PM Narendra Modi AP Tour
PM Narendra Modi AP Tour : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(బుధవారం) ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ది పనులు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు... మరికొన్నింటిని ప్రారంభించనున్నారు. ఉత్తరాంద్ర గడ్డపైనుండి ఏకంగా రెండు లక్షల కోట్లకు పైగా అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇలా ఏపీ భవిష్యత్ ను అభివృద్ది దిశగా నడిపించడంలో ప్రధాని పర్యటన కీలకంగా మారింది.
ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని మోదీ విశాఖపట్నం చేరుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి విశాఖలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ వేదిక పైనుండే వివిధ అభివృద్ది, సంక్షేమ పనులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ.
ప్రధాని ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ది కోసం ప్రారంభించే ప్రాజెక్టులు, అభివృద్ది పనులతో ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. మరీముఖ్యంగా యువతకు భారీగా ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. అంతేకాదు సామాన్యుల జీవితాలపై ప్రభావం చూపించనున్నాయి. ఇక శంకుస్థాపన చేసే పనులు పూర్తయితే ఏపీ అభివృద్దికి కేరాఫ్ అడ్రస్ గా మారనుంది.
Bulk Drug Park
ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులు - దీంతో కలిగే లాభాలు :
1. బల్క్ డ్రగ్ పార్క్ :
భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా బల్క్ డ్రగ్ పార్కుల ఏర్పాటుకు సిద్దమైంది. ఇలా వివిధ రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ పార్కులను మంజూరు చేసింది... ఇందులో ఒకటి ఏపీకి దక్కింది. విశాఖపట్నం జిల్లాలో 2 వేల ఎకరాల్లో ఈ పార్క్ ను ఏర్పాటుచేస్తున్నారు... ఈ పనులను ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇవాళ ఈ బల్క్ డ్రగ్ పార్క్ కు శకుస్థాపన చేయనున్నారు.
ఈ బల్క్ డ్రగ్ పార్క్ కోసం ప్రభుత్వం రూ.1,876 కోట్లు ఖర్చు చేయడానికి సిద్దంగా వుంది. దీని ద్వారా ఏపీకి రూ.10 నుండి 15 వేల కోట్ల పెట్టుబడులు, యువతకు 28 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. పరోక్షంగా లక్షలాదిమంది ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ వల్ల ఉపాధి పొందనున్నారు.
Green Hydrogen Hub
2. గ్రీన్ హైడ్రోజన్ హబ్ :
ఎన్డిఏ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ లో చేపడుతున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో 1200 ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేస్తున్నారు. రూ.1.85 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. దీనికి కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.
ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఏపీలో భారీ ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల మొత్తం 25 వేలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక్కడినుండి 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయనున్నారు.
KRIS City
3. క్రిస్ సిటీ :
బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్ లో భాగంగా తిరుపతి జిల్లా కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ సిటీ (క్రిస్ సిటీ) ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రిస్ సిటీలో ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్ టైల్, ఎలక్ట్రానిక్ ఆండ్ కమ్యూనికేషన్, ఆటో రంగానికి చెందిన పరిశ్రమలు రానున్నాయి. 37 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఈ క్రిస్ సిటీలో ఏర్పాటుచేసే పరిశ్రమల ద్వారా యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. రాష్ట్రంలోని 4.67 లక్షలమందికి ఈ క్రిస్ సిటీ ద్వారా ఉద్యోగ, ఉపాధి లభించనుందని అంచనా వేస్తున్నారు. అలాగే రాష్ట్ర అభివృద్దికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడనుంది.
vizag railway zone
4. విశాఖ రైల్వే జోన్ :
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మరీముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ విశాఖ రైల్వే జోన్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కదలిక వచ్చింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైల్వే జోన్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించింది. ఇక ఇవాళ ప్రధాని మోదీ ఈ రైల్వే జోన్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.
ఈ రైల్వే జోన్ ఏర్పాటుతో ఏపీలో రైల్వే వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. తద్వారా రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయం కలుగుతుంది. అలాగే ఈ రైల్వే జోన్ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి.