అమరావతి: జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పడినుండి అమరావతిపై ఒకింత సందిగ్దత నెలకొంది. అమరావతి విషయంలో కొన్ని రోజులకింద మునిసిపల్ శాఖా మంత్రి బొత్స మాటలతో, విజయసాయి రెడ్డి ట్వీట్ తో అసలు జగన్ ఎం చేయబోతున్నాడు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాజధానిని మారుస్తున్నారా అనే ప్రశ్నకు ఇప్పటివరకు ముఖ్యమంత్రి కానీ వారి కార్యాలయం కానీ స్పందించలేదు.
4 capital cities in andra pradesh
ఇదే సమయంలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న మరో వార్త అమరావతిపై నెలకొన్న సందిగ్దతను మరింత సంక్లిష్టం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని వెలగపూడి నుండి తరలిస్తున్నారనే వార్త జోరుగా ప్రచారంలో ఉంది. ఈ వార్త గుప్పుమనగానే అమరావతిపై మరిన్ని అనుమానాలకు తెర తీసినట్టయ్యింది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక కార్యకలాపాలను వెలగపూడి నుంచే సాగించేవారు. జగన్ అధికారంలోకి వచినప్పటినుండి తాడేపల్లి లోని తన నివాసమైన సీఎం క్యాంపు ఆఫీస్ నుంచే పాలన సాగిస్తున్నారు. బహుశా తన మిత్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆదర్శంగా తీసుకున్నారు కాబోలు.
సెక్రటేరియట్ దూరమవుతుంది కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం సెక్రటేరియట్ ను మార్చాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో అధికారులు పేర్కొన్నట్టు సమాచారం. ప్రస్తుత వెలగపూడి సచివాలయం విజయవాడ నుండి 18 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు నుంచి 25, మంగళగిరి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సెక్రటేరియట్ లో పనిచేసే అధికారులు, సిబ్బందిలో చాల మంది ఈ మూడు పట్టణాల్లోనే నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో అందరికి అనుకూలమైన ప్రాంతానికి సచివాలయాన్ని మారిస్తే ప్రయాణ దూరాన్ని తగ్గించి విలువైన సమయాన్ని పరిపాలన మీద వెచించొచ్చనేది ఈ నివేదిక అభిప్రాయం.
ఈ విషయమై సచివాలయాన్ని దాని అనుబంధ శాఖలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్, మంగళగిరి, తాడేపల్లిలకు మార్చాలని ఈ నివేదికలో అధికారులు పేర్కొన్నట్టు సమాచారం. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాలను నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో నిర్వహించేందుకు దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కృషి చేసినప్పటికీ అది ఆచరణలోకి రాలేదు.
మంగళగిరి, తాడేపల్లి చుట్టుపక్కల గ్రామాలను కలిపి వాటిని అభివృద్ధి చేయాలని కూడా వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా, గుంటూరు, గొల్లపూడి, విజయవాడలో ఉన్న ప్రభుత్వ శాఖల కార్యాలయాలను తాడేపల్లికి మార్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయాలన్నింటినీవు కలిపి చూస్తే రాజధాని మార్పు కోసం చేపడుతున్న చర్యలుగా గోచరించక మానవు.
ఈ రాజధాని మార్పుపై వస్తున్న వార్తలతో అధికార వైసీపీపై విపక్షాలు దాడిని ముమ్మరం చేసాయి. రాజధాని వస్తున్న వార్తలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని వారు డిమాండ్ చేసారు. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఈ వ్యాఖ్యలను ఖండించిన విషయం మనకు తెలిసిందే. రాజధాని ప్రాంతంలో పర్యటించి, అక్కడి రైతులతో భేటీలు, సమావేశాలు నిర్వహించారు. రాజధాని ప్రాంతాన్ని తరలించాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు మాట్లాడుతూ, ఇలాంటి రాజధాని మార్పు పుకార్ల వల్ల ఇప్పటికే రాజధాని, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల రేట్లు పడిపోయాయని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యిందని విరుచుకుపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగం పడకేయడంతో రాష్ట్ర ఖజానాకు పెద్ద చిల్లు పడినట్టయ్యిందని ఆయన అభిప్రాయపడ్డారు.