మరోవైపు, భారీ విపత్తు కారణంగా చిగురుటాకులా వణికిపోయిన ఆంధ్రప్రదేశ్ తిరిగి కోలుకునేలా సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని కోరారు ఎంపీ వల్లభనేని బాలశౌరి. వరదలు, ఆకాల వర్షాల వల్ల ఆంధ్రప్రదేశకు కలిగిన భారీ నష్టాన్ని ప్రకృతి విపత్తుగా ప్రకటించి కేంద్రం, లోక్ సభ, రాజ్యసభలోని ఎంపీలందరూ ఆర్థిక సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌లకు వేర్వేరుగా లేఖలు రాశారు.
ముఖ్యంగా వరదల ప్రభావంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు కోలుకోలేని దెబ్బ తగిలిందని ఎంపీ బాలశౌరి తెలిపారు. ప్రజలు సర్వస్వం కోల్పోయారని లేఖలో వివరించారు. వేల ఎకరాల్లో పంట నష్టం, లక్షల మంది ఇళ్లు, ఆస్తులు కోల్పోయి కట్టుబట్టలతో నడిరోడ్డుపైకి వచ్చేశారన్నారు.
రెండు జిల్లాల్లో కలిపి కనీసం 50 వరకూ ప్రాణనష్టం జరిగిందని, రహదారులు, కట్టలు, రైల్వే ట్రాక్‌లు పెద్దఎత్తున దెబ్బతిన్నాయని తెలిపారు. రెండు జిల్లాల్లో కలిపి కనీసం నాలుగు లక్షల మందికి పైగా ప్రజలపై వరదల ప్రభావం పడిందని, అన్ని రకాలుగానూ నష్టపోయారని వెల్లడించారు.