భారతదేశంలో టెంపుల్ ఎకానమీ ఎంతో తెలుసా?
ఆద్యాత్మికత రంగం కేవలం దైవభక్తికే పరిమితం కాలేదు... దేశ ఆర్థిక వ్యవస్థలోనూ భాగమై అభివృద్దికి బాటలు వేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భారతదేశంలో కేవలం ఆలయ ఆర్థికవ్యవస్థ రూ.6 లక్షల కోట్లు ఉంటుందని తెలిపారు. అంటే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ బడ్జెట్ కలిపినా ఈ టెంపుల్ ఎకానమీ ఎక్కువగా ఉంటుందన్నమాట.
దేశంలో మరే ఆర్థిక కార్యకలాపాలకు తీసిపోకుండా టెంపుల్ ఎకానమీ ఉందని చంద్రబాబు అన్నారు. దేవాలయాలు, ఆ చుట్టుపక్కల చాలా ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయని ... ఇది 365 రోజులు జరిగే ప్రక్రియ అని అన్నారు. అంటే ఏడాదిపొడవునా విరామం అన్నదే లేకుండా ఆలయాల ఆర్థిక వ్యవస్థ సాగుతుంది... ఇందులో మనందరం భాగస్వాములమేనని చంద్రబాబు తెలిపారు.
దేవాలయాలకు భక్తులు విరాళాలు కూడా అందిస్తుంటారు... వాటిని ఎందుకోసమైతే ఇచ్చారో వాటికే ఖర్చుచేయాలని చంద్రబాబు అన్నారు. భక్తుల విరాళాల ఖర్చు విషయంలో పారదర్శకత ఉండాలని... అప్పుడే మరింతమంది విరాళాలు ఇచ్చి ఆలయ ఆర్థికవ్యవస్థలో పాల్గొంటారని అన్నారు. నిరుపేదల శ్రేయస్సు, దేవాలయాల అభివృద్ది, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు దాతల విరాళాలను ఉపయోగించుకుంటున్నామని చంద్రబాబు స్పష్టం చేసారు.