
Tirumala : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే తిరుమల వెంకటేశ్వరస్వామి ఒక్కసారైనా దర్శించుకుని తరించాలని హిందువులు కోరుకుంటారు. ఆ స్వామి వెలిసిన ఏడుకొండలపైకి కాలినడకన చేరుకుని దర్శించుకోవాలని మరికొందరి కోరిక... కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. వందలాది మెట్లు, కిలోమీటర్ల దూరం, ఏటవాలుగా కొండపైకి ఎక్కాల్సిన పరిస్థితి... కాబట్టి ఏడుకొండలపైకి నడుచుకుంటూ వెళ్లడం అంత సులభం కాదు. మరీముఖ్యంగా వయసు మీదపడిన వృద్దులు చాలా ఇబ్బందిపడతారు... కానీ స్వామివారిపై అచెంచలమైన భక్తి ఉంటే వయసుతో సంబంధం లేదని నిరూపించాడో 70 ఏళ్ల భక్తుడు. ఒకటి రెండు కాదు ఏకంగా 2600 సార్లు ఏడుకొండలపైకి కాలినడకన వెళ్లడమే కాదు తిరిగి కిందకు కూడా నడుచుకుంటూనే వచ్చారు. ఇలా భక్తితోనే కాదు ఈ వయసులో కూడా ఫిట్ నెస్ తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
విజయవాడకు చెందిన వెంకట రమణమూర్తి ఉద్యోగ నిమిత్తం తిరుపతిలో స్థిరపడిపోయారు. ఇలా అనుకోకుండా తిరుపతికి చేరిన అతడు తిరుమల వెంకటేశ్వరస్వామికి పరమ భక్తుడిగా మారిపోయారు. ఓవైపు ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు శ్రీవారిని సేవలో మునిగిపోయేవారు. ఇలా గత 14 ఏళ్లుగా రమణమూర్తి తరచూ తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించుకుంటున్నారు.
అయితే రమణమూర్తి ఇద్దరు కూతుళ్లు విదేశాల్లో సెటిల్ అయ్యారు... ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరే తిరుపతిలో ఉంటున్నారు. అంతేకాదు ఆయన పదవీ విరమణ కూడా పొందారు. దీంతో రమణమూర్తి తిరుమల ప్రయాణం మరింత పెరిగింది. ఇలా ఇప్పటివరకు అతడు శ్రీవారిని 3350 సార్లు దర్శించుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే రమణమూర్తి తిరుమల ఏడుకొండలపైకి వెళ్లడానికి ఒక్కసారి కూడా వాహనం ఎక్కలేదట... ఏకంగా 2600 సార్లు కాలినడకనే చేరుకున్నారట. ఇలా 70 ఏళ్ల వయసులోనూ వెంకట రమణమూర్తి ఇంకా శ్రీవారి దర్శనంకోసం నడమార్గాన్నే వాడుతున్నారు.
తిరుమల ఏడుకొండలపైకి నడుచుకుంటూ వెళితే స్వామికార్యం సకార్యం రెండూ పూర్తవుతాయని రమణమూర్తి చెబుతున్నారు. అంటే స్వామిని దర్శించుకోవడం ద్వారా ఆనందానికి ఆనందం... కొండపైకి ఎక్కిదిగడం ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ ఆయన అసలునిజం చెప్పారు. తనది తిరుపతే కాబట్టి పెద్దగా ఖర్చేమీ ఉండదు… 50-60 రూపాయల్లో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శించుకోవడమే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నానని తెలిపారు. ఇలా తనకు డబ్బులు కూడా ఆదా అని రమణమూర్తి చెబుతున్నారు.
కేవలం కాలినడకన కొండపైకి చేరుకోవడమే కాదు అప్పుడప్పుడు అంగప్రదక్షిణలు కూడా చేస్తానని రమణమూర్తి చెబుతున్నారు. అలాగే ప్రతిసారి క్యూలైన్ లో నిలబడి రెండుమూడుసార్లు స్వామివారిని దర్శించుకుంటానని... దీనివల్ల శారీరక శ్రమ పెరిగి ఆరోగ్య సమస్యలు ఉండవని చెబుతున్నారు. ఇలా తన భక్తిని చాటుకోవడమే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నారు రమణమూర్తి.
ఇంటివద్దకే అన్నీ కావాలుకునే నేటితరం యువత ఈ పెద్దాయన రమణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంట్లోంచి కాలు బైటపెట్టకుండా తినే ఆహారం దగ్గర్నుండి షాపింగ్ వరకు అన్నీ ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసే ఈ కలికాలంలో రమణమూర్తిలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. భక్తిని ఆరోగ్యంతో ముడిపెట్టిన ఆయన ఆలోచనను ప్రశంసించకుండా ఉండలేం. ఈ వయసులోనే ఆయన ఇంత ఆరోగ్యంగా తిరుమల కొండను అలవోకగా ఎక్కి దిగుతున్నారంటే ఆయన ఎంత ఫిట్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ముందునుండే ఆరోగ్యాన్ని కాపాడుకుంటే వయసు మీదపడ్డాక కూడా అనారోగ్య సమస్యలు ఉండవని నిరూపిస్తున్నారు రమణమూర్తి.
అయితే అందరికీ తనలా నిత్యం తిరుమలకు వచ్చే అవకాశం ఉండదు... కాబట్టి భక్తితో ఒక్కసారి వచ్చినా స్వామి ఆశిస్సులు పొందవచ్చని చెబుతున్నారు రమణమూర్తి. అచెంచలమైన భక్తితో తిరుమలకు వచ్చేవారు ఆ శ్రీవారినే తమవెంట తీసుకెళ్ళగలని అంటున్నారు. స్వామిని నమ్ముకుంటే అంతా మంచే జరుగుతుందని రమణమూర్తి ఆరోగ్య, ఆధ్యాత్మిక సూత్రాలు చెబుతున్నారు.