ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర సరకులైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌లో అందనంత ఎక్కువలో ఉన్న నిత్యవసర సరకుల ధరలను నెల రోజుల వ్యవధిలోనే రెండో సారి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.160 ఉండగా.. రూ.150కి తగ్గించారు. బియ్యం రూ.48 ఉండగా రూ.47కి, స్టీమ్డ్ బియ్యం రూ.49 నుంచి రూ.48కి తగ్గించారు. తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఇప్పటికే విక్రయాలు ప్రారంభించారు.
Nadendla Manohar
అన్ని జిల్లాల్లో ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గడిచిన నెల రోజులలోపే బియ్యం, కంది పప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ- జనసేన- కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూలై నెలలో మొదటిసారి నిత్యవసర సరకుల ధరలను తగ్గించింది. నిత్యవసరాల్లో కీలకమైన బియ్యం, కందిపప్పును సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
గతంలో 181 రూపాయలు ఉన్న కిలో కందిపప్పు ధరను 160 రూపాయలకు తగ్గించారు. 52 రూపాయలు ఉన్న కిలో బియ్యం ధరను 48 రూపాయలకు తగ్గించారు. స్టీమ్డ్ బియ్యం రేటును 56 రూపాయల నుంచి 49 రూపాయలకు తగ్గించారు. ఇవన్నీ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అందించేలా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
ప్రస్తుతం ఈ కందిపప్పు ధర 160 రూపాయల నుంచి రూ.150కి తగ్గించారు. బియ్యం రూ.48 నుంచి రూ.47కి, స్టీమ్డ్ బియ్యం రూ.49 నుంచి రూ.48కి తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పేద ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన సరకులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. బహిరంగ మార్కెట్‌లో విపరీతంగా పెరిగిన నిత్యవసరాల ధరల నుంచి పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించింది.
కాగా, నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు నిత్యవసర సరకుల ధరలను తగ్గించడంపై సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన సరకులు మార్కెట్ రేటు కంటే తక్కువకే లభిస్తుండటంతో ఆనంద పడుతున్నారు. నెలవారీ ఇంటి ఖర్చులు కూడా తగ్గాయని చెబుతున్నారు.