Rain Alert : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు వర్షాలతో కాదు పిడుగులతో ప్రమాదం పొంచివుందని వాతావరణ విభాగాలు హెచ్చరిస్తున్నాయి. గురువారం కూడా పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించాయి.
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి... కొన్నిప్రాంతాలకు మాత్రమే వానలు పరిమితం అవుతున్నాయి. ఇలా తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తుండగా మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటోంది. దీంతో నదులు, వాగులు వంకలు శాంతించాయి... జలాశయాల గేట్లు మూసేస్తున్నారు... చెరువులు, కుంటలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. మొత్తంగా ప్రస్తుతం వరదల ప్రమాదమయితే తప్పింది... రైతులు ప్రశాంతంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
25
ద్రోణి ఎఫెక్ట్
ప్రస్తుతానికి బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలేవీ లేవు... కాబట్టి భారీ వర్షసూచనలేమీ లేనట్లే. అయితే చత్తీస్ గడ్ నుండి గల్ఫ్ మన్నార్ వరకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మీదుగా ఓ ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
35
నేడు ఈ జిల్లాలకు పిడుగుల ప్రమాదం
ఇవాళ (అక్టోబర్ 09, గురువారం) ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఇలాగే పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ప్రస్తుతం భారీ వర్షాలు లేకున్నా బలమైన ఈదురుగాలులు, పిడుగులు ప్రమాదాలను సృష్టించవచ్చు... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది. మరీముఖ్యంగా వ్యవసాయ పనులకోసం పొలాలవద్ద ఉండే రైతులు, కూలీలు వర్ష సమయంలో చెట్లకిందకు చేరుకోవద్దని… పశువులు, ఇతర మూగజీవాలను కూడా చెట్లకింద ఉంచరాదని సూచిస్తోంది. ఎందుకంటే పిడుగులు ఎక్కువగా చెట్లపైనే పడే ఆస్కారం ఉంటుందని విపత్తు సంస్థ తెలిపింది. అంతేకాదు ఈదురుగాలుల కారణంగా చెట్ల కొమ్మలు విరిగిపడటం, ఒక్కోసారి చెట్టు మొత్తం కూలిపోవడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని తెలిపింది.
55
తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు
ఇక తెలంగాణ విషయానికి వస్తే... రాష్ట్రంలో చెదురుమదురు జల్లులు మినహా భారీ వర్షసూచనలేమీ లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ(గురువారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు (గంటకు 30-40 కి.మీ వేగంతో) తోడవుతాయి కాబట్టి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచిస్తోంది.