Pawan Kalyan
Pawan Kalyan : ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించని అరుదైన వృక్షజాతి ఎర్రచందనం ... కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే ఇది పెరుగుతుంది. దీన్నిబట్టే ఎర్రచందనంకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో ఎంత డిమాండ్ వుంటుందో తెలుస్తోంది. దీంతో కేవలం ఎర్రచందనం స్మగ్లింగ్ కోసమే కొన్ని ముఠాలు పుట్టుకొచ్చాయి... సహజంగా పెరిగే చెట్టను కొట్టేస్తూ నల్లమల అడవులను నాశనం చేస్తున్నారు. ఈ ముఠాలు ఏ స్థాయిలో అరాచకాలకు పాల్పడుతున్నాయో ఇటీవల అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప' సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. హీరోను ఎర్రచందనం స్మగ్లర్ గా చూపించారంటే ఈ ముఠాల ప్రభావం ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు.
Pawan Kalyan
అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎర్రచందనం స్మగ్లింగ్ పై రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే అల్లు అర్జున్ తో మెగా ఫ్యామిలీ సంబంధాలు దెబ్బతిన్నాయనే ప్రచారం జరుగుతోంది... ఈ క్రమంలో పవన్ పరోక్షంగా 'పుష్ఫ' సినిమా ప్రస్తావన తీసుకురావడంతో సంచలనంగా మారింది. ఒకప్పుడు అడవులను కాపాడేవారిని హీరోలుగా చూపిస్తూ సినిమాలు వచ్చేవని... కానీ ఇప్పుడు అడవులను నరికేసే హీరోలను చూపిస్తున్నారని పవన్ ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో మరోసారి మెగా, అల్లు కుటుంబాల వివాదం తెరపైకి వచ్చింది.
Pawan Kalyan
గత అసెంబ్లీ ఎన్నికల వేళ అల్లు అర్జున్ వైసిపి అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో వివాదం రాజుకుంది. ఇప్పుడది తారాస్థాయికి చేరి అల్లు అర్జున్ 'పుష్ఫ2' సినిమానే ప్రభావితం చేసే స్థాయికి చేరింది. తాజాగా పవన్ చేసిన కామెంట్స్ ఉద్దేశపూర్వకం కాకపోవచ్చు... కానీ త్వరలో విడుదలకానున్న 'పుష్ఫ2' సినిమాను ఎఫెక్ట్ చేయవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలో పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైనికులు ఈ సినిమాపై ఎలా రియాక్ట్ అవుతారో..? ఒకవేళ వాళ్లంతా నెగెటివ్ గా రియాక్ట్ అయితే మాత్రం 'పుష్ఫ2' కు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.
Pawan Kalyan
ఇదిలావుంటే కూటమి ప్రభుత్వం కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ పై చాలా సీరియస్ గా వుంది. గత వైసిపి ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడి కనుసన్నల్లో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కొనసాగినట్లు ఆరోపిస్తున్నారు. ఇలా సదరు నాయకుడు వందలు, వేల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడినవారితో పాటు ఈ వ్యవహారంతో సంబంధమున్న ఎవ్వరినీ వదిలిపెట్టమని చంద్రబాబు ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
Pawan Kalyan
అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అయితే ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఈ ముఠాల బారినపడి నష్టపోయినవారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాల ఆగడాలతో విసిగిపోయిన ప్రజలు కుదిరితే పవన్ కల్యాణ్ ను లేదంటే జనసేన ఎమ్మెల్యేలు, నాయకులను కలిసి తమ బాధను వెల్లబోసుకుంటున్నారు. ఇలా తాజాగా ఓ బాధిత కుటుంబం జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ను ఆశ్రయించారు.
Pawan Kalyan
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. తమ బాధలు చెప్పుకునేందుకు చాలామంది జనసేన కార్యాలయానికి తరలివచ్చారు. ఇలా ఓ బాధితుడు ఎర్రచందనం స్మగ్లర్ల చేతిలో నలిగిపోయి కాపాడాలంటూ జనసేన ఎమ్మెల్యేను ఆశ్రయించాడు.
గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేయించానని... దీంతో తనపై కక్ష అతడు పెంచుకున్నాడని బాధితుడు జనసేన ఎమ్మెల్యేకు తెలిపాడు. ఈ క్రమంలోనే తన భూమికి దొంగ పత్రాలు సృష్టించి కబ్జా చేసాడని... ఇదేంటని అడిగితే దౌర్జన్యం చేస్తున్నాడని వాపోయాడు. పోలీసులు, అధికారులను ఆశ్రయించినా లాభం లేకుండా పోయిందని... ఎక్కడా తనకు న్యాయం జరగడంలేదని తెలిపారు. దయచేసి ఎర్రచందనం స్మగ్లర్ బారినుండి తన భూమిని కాపాడాలంటూ బాధితుడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ను కోరాడు. అతడి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.