
Parents Teachers Meeting in Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఒకేసారి రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాతీల్లో గ్రామసభలు నిర్వహించి చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఇప్పుడు విద్యావ్యవస్థలో అలాంటి ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో సహా మంత్రులు పాలుపంచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తోంది ప్రభుత్వం.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఏ స్కూల్ కు...
మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ లో భాగంగా బాపట్ల ప్రభుత్వ పాఠశాలను సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సందర్శించారు. విద్యార్థులు, వారి పేరెంట్స్, టీచర్స్ తో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ఆ స్కూల్ పూర్వవిద్యార్థులు, టీచర్స్, పేరెంట్స్ ద్వారా విద్యార్థులకు అందుతున్న సదుపాయాల గురించి చర్చించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లతో కలిసి చంద్రబాబు, లోకేష్ సహపంక్తి భోజనం చేయనున్నారు.
రాష్ట్రంలోని 45,094 ప్రభుత్వ,ఎయిడెడ్ పాఠశాలల్లోనూ ఇలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మీటింగ్స్ కొనసాగుతున్నాయి. 35,84,621 మంది విద్యార్థులు, 71,60,000 మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 58,000 మందికి పైగా ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో గేమ్స్ కూడా నిర్వహిస్తూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తోంది చంద్రబాబు సర్కార్.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడప జిల్లాలో జరిగే PTM (Parents Teachers Meeting) కు హాజరవుతున్నారు. కడప మున్సిపల్ హైస్కూల్లో జరిగే సమావేశానికి ఆయన హాజరయ్యారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముచ్చటించిన పవన్ అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీచర్లతో కూడా పవన్ ముచ్చటించారు.
మీరు పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కు వెళుతున్నారా? అయితే మీ పిల్లల గురించి ఈ ప్రశ్నలు అడగండి
మీ పిల్లలు కూడా ప్రభుత్వ లేదా ఎయిడెడ్ స్కూల్లో చదువుతున్నారా? మీరు కూడా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కు హాజరవుతున్నారా? అయితే మీ పిల్లల చదువు గురించే కాదు ఇతర యాక్టివిటీస్ గురించి కూడా టీచర్స్ ను అడగండి. పిల్లలు స్కూల్లో ఎలా వుంటున్నారో తెలుసుకుని... ఇంట్లో వారి ప్రవర్తన ఎలా వుంటుందో టీచర్లకు వివరించండి, ఇలా మీ పిల్లలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఈ పిటిఎం ను ఉపయోగించుకొండి.
1. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటివరకు మీ పిల్లల చదువు ఎలా కొనసాగిందో అడిగి తెలుసుకొండి. పిల్లలు ఎక్కువసమయం గడిపేది స్కూల్లోనే కాబట్టి వారి ఎడ్యుకేషన్, స్కిల్స్ మెరుగుపర్చేందుకు ఏం చేస్తున్నారో టీచర్లను అడగండి. ఇందుకు సంబంధించి మీ సలహాలు, సూచనలు ఏమైనా వుంటే టీచర్లతో పంచుకొండి.
2. మీ పిల్లలు ఏ సబ్జెక్ట్స్ లో స్ట్రాంగ్, ఏ సబ్జెక్ట్ లో వీక్ గా వున్నారో అడగండి. వీక్ గా వున్న సబ్జెక్ట్స్ లో మెరుగుపడేందుకు పేరేంట్స్ గా ఏం చేయాలో అడగండి. టీచర్స్ ఏం చేస్తున్నారో తెలుసుకొండి.
3. ఇంటికి వచ్చాక పిల్లల చదువు ఎలా సాగుతుందో తెలియజేయండి. హోంవర్క్ ఏవయినా కంప్లయింట్స్ వుంటే చెప్పండి. క్లాస్ వర్క్ పై కూడా ఏవయినా అనుమానాలుంటే అడగండి.
4. ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు, అందులో మీ పిల్లలకు వచ్చిన మార్కుల గురించి తెలుసుకొండి. ఒకవేళ మార్కులు తక్కువగా వస్తే అందుకు రీజన్ కనుక్కొండి.
5. కేవలం చదువుకు సంబంధించినవే కాదు సామాజిక అంశాలు, ఆటల్లో మీ పిల్లల ప్రదర్శన గురించి తెలుసుకొండి. క్రీడలపై ఆసక్తి వుంటే ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని టీచర్లకు సూచించండి. చదువు దెబ్బతినకుండానే క్రీడల్లో కూడా రాణించేలా తీర్చిదిద్దాలని... అందుకు ఎలాంటి సహకారం కావాలో అడిగి తెలుసుకొండి.
6. స్కూల్లోని ఇతర విద్యార్థులతో తమ పిల్లల ప్రవర్తన ఎలా వుంటుందో అడిగి తెలుసుకొండి. స్నేహితులు, టీచర్లతో ఎలా ప్రవర్తిస్తున్నారో అడగండి. ప్రవర్తనలో ఏమయినా మార్పులు చేసుకోవాల్సివుంటే చెప్పాలని అడగండి.
7. పిల్లల మంచి భవిష్యత్ కోసం పేరెంట్స్ గా ఎలా నడుచుకోవాలో అడగండి. విద్యాపరంగానే కాకుండా ఇతర ఏ అంశాల్లో వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారో తెలుసుకొండి. క్రీడలు, రచనలు, పెయింటింగ్... ఇలా ఏ అంశాలను మీ పిల్లలు ఇష్టపడతారో చెప్పి ఆ దిశగా కూడా ప్రోత్సహించాలని సూచించండి.
8. అమ్మాయిల పేరెంట్స్ సున్నితమైన అంశాలగురించి అడిగి తెలుసుకోవాలి. అంటే నెలసరి సమయంలో స్కూల్లో ఇబ్బంది పడుతున్నారా లేకపోతే ఎవరైనా వీరితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా? ఇలాంటి విషయాలను మహిళా టీచర్లను అడిగి తెలుసుకొండి. ఏ సమస్య వున్నా ముందుగానే తెలుసుకుంటే పరిష్కరించవచ్చు.
9. చదువు విషయంలో పిల్లలను ఒత్తిడి చేయవద్దని చెప్పండి. వీక్ గా వున్న సబ్జెక్టులను అర్థమయ్యేలా బోధించండి...కానీ బట్టి కొట్టించడం వంటివి చేయవద్దని సూచించండి.
10. పిల్లలు సమయ పాలన పాటిస్తున్నారో లేదో తెలుసుకొండి. మధ్యాహ్న భోజనం నాణ్యతతో వుండేలా చూడాలని సూచించండి. చదువు, క్రీడలు, సామాజిక కార్యకలాపాలు, వ్యక్తిగత ప్రవర్తన... ఇలా అన్నింటి గురించి అడగండి. ఇంకా మీ పిల్లలకు సంబంధించిన ప్రత్యేక విషయాలేమైనా వుంటే టీచర్స్తో చర్చించండి.