విజయవాడ : తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు జనావాసాలనే కాదు పంటలను ముంచుతోంది. ముఖ్యంగా గోదావరి నది ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇలా గోదావరి వరదల్లో నష్టపోయిన ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలుగురాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఏపీలోని పోలవరం ముంపు గ్రామాలతో పాటు తెలంగాణలో భద్రాచలం ప్రాంతంలో వరద ముంపు గ్రామాల్లో నేడు (గురువారం) చంద్రబాబు పర్యటించనున్నారు. ఇందుకోసం బయలుదేరిన ఆయనకు విజయవాడ, ఇబ్రహీంపట్నంలో టిడిపి శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు చంద్రబాబు కోసం రోడ్డుపైకి వచ్చి ఆయన కాన్వాయ్ పై పూలుచల్లి అభిమానాన్ని చాటుకున్నారు.