ys jagan
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. అడ్డగోలు జీవోలతో సాక్షి మీడియాకి గత ప్రభుత్వం 403 కోట్ల రూపాయలు ప్రకటనల పేరుతో లబ్ధి చేకూర్చిందని ఆరోపించారు. ఇలాంటి ఆర్థిక అవకతవకల కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని చెప్పారు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని అన్నవరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అడ్డగోలు జీవోని తీసుకువచ్చి సాక్షి మీడియాకి 403 కోట్ల రూపాయలు, మిగిలిన అన్ని పత్రికలకు కలిపి 488 కోట్ల రూపాయలు ప్రకటనల రూపంలో ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం చేసిన బాధ్యతా రాహిత్య పాలన కారణంగా రాష్ట్రం అభివృద్ధిలో మరో 15 సంవత్సరాలు వెనుకపడిపోయిందన్నారు.
Chandra Babu
ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రాభివృద్ధి గాడిలో పెట్టేందుకు సమర్థుడైన నాయకుడిగా చంద్రబాబునాయుడిని ప్రజలు గుర్తించి తమ పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని బాధ్యతగా భావించి ప్రజా క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేసిందని, 2.70 లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చుచేశామని చెప్పినప్పటికీ.. మిగిలిన 8 లక్షల కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియదన్నారు.
‘‘రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో జరిగిన ఆర్థిక అరాచకానికి సంబంధించి సాక్ష్యాలతో సహా ముఖ్యమంత్రి శ్వేతపత్రాలు విడుదల చేశారు. వాటిల్లో ఏమైనా అబద్దాలు ఉంటె రుజువులతో వచ్చి నిరూపించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రాభివృద్ధికి సహకరించమని ప్రతిపక్షాన్ని కోరాం. ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా ప్రతిపక్షం పెట్టుకుంది’’ అని మంత్రి పార్థసారథి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 65 లక్షల మందికి ప్రతీ నెల 2,712 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా పంపిణీ చేస్తున్నారు. గత ప్రభుత్వానికి పేదలకు పెన్షన్‌ను 2 వేల నుంచి 3 వేల రూపాయలకు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పడితే తమ ప్రభుత్వం 10 రోజుల్లోనే 3 వేల నుంచి 4 వేల రూపాయలకు పెంచింది. 3 నెలల బకాయిలను కూడా అందించింది. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో వాలంటీర్లే సర్వం అన్నట్లు గత ప్రభుత్వం చిత్రీకరిస్తే.. వారి అవసరం లేకుండానే చంద్రబాబు ప్రభుత్వం పనులు చేస్తోంది. రాష్ట్రంలోని ఉద్యోగులతో ఒక్కరోజులోనే ఆగస్టు నెల పింఛన్లను 98 శాతం పంపిణీ చేశారు.