మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ... ఆ శాఖనే కేటాయిస్తారా?

Published : Dec 10, 2024, 01:26 PM ISTUpdated : Dec 10, 2024, 05:33 PM IST

జనసేన పార్టీకి కూటమి కేబినెట్ లో మరో మంత్రి పదవి దక్కింది. మెగా బ్రదర్ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరి ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

PREV
13
మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ... ఆ శాఖనే కేటాయిస్తారా?
Nagababu

Nagababu : మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది బాగా కలిసివస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి ఈ ఏడాది దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ లభించింది. అలాగే ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో పవన్ కల్యాణ్ పదేళ్ల నిరీక్షణ పలించింది. ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడమే కాదు డిప్యూటీ సీఎంగా, పలు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

కేవలం మరో మెగా బ్రదర్ నాగబాబుకే ఈ ఏడాది అంతగా కలిసిరాలేదని అనుకుంటున్న సమయంలోనే కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇలా ఈ ఏడాది చివర్లో మెగా ఫ్యామిలీకి మరో గుడ్ న్యూస్ వినిపించింది.  
 

23
Nagababu

నాగబాబును ఈ ఏడాదంతా ఊరించి ఉసూరుమనిపించిన పదవులివే : 

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు ముందునుండి నాగబాబుకు అనేక అవకాశాలు చేజారాయి. తమ్ముడు పవన్  కల్యాణ్ కు అండగా వుండేందుకు రాజకీయ రంగప్రవేశం చేసిన నాగబాబు జనసేన పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయితే పార్టీ కోసం చాలాకాలంగా కష్టపడుతున్న ఆయనకు కీలక పదవి దక్కుతుందని అందరూ భావించారు. ఎన్నికల వేళ ఆయనకు అనకాపల్లి ఎంపీ టికెట్ దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ పొత్తుల కారణంగా ఆ సీటు బిజెపికి వెళ్లడంతో నాగబాబుకు నిరాశ తప్పలేదు. 

అయితే తనకు ఎంపీ టికెట్ రాకున్నా నాగబాబు ఏమాత్రం నిరాశ చెందలేదు. జనసేన పార్టీ లీడర్లు, కేడర్ ను ఉత్సాహపరుస్తూ ఎన్నికల్లో ముందుండి నడిపారు.ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా జనసేన, టిడిపి, బిజెపి కూటమికోసం పవన్ ప్రచారం చేపడితే... తమ్ముడి కోసం పిఠాపురంలో నాగబాబు ప్రచారం చేపట్టారు. ఇలా పిఠాపురంలో పవన్ భారీ మెజారితో గెలుపు వెనక నాగబాబు పాత్ర చాలా వుంది. ఇలా ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించిన ఆయనకు కూటమి ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందని మెగా ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రజలు కూడా భావించారు.  

దేశంలోనే రిచ్చెస్ట్ టెంపుల్స్ లో ఒకటైన తిరుమల బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ గా ఆయనను నియమిస్తారని అనుకున్నారు.  కానీ అనూహ్యంగా బిఆర్ నాయుడికి ఆ పదవి దక్కింది. దీంతో టిటిడి ఛైర్మన్ పదవి ప్రచారానికి తెరపడింది. 

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ముగ్గురు వైసిపి ఎంపీలు రాజీనామా చేయడంతో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇందులో ఓ స్థానం నాగబాబుకు కేటాయించి ఏపీ నుండి పెద్దల సభకు పంపుతారనే ప్రచారం జరిగింది. కానీ అదీ జరగలేదు. ఇందులో రెండు టిడిపి, ఒకటి బిజెపికి దక్కింది. బిజెపి నుండి బిసి నేత ఆర్ కృష్ణయ్య, టిడిపి నుండి బీద మస్తాన్ రావు, సానా సతీష్ ను బరిలోకి దింపనున్నట్లు ప్రకటించారు. దీంతో రాజ్యసభ ప్రచారానికి కూడా తెరపడింది.

అయితే టిడిపి రాజ్యసభ సభ్యుల ప్రకటనలోనే మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే సమాచారం వుంది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇలా ఏడాదంతా ఊరించిన పదవులు దక్కకున్నా చివరకు కీలకమైన మంత్రి పదవి దక్కింది. దీంతో నాగబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు. 
 

33
Nagababu

నాగబాబుకు కేటాయించేది ఇదే మంత్రిత్వ శాఖా? 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనతో మెగా బ్రదర్ నాగబాబు కేబినెట్ లో చేరడం ఖాయమయ్యింది. అయితే ఆయనకు ఏ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దాదాపు అన్ని శాఖలను మంత్రులకు కేటాయించారు... సీఎం వద్ద కూడా శాఖలేవీ లేవు. కాబట్టి నాగబాబు కేబినెట్ చేరడం వల్ల పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు వుండే అవకాశాలున్నాయి. 

అయితే జనసేన కోటాలో నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. అలాగే ఆయన సినీరంగం నుండి వచ్చారు... కాబట్టి దానిపై ఆయనకు మంచి అవగాహన వుంటుంది. అంతేకాదు సినిమావాళ్లతో నాగబాబుకు మంచి సంబంధాలు వున్నాయి. కాబట్టి ప్రస్తుతం జనసేన వద్ద వున్న సినిమాటోగ్రపి శాఖను ఆయనకు కేటాయించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం జనసేన నుండి పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లు చంద్రబాబు మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. వీరిలో కందుల దుర్గేష్ టూరిజం, సినిమాట్రోగ్రఫి శాఖలు చూసుకుంటున్నారు. ఒకవేళ మంత్రుల శాఖలను మార్చకుండానే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటే టూరిజం శాఖను దుర్గేష్ వద్దే వుంచి సినిమాటోగ్రపీ శాఖను మాత్రం నాగబాబుకు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories