
PPP Model : ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సిద్దమయ్యింది... ఇందుకోసం మంత్రివర్గ ఆమోదాన్ని కూడా పొందింది. అయితే ఈ వైద్యకళాశాలల వ్యవహారంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ భగ్గుమంటోంది... ప్రైవేట్ సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేయడం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. PPP (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) మోడల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైసిపి నాయకులు వ్యతిరేకిస్తున్నారు... ఇలా చేయడంవల్ల పేద ప్రజలకు ఉచిత వైద్యం దూరం అవుతుందనేది జగన్ పార్టీ వాదన.
అయితే అధికార కూటమి మాత్రం పిపిపి మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు చాలా లాభదాయకమని అంటోంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులను ఈ పద్దతిలోనే చేపట్టారని... తద్వారా అద్భుత ఫలితాలు వచ్చాయని ఉదాహరణగా చెబుతోంది. ఇలా పిపిపి మోడల్ పై పాలక, ప్రతిపక్షాల మధ్య రచ్చ నేపథ్యంలో అసలు ఏమిటీ మోడల్? ఈ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంతో లాభమా, నష్టమా? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP)... ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పదం. అంటే ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేట్ సంస్థలు యాజమాన్యంలో కాకుండా ఈ రెండు కలిసి చేపట్టే ప్రాజెక్టులను పిపిపి మోడల్ అంటారు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల సహకారంతో పాలనను మరింత సులభతరం చేసుకోవడమే పిపిపి.
ఈ పిపిపి పద్దతిలో ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థల మధ్య దీర్ఘకాలిక ఒప్పందాలుంటాయి... దీని ప్రకారమే ఆ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, నిర్వహణ బాధ్యతలు ఉంటాయి. ప్రభుత్వ ఆస్తులు, ప్రజా సేవలను ప్రైవేట్ సంస్థల పెట్టుబడులతో నిర్వహించడమే పిపిపి... ఇందుకుగాను ప్రభుత్వం ఆయా సంస్థలకు ఆదాయమార్గాన్ని కల్పిస్తుంది. దీనివల్ల ఇటు ప్రభుత్వం, ప్రజలు… అటు ప్రైవేట్ సంస్థలకు లాభమేనని చెబుతుంటారు.
ఆంధ్ర ప్రదేశ్ లో పిపిపి విధానంలో ప్రభుత్వ వైద్య కాలేజీలను ఏర్పాటుచేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది... కానీ దీన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారంపై నిరసనను మరింత తీవ్రతరం చేస్తూ అక్టోబర్ 9న అంటే రేపు గురువారం నర్సీపట్నంలోని వైద్య కళాశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.
వైసిపి పిపిపి విధానంలో వైద్య కళాశాలల ఏర్పాటును వ్యతిరేకించడంపై టిడిపి కూడా ఘాటుగా స్పందిస్తోంది. ఈ పిపిపి మోడల్ తో ప్రజలకు 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే గత ఐదేళ్ల పాటు జగన్ ఎంత నిర్లక్ష్యం చేసాడో, ఎంత ద్రోహం చేసాడో జనానికి తెలిసిపోతుందంటోంది. అందుకే అతడు భయపడిపోయి పిపిపి విధానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని అంటోంది.
అసలు ఈ పిపిపి విధానం అంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కాదు... కేవలం అభివృద్ధి చేసినతర్వాత కొంతకాలం వాడుకునే వెసులుబాటు కల్పించడమని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఇలా వైద్య కళాశాలలు, ఆసుపత్రులు నిర్మించి 33 ఏళ్లు నిర్వహించి ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగించి వెళ్ళిపోతాయని అంటున్నారు. ప్రభుత్వ ఆస్తి భద్రంగా ఉంటుంది... రోగులకు ఉచిత సేవలు అందుతాయని చెబుతున్నారు. ఇవన్నీ చెడగొట్టేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నాడని టిడిపి అంటోంది.
