
Smart Ration Cards : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేద, మద్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు అందించే పౌరసరఫరా శాఖలో పారదర్శకతను పెంచే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా రేషన్ షాపుల నుండి ప్రజలకు నిత్యావసర సరుకులు చేరే సమయంలో ఎలాంటి అవకతవకలు జరక్కుండా ఉండేలా జాగ్రత్త పడుతోంది కూటమి ప్రభుత్వం. ఇందుకోసమే ఇప్పుడున్న సాధారణ రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకువస్తోంది.
ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులపై కసరత్తు చేసిన ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా క్యూఆర్ కోడ్ తో కూడిన కార్డులను జారీచేయాలని నిర్ణయించింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులను తయారీ ప్రక్రియ కొనసాగుతోందని... ఆగస్ట్ 25 నుండి ప్రజలకు పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని... నియోజకవర్గ స్థాయిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తారని తెలిపారు.
కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఈ స్మార్ట్ కార్డులను అందించనున్నారు. అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు, కుటుంబసభ్యులను చేర్చడం లేదా తొలగించడం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి కూడా కొత్తగా స్మార్ట్ కార్డులు అందించనున్నారు. ఇలా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా 15 లక్షలవరకు పరిశీలన పూర్తయినట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. ఇందులో 9,87,644 లక్షల కుటుంబాలకు త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి వెల్లడించారు.
అయితే మీరు కూడా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా? వచ్చే నెల ఆగస్ట్ లో స్మార్ట్ కార్డ్ వస్తుందా లేదా అన్న డౌట్ ఉందా? అయితే మీ అప్లికేషన్ స్టేటస్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకొండి. ఇందుకోసం ఏపీ సేవా పోర్టల్ https://vswsonline.ap.gov.in/#/home ను సందర్శించండి. ఇది ఓపెన్ చేయగానే 'Service Request Status Check' సెర్చ్ లింక్ కనిపిస్తుంది... ఇందులో మీ రేషన్ కార్డు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇలా మీ కార్డు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
మీ రేషన్ కార్డు దరఖాస్తు ఆమోదం పొందితే త్వరలోనే స్మార్ట్ కార్డు జారీ చేస్తారు... లేదంటే దరఖాస్తు ఎక్కడ పెండింగ్ లో ఉందో తెలుస్తుంది. కాబట్టి మరోసారి సంబందిత అధికారులను కలిసి ఎందుకిలా పెండింగ్ లో ఉందో తెలుసుకోవచ్చు. వారి సూచనలు పాటించి దరఖాస్తు ఆమోదం పొందేలా చేసుకుని స్మార్ట్ రేషన్ కార్డులను పొందవచ్చు.
గతంలో రేషన్ కార్డులపై ముఖ్యమంత్రులు, ఇతర నాయకుల ఫోటోలు ఉండేవి. కానీ స్మార్ట్ రేషన్ కార్డులపై ఎవరి ఫోటోలు ఉండవని... కేవలం కుటుంబసభ్యుల వివరాలు మాత్రమే ఉంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇంటి యజమాని ఫోటో, క్యూఆర్ కోడ్, కుటుంబసభ్యుల వివరాలు మాత్రమే రేషన్ కార్డుపై ఉంటాయని తెలిపారు. డెబిట్, క్రెడిట్ కార్డుల తరహాలో పర్సులో పెట్టుకుని ఈజీగా క్యారీ చేసేలా స్మార్ట్ రేషన్ కార్డులను డిజైన్ చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
1. డిజిటల్ రేషన్ కార్డులను ఎక్కడైనా వినియోగించవచ్చు. అంటే స్వస్థలాలకు దూరంగా ఉండేవారు ఈజీగా రేషన్ సరుకులు పొందవచ్చు. వీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారో ఏపీ పౌరసరఫరా శాఖకు సమాచారం అందుతుంది.
2. మోసాల నుండి రక్షణ :
స్మార్ట్ రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. కాబట్టి ఇది మోసాలను నివారిస్తుంది.
3. వేగవంతమైన పంపిణీ :
నెల ఆరంభంలో రేషన్ షాపుల వద్ద రద్దీ ఎక్కువగా ఉండటం చూస్తుంటాం. అయితే ఈ స్మార్ట్ కార్డులను ఈజీగా వివరాలను నమోదు చేయవచ్చు... కాబట్టి సరుకుల పంపిణీ వేగంగా జరుగుతుంది… రద్దీ తగ్గుతుంది.
4. పారదర్శకత :
ప్రజలకు చేరాల్సిన రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా ఈ స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయి. అంటే ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత మరింత పెరుగుతుంది.
5. అధికారిక గుర్తింపు :
ప్రస్తుతం రేషన్ కార్డులను ప్రజలు అధికారిక గుర్తింపుగా ఉపయోగిస్తుంటారు. ఈ స్మార్ట్ కార్డులు పర్సులో పెట్టుకుని క్యారీ చేసేలా ఉంటాయి... కాబట్టి అత్యవసరంగా గుర్తింపు కార్డు కావాల్సి వచ్చినప్పుడు ఉపయోగించవచ్చు.
పౌరసరఫరా శాఖమంత్రి నాదెండ్ల మనోహన్ ప్రెస్ మీట్ వీడియో