
Pawan Kalyan : సినిమాల్లో ఆయన నెంబర్ 1... గత ఎన్నికల్లో 100శాతం స్ట్రైక్ రేట్ విక్టరీతో రాజకీయాల్లోనూ నెంబర్ వన్ అని నిరూపించుకున్నారు. కానీ పాలనలో ఏంటి సామీ నెంబర్ 10 అంటున్నారు? నిజంగానే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పనితీరు అంత దారుణంగా వుందా? మరీ ఆయన పార్టీకి చెందిన మంత్రుల కంటే అధ్వాన్నమా? అనే అనుమానాలు జనసైనికుల్లోనే కాదు సామాన్య ప్రజల్లోనూ కలుగుతున్నాయి.
ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ సమావేశమయ్యింది. ఈ సందర్భంగా అధికారుల నుండి అందిన సమాచారం మేరకు మంత్రులకు ర్యాంకింగ్స్ కేటాయించారట సీఎం చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత డిసెంబర్ వరకు మంత్రులవద్దకు వచ్చిన ఫైల్స్ క్లియరెన్స్ ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ర్యాంకింగ్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆరో స్థానం దక్కింది. ఇక ఆయన తనయుడు, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఎనిమిదో స్థానం దక్కింది. పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి పవన్ కల్యాణ్ కు పదో ర్యాంక్ దక్కింది. ఇదే ఇప్పుడు రాజకీయంగా కొత్త వాదనకు కారణమయ్యింది.
పవన్ ను తగ్గించేందుకేనా ఈ ర్యాంకింగ్స్ :
'సీజ్ ద షిప్'... పవన్ కల్యాణ్ నోటివెంట సాధారణంగా వచ్చిన ఈ మాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది... ఏకంగా ఈ మాట ఓ సినిమా పేరుగా రిజిస్టర్ అయ్యింది. అంతటి ప్రజాదరణ కలిగిన నాయకుడి క్రేజ్ ను ఇప్పుడు తగ్గించే ప్రయత్నం జరుగుతోందనేది ఏపీలో వినిపిస్తున్న పొలిటికల్ టాక్.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ వేరు... ఆ తర్వాత వేరు. పోటీచేసిన అన్నిస్థానాల్లో జనసేనను గెలిపించుకున్న తర్వాత పవన్ క్రేజ్ మామూలుగా పెరగలేదు. ఇక కూటమి ప్రభుత్వంలో ఆయనకు దక్కిన ప్రాధాన్యత, డిప్యూటీ సీఎం పదవి పవన్ స్థాయిని మరింత పెంచాయి.
ఇక మంత్రిగా కూడా పవన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా ఒకేసారి గ్రామసభలు నిర్వహించడం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా ఇటీవల మారుమూల గ్రామాలను సందర్శించడం, అటవీశాఖ మంత్రిగా అడవులు, జంతువుల రక్షణకు తీసుకున్న చర్యలు... ఇలా చేపట్టిన అన్ని శాఖల్లో తనమార్క్ పనితీరు చూపిస్తున్నారు.
ఇలా సినిమాల్లో మాదిరిగానే రాజకీయ నాయకుడిగా, పాలకుడిగా పవన్ ఎవరూ అందనంత ఎత్తుకు ఎదుగుతున్నారు. ఇలా ఆయనపై రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఎక్కడ తమకు పోటీగా వస్తాడోనని సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ కు పట్టుకుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజా ర్యాంకింగ్స్ తో దీనికి మరింత బలం చేకూరింది.
ఇటీవల నారా లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎంగా చేయాలనే టిడిపి నాయకుల డిమాండ్ తో పవన్ ను తగ్గించేందుకు ఏవో కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రస్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పవన్ కు చెక్ పెట్టేందుకే చంద్రబాబు తన కొడుకును తెరపైకి తెచ్చారని... టిడిపి నాయకులతో డిప్యూటీ సీఎం అంశాన్ని తెరపైకి తెచ్చారని జనసేన నాయకులు ఆరోపించారు.
ఇప్పుడు పనితీరు ఆధారంగా అంటూ ప్రకటించిన ర్యాంకులు కూడా అలాంటివేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన సినిమాలను పక్కనబెట్టిమరీ పవన్ ప్రజాసేవలో మునిగిపోతే ఇలా 10 ర్యాంకు అంటూ ప్రచారం చేయడమేంటి? దీంతో ఆయన కేవలం ఆర్బాటాలకే పరిమితం, పనిచేయడం లేదు? అని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలను జనసైనికులు రావడం సహజమే కదా.
మొత్తంగా తన కొడుకు పొలిటికల్ కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. అందుకే ఈ మధ్య పాలనా వ్యవహారాల్లో పవన్ ను ఆయన కాస్త దూరం పెడుతున్నారని... ఇదే సమయంలో లోకేష్ పాలనావ్యవహారాల్లో మరింత చురుగ్గా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇలా పవన్ ను తగ్గించి కొడుకును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏ మంత్రికి ఏ ర్యాంక్ ? చంద్రబాబు, లోకేష్, పవన్ ర్యాంకులెంత?
తమ మంత్రిత్వశాఖల పనితీరు ఆధారంగా అంటే ఫైల్స్ క్లియరెన్స్ ఆధారంగా మంత్రుల పనితీరును అంచనావేసారు సీఎం చంద్రబాబు. చివరకు తన పనితీరును కూడా ఇందులో చేర్చారు. ఇలా ఏపీ మంత్రివర్గంలోని అందరికి ర్యాంకులు కేటాయించారు. అవి ఎలా వున్నాయో చూద్దాం.
1. ఎన్ఎండీ ఫరూఖ్
2. కందుల దుర్గేశ్ (జనసేన పార్టీ)
3. కొండపల్లి శ్రీనివాస్
4. నాదెండ్ల మనోహర్ (జనసేన పార్టీ)
5. డోలా బాలవీరాంజనేయ స్వామి
6. నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి)
7. సత్యకుమార్ (బిజెపి)
8. నారా లోకేష్
9. బిసి. జనార్ధన్ రెడ్డి
10. పవన్ కల్యాణ్ (డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ)
11. సవిత
12. కొల్లు రవీంద్ర
13. గొట్టిపాటి రవికుమార్
14. నారాయణ
15. టిజి. భరత్
16. ఆనం రాంనారాయణ రెడ్డి
17. అచ్చెన్నాయుడు
18. రాంప్రసాద్ రెడ్డి
19. గుమ్మడి సంధ్యారాణి
20. వంగలపూడి అనిత
21. అనగాని సత్యప్రసాద్
22. నిమ్మల రామానాయుడు
23. కొలుసు పార్థసారథి
24. పయ్యావుల కేశవ్
25. వాసంశెట్టి సుభాష్