
బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ యూట్యూబ్ లో రాజకీయ, సామాజిక అంశాలపై వీడియోలు చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు. నిజానికి ఇతను మొదట్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా జీవితం సాగించేవాడు. అయితే ఆ తర్వాత వృత్తికి ఫుల్‌స్టాప్ పెట్టి ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు చేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, అధికార పక్షం, ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఇటీవల ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. జూన్ 28న ఏలూరులో జరిగిన ఓ సభలో ప్రశ్న రావణ్ చేసిన ప్రసంగంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర నాయకులపై వ్యక్తిగతంగా దూషించేలా మాట్లాడారని ఆరోపిస్తూ వివిధ ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు వరుసగా కేసులు నమోదు చేశారు.
జూలై 1న హైదరాబాద్‌లో ప్రశ్న రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు మొదటిసారి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వివిధ జిల్లాల్లో నమోదైన కేసుల కారణంగా ఆయనను వరుసగా కోర్టులకు తరలించారు. ఒక కేసులో బెయిల్ లభించిన వెంటనే మరో జిల్లాలో నమోదైన కేసులో మళ్లీ అరెస్టు చేశారు. కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, పాయకరావుపేట, పిఠాపురం వంటి ప్రాంతాల్లో నమోదైన కేసుల నేపథ్యంలో కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన ఐదుసార్లు అరెస్టయ్యారు. నాలుగు కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, మరో కేసులో పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకోవడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఫిర్యాదుదారులు, పోలీసులు చేసిన ఆరోపణల ప్రకారం, ప్రశ్న రావణ్ తన ప్రసంగాలు, యూట్యూబ్ వీడియోల్లో రాజకీయ నాయకులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసేలా మాట్లాడినట్లు కేసులు నమోదు చేశారు. కొన్ని ఫిర్యాదుల్లో మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా లో అసభ్యకర థంబ్‌నెయిల్స్, వ్యక్తిగత విమర్శలు, దూషణాత్మక వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
తనపై నమోదవుతున్న కేసులు భావ ప్రకటనా స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నమని ప్రశ్న రావణ్ చెబుతున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్టు చేయడం ద్వారా తనను నిరంతరం జైలులోనే ఉంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ, తనపై ఐదోసారి అరెస్టు జరిగిందని, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి పోలీసులు తనపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. తాను ఎలాంటి నేరాలు చేయలేదని, కేవలం రాజకీయ నాయకులను ప్రశ్నించాను అని చెప్పారు. అలాగే చట్టబద్ధంగా నిరసన తెలిపే హక్కు తనకు ఉందని, ప్రభుత్వం తన గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కూడా ప్రకటించారు.
తనపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అన్ని కేసులను ఒకేచోట విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. వివిధ జిల్లాల్లో విడివిడిగా నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. అలాగే ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, కేసుల విచారణను సీబీఐ లేదా స్వతంత్ర న్యాయపరమైన సంస్థకు అప్పగించాలని కూడా విజ్ఞప్తి చేశారు. తనపై నమోదైన కొన్ని తీవ్రమైన సెక్షన్లను రద్దు చేయాలని, కోర్టు ముందు హాజరుపరచాలని కూడా పిటిషన్‌లో కోరారు.
ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై రాజకీయంగా కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం, ఫిర్యాదుదారులు చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని చెబుతుండగా, మరోవైపు ప్రశ్న రావణ్ అనుచరులు, కొందరు రాజకీయ నాయకులు వరుస అరెస్టులు దుర్వినియోగమని విమర్శిస్తున్నారు. ఈ కేసుల్లో తుది నిర్ణయం న్యాయస్థానాల విచారణ అనంతరం వెలువడనుంది.
ఇదిలా ఉంటే యూట్యూబ్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కుదరదని అంటున్నారు. తమకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందనేది ఎంత నిజమో.. ఆ స్వేచ్ఛ ఇతరులకు ఇబ్బందికరంగా మారకూడదన్న దాంట్లోనూ అంతే నిజం ఉంటుందని గుర్తించాలని అంటున్నారు. ప్రశ్నిస్తున్నామన్న పేరుతో అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తే కచ్చితంగా చట్ట ప్రకారం శిక్షను ఎదుర్కోవాల్సిందేనని చెబుతున్నారు. మరి రావణ్ వర్సెస్ జనసేన వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
ఇక రావణ్ కేవలం సెన్సేషన్ కోసమే వీడియోలు చేస్తున్నాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్ పేరు ప్రశ్న అని ఉందని కానీ అందులో ప్రజా సమస్యలపై ప్రశ్నలు లేవని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా ప్రయోజన అంశాలు లేదా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్, అటవీ శాఖల పనితీరుపై సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా సమాధానాలు కోరిన సందర్భాలు కనిపించడం లేదని చెబుతున్నారు. అలాగే ప్రజలకు ఉపయోగపడే విధానపరమైన చర్చలు, పాలనపై విశ్లేషణలు కూడా ఛానల్‌లో చాలా అరుదుగా కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రశ్న ఛానల్‌లో ఎక్కువగా రాజకీయ నాయకులపై వ్యక్తిగత విమర్శలు, పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకున్న వీడియోలు, మతపరమైన వివాదాలకు దారితీసే వ్యాఖ్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.