శ్రీవారి భక్తులకు ఇక భయమొద్దు : తిరుమలలో కల్తీకి చెక్ పెట్టేందుకు టిటిడి మాస్టర్ ప్లాన్

First Published | Sep 21, 2024, 11:56 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని... ఇకపై లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ లేకుండా జాగ్రతలు తీసుకుంటున్నట్లు టిటిడి ఈవో శ్యామలరావు ప్రకటించారు. ఇందుకోసం టిటిడి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను ఆయన వివరించారు.

Tirumala Laddu

కలియుగ ప్రత్యక్షదైవంగా భావించి తిరుమల వెంకటేశ్వర స్వామిని కొలుస్తుంటారు భక్తులు. ఏడు కొండలపై వెలిసిన శ్రీవారి మహాప్రసాదంగా తిరుమల లడ్డూను భావిస్తుంటారు... దీన్ని ఎంతో పవిత్రంగా చూస్తారు, కళ్లకు అద్దుకుని మరీ తింటారు. అలాంటి తిరుమల లడ్డూ వైసిపి పాలనలో అపవిత్రం అయ్యిందంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యిని వాడారన్న ఆరోపణలు కేవలం శ్రీవారి భక్తులకే కాదు యావత్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది...ఇకపై ఇలాంటి అపచారం జరగకుండా జాగ్రత్తలు చేపట్టింది. ఇందుకోసం తిరుమలలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వెల్లడించారు. 
 

Tirumala Laddu

తిరుమలలో స్పెషల్ ల్యాబ్ : 

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటంపై టిటిడి ఈవో శ్యామలరావు స్పందించారు. లడ్డూతో పాటు స్వామివారికి సమర్పించే నైవేధ్యంలో వాడే అనేక వస్తువులు బయటనుండి వస్తాయి... వీటి నాణ్యతను పరిశీలించే సాంకేతిక సదుపాయం టిటిడి వద్ద లేదని తెలిపారు. దీన్ని ఆసరాగా చేసుకునే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని టిటిడి ఈవో తెలిపారు. 

అయితే తిరుమలలో కల్తీని అరికట్టేందుకు ఇకపై అత్యాధునిక సాంకేతికను ఉపయోగించనున్నట్లు ఈవో శ్యామలరావు వెల్లడించారు. ముఖ్యంగా నెయ్యి నాణ్యతను గుర్తించేందుకు రూ.75 లక్షల విలువచేసే ఆధునిక పరికరాలను నుడబ్ సంస్థ విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. ఈ పరికరాలతో నూతన ల్యాబ్ ను ఏర్పాటు చేస్తామని... ఈ ఏడాది డిసెంబర్ లో లేదంటే వచ్చే సంవత్సరం జనవరిలో దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని టిటిడి ఈవో వెల్లడించారు. 

ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తే తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరాకు అవకాశమే వుండదన్నారు. ఇలా తిరుమల లడ్డూతో పాటు స్వామివారి నైవేధ్యం పవిత్రను కాపాడే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై తిరుమలలో స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతినే వ్యవహారాలు వుండవని టిటిడి ఈవో శ్యామలరావు స్పష్టం చేసారు. 
 

Latest Videos


Tirumala Laddu

లడ్డూలో కల్తీనెయ్యి వినియోగం నిజమేనా?: ఈవో ఏమన్నారంటే 

తిరుమల తిరుపతి దేవస్ధానంలో వివిధ అవసరాలను చాలా నెయ్యిని వినియోగిస్తామని ... దీన్ని ఐదు సంస్థలు సరఫరా చేస్తాయని ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, కృపరామ్ డైరీ, వైష్ణవి, శ్రీ పరాగ్ మిల్క్, ఏఆర్ డెయిరీ... ఇవే ఆ ఐదు సంస్థలు. వీరు రూ. 320 నుండి రూ. 411 మధ్య ధరలతో నెయ్యిని సరఫరా చేస్తున్నారని ఈవో తెలిపారు. 