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) దేశంలో సక్సెస్ ఫుల్ మోడల్ గా తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జేగురుపాడులో పిపిపి మోడల్లో విద్యుత్ కేంద్రం నిర్మాణం చేపట్టారని... ఇప్పుడు దాని కాలపరిమితి తీరడంతో అది ప్రభుత్వ ఆస్తిగా మారిందని చెబుతున్నారు. వైద్య విద్యను, వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తేవడానికే PPP మోడల్ ఉపయోగించుకుంటున్నామని... భవిష్యత్ లో ఈ వైద్యకాలేజీలన్నీ ప్రభుత్వం చేతికే వస్తాయని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.8,480 కోట్లు ఖర్చు అవుతుందని టిడిపి చెబుతోంది. అయితే గత ఐదేళ్లలో జగన్ సర్కార్ ఖర్చుచేసింది కేవలం రూ.1,550 కోట్లు మాత్రమే (18.2 శాతం)... ఈ లెక్కన మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్మిస్తే పూర్తికాడానికి 25 సంవత్సరాలు పడుతుందని టిడిపి అంటోంది.
పిపిపి పద్దతిలో ఈ మెడికల్ కాలేజీలను నిర్మించనున్న కూటమి ప్రభుత్వం కేవలం ఏడాదిలోనే రూ.786.82 కోట్లు ఖర్చుచేసిందని చెబుతున్నారు. ఇలా రెండు నుండి రెండున్నర ఏళ్లలో మెడికల్ కాలేజీలను పూర్తి చేయనున్నట్లు కూటమి ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 కాలేజీలలో వచ్చిన సీట్లు 500 మాత్రమే... ఇందులో ప్రీ సీట్లు 213 (42 శాతం), సెల్ప్ ఫైనాన్స్, ఎన్నారై కోటా 287 సీట్లు ఉన్నాయని టిడిపి గుర్తుచేస్తోంది.
ఇదే కూటమి హయాంలో చాలా తక్కువ సమయంలోనే 1700 సీట్లు వస్తాయంటోంది. (2,550 సీట్లు కూడా రావచ్చు). ఇందులో ప్రీ సీట్లు 850 (50 శాతం), సెల్ప్ ఫైనాన్స్, ఎన్నారై కోటా సీట్లు 850 (50 శాతం) ఉండే అవకాశాలున్నాయని టిడిపి చెబుతోంది.
గత ప్రభుత్వం వైద్యారోగ్య రంగానికి, నూతన వైద్యకళాశాల ఏర్పాటుకు ఇచ్చినట్లు చాలిచాలని నిధులిస్తే 20 సంవత్సరాలైన ఒక్కరు కూడా డాక్టర్ కాలేరంటోంది టిడిపి. అదే టిడిపి పిపిపి విధానంలో అయితే 20 ఏళ్లలో 50000 మంది డాక్టర్లు తయారవుతారట. వీరిలో 34,000 మంది ఎంబిబిఎస్, 16,000 మంది పిజి డాక్టర్లు ఉంటారంటోంది.
జగన్ హయాంలో మాదిరిగా అయితే కాలేజీలు కట్టడానినే 25 ఏళ్లు పడుతుంది... కాబట్టి అప్పటివరకు పేదలకు ఉచిత వైద్యం లేనట్లేనని టిడిపి అంటోంది. కానీ చంద్రబాబు సర్కార్ పిపిపి విధానంలో అయితే రోజుకు 17,000 మందికి, ఏడాదికి సుమార్ 62 లక్షల మందికి ఉచిత వైద్యం అందుతుందని... ఇలా 25 ఏళ్లలో 15.50 కోట్లమందికి ఉచిత వైద్యం అందిస్తామని చెబుతోంది.
ఔట్ పేషెంట్స్ కు ప్రభుత్వ వైద్యకాలేజీల్లో ఇప్పుడున్నట్లే పిపిపి పద్దతిలో నిర్మించే కాలేజీల్లోనూ ఉచిత వైద్యం ఉంటుందంటోంది టిడిపి. ఇప్పుడు ఇన్ పేషెంట్స్ కి ఒక్కో కాలేజీలో 500 పడకల చొప్పున 2500 (100 ఉచితం) మాత్రమే ఉచితం.. కానీ పిపిపి విధానంలో 500 పడకల చొప్పున 8500 (వీటిలో 5950 బెడ్లు (70 శాతం)) ఉచితమని చెబుతోంది.
పిపిపి పద్దతిలో నిర్మించే వైద్య కాలేజీల్లో ఎయిమ్స్ తరహాలో ప్రపంచస్థాయి సౌకర్యాలుంటాయి... యూనివర్సల్ హెల్త్ పాలసీతో పాటు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలు అందుబాటులో ఉంటాయని తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వం చెబుతోంది.