
రాష్ట్రంలో పీఎన్‌జీ వినియోగం పెంచేందుకు మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయడం, ఆలయాల్లో తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. ఈ అంశంపై శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రజలకు వంటగ్యాస్ అందుబాటులో ఉండేలా ప్రత్యామ్నాయ వ్యవస్థలను బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో పీఎన్‌జీ కనెక్షన్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని గ్యాస్ కంపెనీలు విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. పీఎన్‌జీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేస్తున్నామని, ఎక్కడైనా పరిపాలనా లేదా సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఫిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాల కేటాయింపులో కూడా ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
పీఎన్‌జీ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని యువతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఇతర సాంకేతిక విద్యాసంస్థల్లో చదువుతున్న యువతకు పీఎన్‌జీ సాంకేతిక అంశాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో సమన్వయం చేసి ప్రతి జిల్లాలో ప్రత్యేక బ్యాచ్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఒక్కో బ్యాచ్‌లో 100 మంది యువతకు వారం రోజులపాటు శిక్షణ, వసతి, భోజనం, ఉపకార వేతనం అందించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. శిక్షణ పూర్తయ్యాక గ్యాస్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పీఎన్‌జీ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను గ్రామీణ, పట్టణ మహిళలకు చేరవేయడంలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించగలవని మంత్రి పేర్కొన్నారు. ఇంటికి నేరుగా గ్యాస్ సరఫరా, ఖర్చుల తగ్గింపు, భద్రత వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. సెర్ప్, మెప్మా సంస్థల సహకారంతో మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్యాస్ కంపెనీలు కూడా మహిళా సంఘాలతో భాగస్వామ్యం ఏర్పరచుకుని పీఎన్‌జీ కనెక్షన్ల విస్తరణలో భాగస్వామ్యమయ్యే వారికి ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. అలాగే జిల్లాల వారీగా ప్రచార యాత్రలు, అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే ప్రధాన దేవాలయాల్లో పీఎన్‌జీ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటికీ, మిగిలిన చోట్ల కూడా త్వరితగతిన అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. దుర్గగుడి, శ్రీకాళహస్తి వంటి ఆలయాల్లో ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పీఎన్‌జీ కనెక్షన్ల ఏర్పాటు కోసం అవసరమైన స్థలాల లభ్యత లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిశీలించాలని సూచించారు.
అద్దె ఇళ్లలో నివసించే వారికి పీఎన్‌జీ కనెక్షన్లు సులభంగా అందేలా మార్గదర్శకాలను మరింత సరళీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎల్పీజీ వినియోగదారులకు అందుతున్న ప్రభుత్వ రాయితీలు పీఎన్‌జీ వినియోగదారులకు కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీపం-2 పథకం కింద పీఎన్‌జీ వినియోగదారులకు కూడా వార్షిక రాయితీ అందించేందుకు ఇప్పటికే విధాన రూపకల్పన పూర్తయిందని వెల్లడించారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టులు, పట్టణ ప్రాంతాల్లో పీఎన్‌జీ కనెక్షన్ల విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని గ్యాస్ కంపెనీలకు సూచించారు.
మంత్రి మాట్లాడుతూ, మరో 15 రోజుల్లో పీఎన్‌జీ విస్తరణ పురోగతిపై మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని, అప్పటికి అన్ని కంపెనీలు స్పష్టమైన పురోగతి చూపించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పీఎన్‌జీ వినియోగాన్ని పెంచడం ద్వారా ప్రజలకు సురక్షితమైన, నిరంతర గ్యాస్ సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.