అయితే ఇటీవల టిటిడి ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయాలని  సరఫరాదారులందరిని కోరినట్లు శ్యామలరావు తెలిపారు. మీరు  పంపించే నెయ్యిని పరీక్షిస్తామని... నమూనాలను ల్యాబ్‌లకు పంపించి నాణ్యతను పరిశీలిస్తామని సూచించామని అన్నారు. ఒకవేళ టెస్టుల్లో అది కల్తీ నెయ్యి అని తేలితే బ్లాక్‌లిస్ట్ చేయడమే కాదు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు శ్యామలరావు తెలిపారు.

ఇలా గట్టిగా హెచ్చరించిన తర్వాత కూడా ఏఆర్ ఫుడ్స్ పంపిన 4 ట్యాంకర్ల నెయ్యి నాణ్యత లేనిదిగా ప్రాథమికంగా గుర్తించినట్లు ఆయన తెలిపారు.
ప్రఖ్యాత ఎన్డిడిబి సిఏఎల్ఎఫ్ (NDDB CALF) టెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ నెయ్యి నాణ్యత ప్రమాణాలు నిర్దేశించిన పరిమాణంలో లేదని నిర్ధారణ అయిందని తెలిపారు. ఇందులో సోయా బీన్, పొద్దుతిరుగుడు పదార్థాలు, పంది, బీఫ్ కొవ్వు వంటివి గుర్తించినట్లు చెప్పారు. 

స్వచ్ఛమైన పాల కొవ్వుకు ఆమోదయోగ్యమైన ఏస్-విలువ 98.05 నుండి 104.32 మధ్య ఉంటుంది. అయితే పరీక్షించిన నమూనా 23.22 మరియు 116 తో గణనీయ వ్యత్యాసాలను  చూపిందన్నారు. ఈ నమూనాలు వెజిటబుల్ ఆయిల్ కల్తీని కూడా సూచించాయని ఈవో శ్యామలరావు వెల్లడించారు. 
 

Tirumala Laddu

తాత్కాలికంగా గో ఆధారిత ముడి సరుకుల రద్దు

భక్తుల అభిప్రాయాల  మేరకు తిరుమల ఆలయంలో  శ్రీవారి నైవేద్య అన్నప్రసాదాలలో వినియోగించే  గో ఆధారిత ముడి సరుకులైన నెయ్యి, బెల్లం, బియ్యాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు టిటిడి ఈఓ తెలిపారు. ఒక నిపుణుల కమిటీని త్వరలో ఏర్పాటు చేసి వారు అందించే నివేదిక మేరకు ఈ ముడి సరుకులను శ్రీవారి నైవేద్య ప్రసాదంలో వినియోగించాలా లేదా పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
 

Tirumala Laddu

ప్రస్తుతం స్వచ్చమైన నెయ్యినే టిటిడి వినియోగిస్తోంది

స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో  శ్యామలరావు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తిభావంతో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు... వారు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం నాణ్యతను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాబట్టి లడ్డూ ప్రసాదంలో నాణ్యత, రుచి ఉండేలా చూస్తున్నామన్నారు. లడ్డూ పవిత్రతను పునరుద్ధరించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ఆదేశాలను పాటిస్తున్నామని అన్నారు. 

నూతనంగా టీటీడీ పరిపాలన బాధ్యతలు  స్వీకరించినప్పటి నుండి లడ్డూల నాణ్యత, రుచిని మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రారంభించినట్లు శ్యామలరావు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా లడ్డూల నాణ్యత తక్కువగా ఉందని భక్తుల నుండి అభిప్రాయాన్ని స్వీకరించిన తరువాత పోటు కార్మికులతో (లడ్డూ తయారీదారులు) మాట్లాడానని... అనుమానం వచ్చి మొదటిసారిగా నెయ్యి శాంపుల్స్ ను పరీక్ష కోసం బయటి ల్యాబ్‌కు టీటీడీ పంపిందన్నారు. ఈ క్రమంలోనే కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడిందని ఈవో శ్యామలరావు తెలిపారు. 
 

click me!