
అప్పట్లో ఏపీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల కాల్ రికార్డ్స్ ప్రకంపనలు సృష్టించాయి. వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన నేతల రాసలీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే... టీడీపీ, బీజేపీ, ఇతర విపక్షాల నాయకులు వాటివైపు వేలెత్తి చూపుతూ విమర్శలు గుప్పించేవారు. గంటా, అరగంటా, సుకన్య, సౌజన్య అంటూ మారుపేర్లు పెట్టి మరీ అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలను ట్రోల్ చేసింది అప్పటి తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ సోషల్ మీడియా.....
ఇప్పుడు.. వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం... అదే స్థానం నుంచి కూటమి తరఫున పోటీ చేసి విజయం సాధించాడు.
ఇప్పుడాయన వ్యవహారం సంచలనం రేపుతోంది. ఓ మహిళతో రాసలీలలు చేస్తున్న వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వంలోని భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టించింది.
అసలే, హాస్టళ్లు, విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాల ఘటనలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటాన పెట్టేశాయి. ఈ క్రమంలో ఏపీని వరదలు ముంచెత్తాయి. విజయవాడను వరద ముంచెత్తడంతో నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు, మంత్రులు, ఇతర యంత్రాంగం అంతా వరద ఉపశమన చర్యల్లో నిమగ్నమయ్యారు. వరద బాధిత ప్రజలకు సాయం అందించే పనుల్లో అందరూ బిజీబిజీగా రాత్రింబవళ్లు గడిపేస్తున్నారు.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద గండి పెట్టే వార్త బయటకు వచ్చింది. ఆ పార్టీ సత్యవేడు ఎమ్మెల్యేపై ఓ మహిళల తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను బెదిరించి లోబరుచుకొని బలాత్కారం చేశారని... ఆధారాలతో సహా బయట పెట్టింది. ముందస్తు ప్లాన్ ప్రకారం.. పెన్ కెమెరాలో వీడియోస్ రికార్డు చేసి మరీ ఎమ్మెల్యేని లాక్ చేసేసింది సదరు మహిళ.
తనను ఎమ్మెల్యే వేధిస్తున్నాడని.. తనకు ప్రాణ హాని ఉందని నేరుగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు, నారా లోకేశ్‌లకు ఫిర్యాదు చేసింది సదరు మహిళ. అయినా వారు పట్టించుకోలేదంటూ మీడియా ముందుకు వచ్చేసింది.
ఆ మహిళ సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీలో సత్యవేడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలినని పేర్కొన్నారు. ‘‘మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు... సత్యవేడు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలిని..... నాకు ఇద్దరు కుమార్తెలున్నారు. నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మహాశక్తి, యువగళం, బాబుతో నేను, బాదుడే బాదుడు, సూపర సిక్స్ కార్యక్రమాలతో పాటు ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోల్లో పాల్గొన్నాను. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కె.ఆదిమూలం అవినీతిపై నిరసన కార్యక్రమాలు చేసినాను. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలంని మన పార్టీ అభ్యర్థిగా ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి, బీ ఫాం వద్దని కూడా నేను గట్టిగా వ్యతిరేకిచినాను. అయినా అతనికి బీ ఫాం ఇచ్చిన తరువాత.. మీ ఆదేశాల ప్రకారం నేను అన్ని మండలాల్లోని మహిళా అధ్యక్షులను, మహిళా నాయకులను కలుపుకొని పార్టీ విజయం కోసం, తమరు ముఖ్యమంత్రి కావడం కోసం అహర్నిషలు కష్టపడి కె.ఆదిమూలంని గెలిపించినాము.’’
కానీ, కె.ఆదిమూలం ఎమ్మెల్యే అయిన తరువాత నాపై కక్షగట్టి, అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, నాతో సె**క్స్ చేయాలని ఒత్తిడి చేశాడు. నేను తప్పించుకుంటూ వచ్చాను. నాకు ఫోన్లలోను, నేరుగా అతని కోరికను తీర్చాలని బెదిరించి భయబ్రాంతులకు గురిచేసేవాడు. నేను ఈ కామాంధుడైన ఆదిమూలం వేధింపులను భరించలేక 06-07-2024 తేదీన తిరుపతి భీమాస్ ప్యారడైజ్‌కు రూమ్ నెం.109కి సాయంత్రం 4.00 గంటలకు, ఇంకా, 17-07-2024 తేదీన భీమాస్ ప్యారడైజ్ రూమ్ నెం.105 మధ్యాహ్నం 3.00 గంటలకు ఆదిమూలం చెప్పిన ప్రకారం వెళ్లాను. అక్కడ నన్ను లైంగికంగా వేధించాడు.
తరువాత పదేపదే అర్ధరాత్రులు, ఎప్పుడంటే అప్పుడు ఫోన్లు చేస్తూ నన్ను రమ్మని టార్చర్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని నా భర్త గ్రహించి నీకు ఎమ్మెల్యేతో అర్ధరాత్రులు ఏం ఫోన్లు అతనితో నీకు ఏమి సంబంధం అని గట్టి బెదిరించినాడు. నేను నా భర్తకు జరిగిన విషయాన్ని వివరించినాను.
నా భర్త సూచనల మేరకు ఆదిమూలంకి బుద్ది చెప్పాలని, ఆదిమూలం కామందుడి నుండి కాపాడుట కొరకు ఆదిమూలం మళ్ళీ పిలిచిన తేది ప్రకారము 10-07-2024 తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు పెన్ కెమెరాతో భీమాస్ ప్యారడైజ్ రూమ్ నెం.105 వెళ్లాను. అతను చేస్తున్న కామ క్రీడలను పెన్ కెమేరాలో రికార్డు చేసి నా భర్తకు అప్పజెప్పాను. తమరు పై విషయాన్ని పరిశీలించి, ఆదిమూలంపై చట్టపరమైన చర్యలు తీసుకొని, నా కుటుంబ సభ్యులకు ప్రాణ రక్షణ కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను’’ అని బాధిత మహిళ చంద్రబాబు ఫిర్యాదు చేశారు.
ఇదే విషయాన్ని గురువారం ప్రెస్ మీట్‌లో వెల్లడించింది బాధిత మహిళ. తనను, తన కుటుంబాన్ని రక్షించాలని వేడుకున్నారు. ఈ వ్యవహారం ఏపీలో సంచలనం రేపింది.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన తెలుగుదేశం పార్టీ చర్యలకు ఉపక్రమించింది. పార్టీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రకటన చేశారు.
అయితే, ఆదిమూలంపై సత్యవేడు నియోజకవర్గంలో అటు వైసీపీలో, ఇటు టీడీపీలో వ్యతిరేకత ఉంది. మొదటి నుంచి ఆయన్ను ఇరు పార్టీల శ్రేణులు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఆదిమూలం టీడీపీ బీ ఫాం ఇవ్వడాన్ని స్వయంగా అదే పార్టీ కేడర్ తప్పుపట్టింది. కూటమి హవాతో ఆదిమూలం ఎన్నికల్లో గెలిచినప్పటికీ కేడర్‌లో కోపం మాత్రం తగ్గలేదు.
ఈ నేపథ్యంలో ఆదిమూలం సదరు మహిళను వేధించారా? లేక, అయన్ని ఎవరైనా ట్రాప్ చేశారా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.