శెభాష్ గొట్టిపాటి రవికుమార్.. వరద బాధితుల కోసం కోటి ఖర్చు చేసిన ఏపీ విద్యుత్ శాఖ మినిస్టర్

First Published Sep 6, 2024, 12:59 AM IST

ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వరద బాధితులకు బాసటగా నిలిచారు. గడిచిన నాలుగు రోజుల్లో ఆయన కోటి రూపాయల మేర వరద బాధితుల కోసం ఖర్చు చేసి ఉదార స్వభావం చాటుకున్నారు. విజయవాడతో పాటు బాపట్ల జిల్లాలో వరదల్లో ప్రభావితమైన ప్రజలకు ఉదారంగా సాయం అందించి శెభాష్ అనిపించుకుంటున్నారు. 

Minister Gottipati Ravikumar

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. భారీ వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు తన వంతు సహాయం అందించారు. విజయవాడ, బాపట్ల, రేపల్లె తదితర ప్రాంతాల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న వరద బాధితుల కోసం సుమారు కోటి రూపాయలకు పైగా ప్రత్యక్ష సాయాన్ని అందజేశారు.

వరద బాధితుల అండగా నిలబడేందుకు తొలి రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అద్దంకి నియోజకవర్గం నుంచి ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌. తొలి రోజు సుమారు 40 వేలకు పైగా ఆహార ప్యాకెట్లును విజయవాడలోని సింగ్ నగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పంచారు. ప్రతీ ఒక్క ఆహార ప్యాకెట్ తో పాటు వాటర్ బాటిల్ కూడా అందజేశారు. అదే రోజు మరో 25 వేల వాటర్ బాటిళ్లను బాధితుల కోసం పంపించారు. 

Latest Videos


ఇక, రెండో రోజూ 60 వేల ఆహార ప్యాకెట్లను, వాటర్ బాటిళ్లను విజయవాడలోని రాజరాజేశ్వరి నగర్, సింగ్ నగర్ ప్రాంతాలతో పాటు సొంత జిల్లా బాపట్లలోని పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు పంపిణీ చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌.  

మూడో రోజు వరదల్లో చిక్కుకున్న చిన్నపిల్లలు, వృద్ధుల కోసం 15 వేల పాల ప్యాకెట్లు, 30 వేల వాటర్ బాటిళ్లను విజయవాడలోని ఓల్డ్ రాజరాజేశ్వరి పేటకు పంపించారు. అంతేగాకుండా బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలకు కూడా పాల ప్యాకెట్లతో పాటు వాటర్ బాటిళ్లను అందించారు. 
నాలుగో రోజు గొల్లపూడి, సింగ్ నగర్, వైఎస్ఆర్ కాలనీ లోని వరద బాధితులకు పాల ప్యాకెట్లతో పాటు, మంచి నీటి బాటిళ్లను అందించారు. మొత్తంగా గడిచిన నాలుగు రోజులుగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ వరద బాధితుల కోసం కోటి రూపాయిల మేర తక్షణ సాయాన్ని అందించి వరద బాధితులకు బాసటగా నిలిచారు.

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. విజయవాడ, బాపట్లలోని వివిధ ప్రాంతాల్లో వరద బాధితులకు తాను చేయదగిన సాయం అందించినట్లు తెలిపారు. ఒకవైపు బాపట్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూనే తన అనుచరులతో సాయంతో బాధితులకు ఎప్పటికప్పుడు ఆహారం, నీరు, పాలు అందించగలిగినట్లు చెప్పారు. వరద బాధితులకు సాయం చేసేందుకు దాతలు కంపెనీలు ముందుకు రావాలని కోరారు.

లైన్మెన్ కుటుంబానికి సాయం..

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొని వస్తూ వరదలో కొట్టుకుపోయిన లైన్‌మెన్ వజ్రాల కోటేశ్వరరావు కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అందజేశారు. ఎక్స్ గ్రేషియా రూ.25 లక్షలతో పాటు విద్యుత్ శాఖ నుంచి కోటేశ్వరరావుకు చెందాల్సిన మరో రూ.13 లక్షలను ఆయన భార్య మాధవికి అందించారు. దాంతో పాటు విద్యుత్ శాఖలో మాధవికి ఉద్యోగమిస్తూ నియామక పత్రాన్ని కూడా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్వయంగా ఇబ్రహీంపట్నంలోని బాధితురాలి ఇంటికి వెళ్లి అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ... కోటేశ్వరరావు పిల్లల చదువులకు అయ్యే ఖర్చులకు సంబంధించి గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే వరకు ఏటా విద్యుత్ శాఖ నుంచి రూ.25 వేల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. వృత్తి పట్ల నిబద్ధత కలిగిన లైన్‌మెన్ కోటేశ్వరరావుని కోల్పోవడం బాధాకరమన్నారు. ఇలాంటి నిబద్ధత గల ఉద్యోగుల విషయంలో తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

click me!