Pawan Kalyan
Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చిన్నపుడే శాస్త్ర సాంకేతికత గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించేవాడినని పవన్ తెలిపారు. ఈ ఉత్సాహమే ఓసారి తనకు చుక్కలు చూపించిందంటూ స్కూల్ డేస్ స్టోరీని గుర్తుచేసుకున్నారు.
Pawan Kalyan
''నేను నెల్లూరులో చదువుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి శాస్త్రసాంకేతిక రంగాలు, అంతరిక్ష ప్రయోగాలపై మక్కువ ఉండేది. స్కూళ్లో టీచర్ ను పదేపదే దీనిపై ప్రశ్నలు అడిగేవాడిని. టీచర్ నాలో ఉన్న తపనను గుర్తించి... నన్ను స్కూలు సైన్స్ టీంలో వేసి ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం మీద ఓ నమూనా తయారు చేసి తీసుకురమ్మన్నారు. నానా రకాల పాట్లు పడి... అప్పుడున్న వనరులతో సాధారణ పేపర్ నమూనా తయారు చేయడానికే నాకు చుక్కలు కనిపించాయి'' అని స్కూల్ డేస్ సంఘటనను పవన్ గుర్తుచేసుకున్నారు.
Pawan Kalyan
ఇలా ఓ చిన్న నమూనాను తయారు చేసేందుకే నానా కష్టాలు పడ్డాను... అలాంటిది నిజంగానే అంతరిక్ష ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు ఎంతలా కష్టపడతారో అర్థమయ్యిందన్నారు. అప్పటినుండి తనకు శాస్త్రవేత్తలంటే అమితమైన గౌరవం పెరిగిందన్నారు. వారు చేసే ప్రయోగాలు దేశానికి ఎంతో మేలు చేస్తాయి... కానీ ఆ ప్రయోగాల ద్యాసలో పడి తమ వ్యక్తిగత జీవితాన్నే మరిచిపోతారని అన్నారు. అందరికీ అవసరమయ్యే సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు చాలా గొప్పవారని పవన్ కొనియాడారు.
Pawan Kalyan
నెల్లూరులో ఉన్నపుడు శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగిస్తారని తెలుసుకొని ఎప్పుడైనా అక్కడికి వెళ్లాలని అనుకునేవాడినినని పవన్ గుర్తుచేసుకున్నారు. అయితే చాలామంది పోలీసులతో బందోబస్తు వుంటుంది... పెద్దపెద్ద శాస్త్రవేత్తలు, అధికారులు వుంటారు... కాబట్టి అక్కడికి తాను ఎప్పటికీ వెళ్లలేని భావించేవాడినని అన్నారు. కానీ అనుకోకుండా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం యాదృచ్ఛికమే అయినా తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. జీవితంలో మంచిని బలంగా కోరుకుంటే అవుతుందనడానికి ఇది నిదర్శనమన్నారు పవన్.
Pawan Kalyan
ఇక తన చిన్నప్పటి మరో విషయాన్ని కూడా పవన్ పంచుకున్నారు. అమ్మ ప్రతిరోజు సాయంత్రం అవగానే ఇంట్లో బల్బు స్విచ్ వేసి దండం పెట్టుకోవడం గమనించేవాడినని...ఓరోజు ఎందుకలా బల్బును మొక్కుతున్నావని అడిగానన్నారు. బల్బు కనిపెట్టి మనకు వెలుగులు పంచిన థామస్ అల్వా ఎడిసన్ కు దండం పెడుతున్నానని చెప్పిందన్నారు. అంటే శాస్త్రవేత్తలను, వారి జ్ఞానాన్ని దేవుడిగా నమ్మే సంస్కృతి మనదని అప్పుడు తెలిసిందన్నారు. పది మందికి మంచి చేసేవారికి దండం పెట్టడమే భారతీయ ధర్మం... దైవం మానుష రూపేణా అని భావిస్తామని పవన్ వెల్లడించారు.