మచిలీపట్నం : బందరు ప్రజల చిరకాల కోరిక త్వరలోనే తీరనుందని ఆంధ్ర ప్రదేశ్ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎప్పటినుండో కోరుతున్న మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్‌కు మార్గం సుగమ అయ్యిందని ఆయన తెలిపారు. ఈ లైన్ ప్రజా రవాణాతో పాటు వాణిజ్య పరంగానూ లాభసాటిగా ఉంటుందని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ఎక్సైజ్, గనులు, భుగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తుతం దేశ రాజధాని న్యూడిల్లీలో పర్యటిస్తున్నారు. తన మంత్రిత్వశాఖలకు చెందిన పనులతో పాటు సొంత నియోజకవర్గం మచిలీపట్నం అభివృద్దికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులను కలుస్తున్నారు రవీంద్ర. ఈ క్రమంలోనే రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి మచిలీపట్నం - రేపల్లే మధ్య 45 కిలోమీటర్ల రైల్వే లైన్ ను పూర్తిచేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు రవీంద్ర.