School Holidays : ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి పండక్కి తొమ్మిది రోజుల సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కానీ నిజానికి ఆరురోజులు మాత్రమే స్పెషల్ హాలిడేస్ ఇస్తోంది. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాాం.
Sankranti Holidays : తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండగ సంక్రాంతి. ఈ పండక్కి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలన్ని ఖాళీ అయిపోతాయి. ఉద్యోగాలు, ఉపాది కోసం ఎక్కడెక్కడో స్థిరపడిన ప్రతిఒక్కరూ స్వస్థలాలకు చేరుకుంటారు.. దీంతో గ్రామాలు కళకళలాడతాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండగ చాలా ప్రత్యేకం... రంగురంగుల ముగ్గులతో అమ్మాయిలు... గాలిపటాలు ఎగరేస్తూ అబ్బాయిలు.. పిండివంటలతో మహిళలు... కోడిపందేలతో పురుషులు... హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, భోగిమంటలు, బొమ్మల కొలువులు... ఆహా ఇక్కడ సంక్రాంతి వైభవం మామూలుగా ఉండదు.
అందుకే ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యాసంస్థలకు సంక్రాంతికి భారీగా సెలవులు ఇస్తారు. ఎప్పటిలాగే ఈసారి కూడా సంక్రాంతికి వారంరోజులకు పైగానే సెలవులు ఇచ్చింది ప్రభుత్వం... కానీ ఇందులో సాధారణ సెలవులు కూడా ఉన్నాయి... ప్రభుత్వం పండగకోసం ప్రత్యేకంగా ఇచ్చింది కేవలం 6 రోజుల సెలవులు మాత్రమే. సంక్రాంతికి ఇంత తక్కువ సెలవులా..! అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు.
25
సంక్రాంతి సెలవులు ఎప్పట్నుంచో తెలుసా?
ఈ డిసెంబర్ ముగియగానే కొత్త సంవత్సరం 2026 లోకి అడుగుపెడతాం... దీంతో సంక్రాంతి సందడి మొదలవుతుంది. ఊళ్లకు వెళ్లేవారు టికెట్ బుకింగ్స్, పండగ షాపింగ్, సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేయాలనే ప్లానింగ్... ఇలా 2026 జనవరి ఫస్ట్ వీక్ మొత్తం సందడి ఉంటుంది. ఇక సెకండ్ వీక్ లో విద్యాసంస్థలకు సెలవులు ప్రారంభం అవుతాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో జనవరి 10 నుండి 18 వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కేవలం ప్రభుత్వ విద్యాసంస్థలకే కాదు ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. జనవరి 9న సాయంత్రం స్కూల్స్ తలుపులు మూసుకుంటే తిరిగి జనవరి 19న ఉదయం తెరుచుకుంటాయి. ఇలా సంక్రాంతికి మొత్తం తొమ్మిది రోజుల సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
35
సంక్రాంతికి ప్రత్యేకంగా సెలవులు ఇచ్చింది ఆరురోజులే..?
ఈ సంక్రాంతికి మొత్తం తొమ్మిదిరోజుల సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది... కానీ నిజానికి ఇచ్చింది ఆరురోజులే. ఓ మూడురోజులు సాధారణ సెలవులున్నాయి... వీటిని కూడా సంక్రాంతి సెలవులుగానే పేర్కొనడంతో సెలవుల సంఖ్య 9కి చేరింది.
జనవరి 10న రెండో శనివారం... కాబట్టి సంక్రాంతి సెలవు లేకున్నా సాధారణ సెలవు ఉంటుంది. తర్వాత ఆదివారం (జనవరి 11) కూడా సాధారణ సెలవే. అంటే అసలు సంక్రాంతి సెలవులు జనవరి 12 నుండి ప్రారంభం అవుతాయి. ఈ వారమంతా సెలవులు కొనసాగుతాయి.
ఇక సంక్రాంతి సెలవులు ముగిసే జనవరి 18 కూడా ఆదివారమే... ఈరోజు పండగ సెలవు లేకున్నా సాధారణ సెలవు ఉంటుంది. ఇలా సంక్రాంతి సెలవుల్లో మూడ్రోజులు సాధారణ సెలవులే ఉన్నాయి... ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చింది కేవలం ఆరురోజులు మాత్రమే. ఇందులో మూడురోజులు పండగ (జనవరి 14,15,16) సెలవులు... అదనంగా ఇచ్చింది కేవలం మూడ్రోజులు మాత్రమే.
గత సంవత్సరం కూడా ఇలాగే సంక్రాంతికి జనవరి 10 నుండి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. కానీ చివర్లో ఈ సెలవులను మరో మూడ్రోజులు పొడిగించారు. దీంతో మొత్తం 12 రోజుల సెలవులు వచ్చాయి... జనవరి 10 నుండి 21 వరకు సెలవులు ఉండగా జనవరి 22న తిరిగి స్కూళ్లు ప్రారంభంఅయ్యాయి.
ఈసారి కూడా ఇలా సంక్రాంతి సెలవుల పొడిగింపు ఏమైనా ఉంటుందా..? లేక ఈ సెలవులతోనే సరిపెట్టుకోవాలా? అన్న డైలమా విద్యార్థుల్లోనే కాదు వారి పేరెంట్స్ లో ఉంది. ఏడాదికి ఒకసారి సొంతూళ్లకు వెళతాం... కాబట్టి ఎక్కువరోజులు సెలవుంటే పండగను ప్రశాంతంగా జరుపుకుంటామని... లేదంటే హడావిడిగా పూర్తిచేసుకుని తిరుగుపయనం కావాల్సి ఉంటుందని వాపోతున్నారు.
55
తెలంగాణలో సంక్రాంతి సెలవులు..?
తెలంగాణలో సాధారణంగా సంక్రాంతికి తక్కువగానే సెలవులు ఉంటాయి. గత సంవత్సరం జనవరి 12 నుండి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు.. ఈసారి కూడా అలాగే సెలవులు ఇచ్చే అవకాశాలున్నాయి.
అయితే జనవరి 10 రెండో శనివారం, జనవరి 10 ఆదివారం, జనవరి 18 సెలవులు కలిసివచ్చే అవకాశాలున్నాయి. దీంతో తెలంగాణ స్కూల్స్ కి కూడా ఏపీతో సమానంగా 9 రోజులు సంక్రాంతి సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. అయితే తెలంగాణలో సంక్రాంతి సెలవులపై విద్యాశాఖ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.