిన ఏఆర్ డెయిరీ శ్రీవారి భక్తుల విశ్వాసంతో చెలగాటం ఆడింది.
తిరుమలకు స్వచ్చమైన నెయ్యిని సరఫరా చేస్తామని ఒప్పందం చేసుకుని కల్తీ నెయ్యిని సరఫరా చేయడం ప్రారంభించింది. సొంతంగా కల్తీ నెయ్యిని తయారుచేయడమే కాదు ఉత్తర ప్రదేశ్ కు చెందిన పరాగ్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ నుండి కూడా ఇలాంటి కల్తీ నెయ్యిని తీసుకుంది. ఇలా జంతువుల కొవ్వును ఉపయోగించిన కల్తీ నెయ్యిని ఏఆర్ డెయిరీ తిరుమలకు సరఫరా చేసింది.
గత వైసిపి ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యిని ఉపయోగించారని ప్రస్తుత కూటమి ప్రభుత్వం బయటపెట్టింది. ఇలా తిరుమల లడ్డు వ్యవహారం పెను దుమారం రేపింది. ఎలాంటి కల్తీ జరగలేదని వైసిపి, జరిగిందని టిడిపి, జనసేన, బిజెపి కూటమి పరస్పర మాటలయుద్దానికి దిగాయి. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సిబిఐని రంగంలోకి దింపింది.
గతేడాది నవంబర్ లో సుప్రీం కోర్టు ఆదేశాలతో సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. అప్పటినుండి విచారణ కొనసాగగా ప్రస్తుతం ఇది కీలక దశకు చేరింది. సిబిఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు గత మూడురోజులుగా తిరుమతిలోనే మకాం వేసి డెయిరీ సంస్థల ప్రతినిధులను విచారించారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరాలు వీరి ప్రమేయం వుందని నిర్దారించుకుని ఆదివారం నలుగురికి అరెస్ట్ చేసారు.
ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖర్, వైష్ణవీ డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, భోలేబాబా డెయిరీ డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్ లు అరెస్ట్ చేసినవారిలో వున్నారు. ఈ కల్తీ నెయ్య సరఫరాతో సంబంధమైన మరికొన్ని డెయిరీ సంస్థలపై కూడా చర్యలకు సిద్దమైంది సిబిఐ.
విశాఖ సీబీఐ ఎస్పీ మురళీరాంబ, విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టీ, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారి సత్యకుమార్ పాండా ఈ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు విచారణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందువల్లే వేగంగా విచారణ చేపట్టి అరెస్టులకు దిగారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం వుందనేది త్వరలోనే తేల్చనున్నట్లు సిబిఐ స్పష్టం చేసింది.
తిరుమల లడ్డూపై రాజకీయ దుమారం :
పవిత్రమైన తిరుమలను గత వైసిపి రాజకీయాల కోసం వాడుకుందని టిడిపి, జనసేన,బిజెపి కూటమి ఆరోపిస్తోంది. శ్రీవారి దర్శనం నుండి లడ్డూ ప్రసాదం తయారీ వరకు అంతా అవినీతిమయం చేసారని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే తిరుమలలో అవకతవకలపై ఆరోపణలు చేసిన కూటమి అధికారంలోకి రాగానే అక్కడినుండే ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించింది.
ఇలా తిరుమల ఆలయంపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలోనే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి గురించి బయటకు వచ్చింది. అత్యంత తక్కువ ధరకే నెయ్యి సరఫరాకు అంగీకరించడంతో ఆ సంస్థ కల్తీకి పాల్పడిందనేది కూటమి వాదన. అసలు ఏమాత్రం గిట్టుబాటుకానీ ధరకు నెయ్యిని సరఫరా చేస్తామంటే నమ్మి ఒప్పందం చేసుకున్నారు... ఆ తర్వాత కూడా ఎలాంటి నెయ్యి పంపుతున్నారో కూడా కనీసం పరిశీలించలేదని కూటమి ఆరోపిస్తోంది. ఇలా ఆనాటి ప్రభుత్వం, టిటిడి పెద్దలు కాసులకు కక్కుర్తిపడి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని కూటమి ప్రభుత్వ పెద్దలు మండిపడ్డారు.
ఇక తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని వాడిన ఘటనపై జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న ఉద్యమమే చేసారు. ఇది కేవలం శ్రీవారి భక్తులకే కాదు యావత్ హిందూ సమాజం మనోభావాలు దెబ్బతిన్నాయి... దీనికి కారణమైనవారిని వదిలిపెట్టకూడదని కేంద్రాన్ని కోరారు. అంతేకాదు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సనాతన ధర్మ బోర్డును డిమాండ్ చేసారు. అంతేకాదు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ తిరుమలలో దాన్ని ముగించారు.