ఫిబ్రవరి 26, 27 రెండ్రోజులు సెలవే :
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈరోజు శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడతాయి... చాలామంది ఉపవాస దీక్ష పాటిస్తారు. శ్రీశైలం, వేములవాడ వంటి శైవక్షేత్రాల్లో శివరాత్రికి ప్రత్యేక పూజలు, ఆద్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలా హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే శివరాత్రి పండగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అధికారిక హాలిడే వుంది.
అయితే ఆ తర్వాతి రోజే తెలంగాణతో పాటు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వుంటుంది. తెలంగాణలో మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్, టీచర్ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణలో ఈ జిల్లాల్లో సెలవు వుండనుంది.
ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడకూడా మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి తో పాటు కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే విజయనగరం-శ్రీకాకుళం-విశాఖపట్నం టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు వుంటుంది.
ఇలా ఇరు తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి తర్వాతి రోజు అంటే ఫిబ్రవరి 27న సెలవు వుండనుంది. పాఠశాలలు, కాలేజీల్లోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తారు... అలాగే ఈ ఎన్నికల్లో ఓటర్లంతా గ్రాడ్యుయేట్లు, టీచర్లు... కాబట్టి విద్యాసంస్థలకు సెలవు ఇస్తారు. ఇలా శివరాత్రి పండగవేళ వరుసగా రెండ్రోజుల సెలవులు కలిసివస్తున్నాయి.